దళిత, గిరిజన సామాజిక తరగతుల సంక్షేమానికి సంబంధించిన రిజర్వేషన్లపై తరచుగా వివాదాలు, వాదో పవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజా ప్రాతినిధ్య పదవు ల్లోని రిజర్వేషన్ల కంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్లపైనే ఆందోళనకర, ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నవి. ప్రజా ప్రాతినిధ్య పదవుల్లో కొందరు దళిత, గిరిజన నాయకులు ఉండడం కంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్లే ఎంతోకొంత సామాజిక న్యాయం నెరవేరుతోంది. అందువల్లనే ఉద్యోగాల్లో రిజర్వేషన్లపైనే అస హనం, కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నవి. రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఏడాదిలోపే ఎస్సీ, ఎస్టీలకు లభిస్తున్న విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషనుపై హైకోర్టు, సుప్రీం కోర్ట్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి.
ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చొర వతో రాజ్యాంగం ఆర్టికల్ 15కి చేసిన సవరణతో మొదటి ప్రమాదం తప్పింది. గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో కూడా వివిధ సందర్భాల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు యిచ్చిన తీర్పుల వలన మరికొన్నిసార్లు రాజ్యాంగానికి స్వల్పమైన సవరణలు చేయాల్సివచ్చింది. కాగా జార్ఖండ్ ప్రభుత్వం 2012లో కొన్ని ఉద్యోగ ఖాళీలను రిజర్వేషన్లు పాటించకుండా యిచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ ఈనెల ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు యిచ్చిన తీర్పుతో రిజర్వేషన్లు మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితి దాపురించింది.
ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపనుల శాఖలోని అసిస్టెంట్ ఇంజనీర్ల ప్రమోషన్లలో ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని 2012 సెప్టెంబర్ 5న ఇచ్చిన ఉత్తర్వులను వినోద్ కుమార్ మరో ఇద్దరు ఎస్సీ తరగతికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ట్ర హైకోర్టులో చాలెంజ్ చేయడం జరిగింది. దానిపైన తీర్పు చెప్పిన హైకోర్టు పదోన్న తుల్లో రిజర్వేషన్లు పాటించాలా అక్కర్లేదా అనేది నిర్ణయించడానికి సదరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆయా సామాజిక తరగతుల ప్రాతినిధ్యం ఏ మేరకు ఉన్నదనే విషయమై నాలుగు నెలల్లో సమాచారం సేకరించాలని, దాని ఆధారంగా ప్రాతినిధ్యం తక్కువగా వున్న సామాజిక తరగతుల వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తీర్పులో ఒక ముఖ్యమైన విషయం ఇమిడివుంది. రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం అనే ప్రశ్నలకు కూడా అది సమా ధానం కావచ్చు. దాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును విచారించిన జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్లు ప్రాధమిక హక్కు కాదు అంటూ ఇచ్చిన తీర్పుతో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది.
ఇరువురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన తీర్పు సారాంశం ఇలా ఉంది. పబ్లిక్ సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడాల్సిన అవసరం లేదు. ప్రమోషన్లలో రిజర్వేషన్ కోరడానికి ఎవరికీ ప్రాథమిక హక్కేమీ కాదు. రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు. రిజర్వేషన్లు ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణాధికారం. రాజ్యాంగం ఆర్టికల్ 16(4) మరియు ఆర్టికల్ 16(4ఏ) ఆధారంగా ఈ తీర్పు చెప్పాల్సి వస్తుందని న్యాయ మూర్తులు చెప్పారు. ఆర్టికల్ 16(4)– ప్రభుత్వ సర్వీసుల్లో వెనకబడిన తరగతుల ప్రాతినిధ్యం తగినంత లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే సంబంధిత తరగతుల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆర్టికల్ 16(4ఏ)– ప్రభుత్వ సర్వీసుల్లోని ఏ తరగతి పోస్టులకైనా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తరగతుల వారికి ప్రమోషన్లలో తగినంత ప్రాతినిధ్యం లేదని భావిస్తే వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఏదేమైనా సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్ల ప్రయోజనం ప్రమాదంలో పడే పరిస్థితి దాపురించింది. సహజంగానే దీనిపైన రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు తమ వంతు ఆందోళన వ్యక్తం చేసినవి.
కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో జరిగిన చర్చలో జోక్యం చేసుకుంటూ సున్నితమైన రిజర్వేషన్ల విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని నిందించారు. సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ సమ స్యకు సరైన పరిష్కారం కొరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తుంది అని ప్రకటించారు. కాగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర ఆజాద్ ఈ తీర్పును సమీక్షిం చాలని కోరుతూ ఫిబ్రవరి 11న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. మరికొంతమంది కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతున్నారు.
రాజ్యాంగం ఆర్టికల్స్ 16(4) మరియు 16(4ఏ)లోని పదాలు అలాగే ఉన్నంత కాలం ధర్మాసనాలు మారినా రిజర్వేషన్లకు గ్యారెంటీ ఉంటుందని ఆశించలేము. జ్యుడీషియరీ ఉన్నత స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ తరగతుల ప్రాతినిధ్యం వుంటే మంచిదే, కానీ ఒకరో ఇద్దరో ఉన్నంత మాత్రాన సానుకూల తీర్పులు వస్తాయని ఆశించలేము. ఒకవేళ వచ్చినా పక్షపాతంగా యిచ్చారని ఆక్షేపించే అవకాశమూ ఉంటుంది. కనుక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతుల సామాజిక రిజర్వేషన్ల రక్షణకు స్పష్టమైన చట్టం అనివార్యం, అత్యవసరం.
నాగాటి నారాయణ: ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు, మొబైల్ : 94903 00577
Comments
Please login to add a commentAdd a comment