‘ప్రైవేట్‌’ చదువుకు పట్టం | Nagati Narayana Article On Education Privatization | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’ చదువుకు పట్టం

Published Wed, Apr 17 2019 1:56 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

Nagati Narayana Article On Education Privatization - Sakshi

అభివృద్ధికి కీలకమైన విద్యారంగాన్ని విస్మరించడం వలనే మానవాభివృద్ధి సూచికల్లో భారతదేశం, తెలంగాణ రాష్ట్రం బాగా వెనకబడిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్‌ 2018 అక్టోబరులో ప్రకటించిన మానవ మూలధనం సూచికల్లో  157 దేశాల్లో భారతదేశం 115వ స్థానంలోనే వుండిపోయింది. పొరుగు దేశాలైన శ్రీలంక 72, నేపాల్‌ 102, బంగ్లాదేశ్‌ 106, మయన్మార్‌ 107 స్థానాల్లో ఉన్నాయి. అక్షరాస్యతలో, విద్యాభివృద్ధిలో దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం 28వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదికల్లో ఉన్నది. ఆర్థ్ధికాభివృద్ధిలో దేశం, రాష్ట్రం దూసుకు పోతున్నట్లు పాలకులు గొప్పలు పోతున్నా విద్యారంగంలో అవమానకరమైన పరిస్థితి కనిపిస్తోంది.  

అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ అందరికీ సమాన విద్య అందించాల్సిన లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఆ పని ఐదేళ్లలోనే చేసి చూపిస్తామన్న బీజేపీ/ఎన్డీయే ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. 2015 మార్చిలో ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొన్ని థీమ్స్‌ ప్రకటించి, అదే సంవత్సరం అక్టోబరులో రిటైర్డ్‌ కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ టీఎస్‌ఆర్‌ సుబ్రహ్మణ్యం కమిటీని ప్రధాని మోదీ నియమించారు. ఇచ్చిన గడువులోగా కమిటీ రిపోర్ట్‌  ఇచ్చినా, అది ప్రభుత్వానికి నచ్చకపోవడం వలన బహిరంగ పరచలేదు. పైగా ‘విద్యా విధానం ముసాయిదా కోసం కొన్ని ఇన్‌పుట్స్‌’ పేరుతో మరో చర్చాపత్రం ఎంహెచ్‌ఆర్డీ వెబ్‌సైటులో పెట్టింది. ముసాయిదా పత్రం తయారీ కోసమంటూ ఇస్రో మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. కస్తూరిరంగన్‌ కమిటీని నియమించారు.  

విద్యావిధానం విషయంలో రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరు కూడా కేంద్రం లాగే వుంది. టీఆర్‌ఎస్‌ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ‘అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించినప్పుడే పేదపిల్లలు చదువుకోవడానికి వీలవుతుంది. ఆ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించే విధంగా నూతన విధానాన్ని అవలంబిస్తుంది’ అని పేర్కొన్నారు. ఇంతవరకు అలాంటి ఊసే లేదు. కేజీ టు పీజీ విద్యా మిషన్‌ పేరుతో 520 గురుకులాలు ఏర్పాటు చేసి, వాటిలో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు అవకాశం కల్పించింది. కానీ 24లక్షలమంది విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. ప్రైవేట్‌ విద్యావ్యాపారాన్ని నియంత్రించే ఫీ రెగ్యులేషన్‌ ఉత్తర్వులు నెల రోజుల్లోనే ఇస్తామని, ఇవ్వలేక పోయింది. ఫీ రెగ్యులేషన్‌ కోసం ప్రొఫెసర్‌ టీ. తిరుపతి రావు కమిటీ ఇచ్చిన నివేదికను కూడా బైట పెట్టలేదు. 

దేశంలో సత్వర విద్యాభివృద్ధి కోసం కేంద్ర బడ్జె టులో పది శాతం చొప్పున, రాష్ట్రాల బడ్జెట్లలో ఇరవై శాతం చొప్పున విద్యారంగానికి నిధులు కేటాయించా లని 1958 లో బి.జి.ఖేర్‌ కమిటీ చేసిన సిఫార్సు గానీ, జాతీయ స్థూల ఉత్పత్తిలో ఆరుశాతం నిధులను విద్యకు వెచ్చించాలని 1968 లో డి.ఎస్‌.కొఠారి కమిషన్‌ చేసిన రికమండేషన్‌ గానీ ఇంతవరకు అమలు కాలేదు. కాగా గడచిన ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో విద్యారంగం వాటా ఆయేటికాయేడు క్షీణించింది. తొలి (2014–15) బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 1,10,351 కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వం, తదుపరి సంవత్సరాల్లో తగ్గిస్తూ చివరి (2019–20) బడ్జెట్‌లో రూ. 93,848 కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లో విద్యారంగం వాటా 6.15 శాతం నుండి 3.30 శాతంకి తగ్గిపోయింది. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫైనాన్సింగ్‌ ఏజెన్సీ (హెచ్‌ఈఎఫ్‌ఏ) రూ. 24,430 కోట్లు అడిగితే గతేడాది ఇచ్చిన రూ. 2,750 కోట్లు కంటే తక్కువగా రూ. 2,100 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో యాబై శాతం పైగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, లెక్చరర్ల పోస్టులు భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం తొలి బడ్జెట్‌లో విద్యారంగం వాటా 10.88 శాతం ఉండగా చివరి బడ్జెట్‌లో 6.71 శాతానికి దిగజారింది.  

ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ప్రైవేట్‌ విద్యావ్యాపారం విస్తరించింది. గడచిన ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కోటి ముప్పై లక్షల మంది విద్యార్థులు తగ్గిపోగా, ప్రైవేట్‌ స్కూళ్లలో కోటి డెబ్బై లక్షల మంది పెరిగారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 52% బడి పిల్లలు ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూళ్లలో ఉన్నారు. గత నాలుగేళ్లలో విద్యార్థుల సంఖ్య సర్కార్‌ బడులలో 65 వేలు క్షీణించి, ప్రైవేట్‌ స్కూల్సులో 1.20 లక్షలు పెరిగినట్లు కాగ్‌ రిపోర్టు పేర్కొంది. ఉన్నత, వృత్తి విద్యల్లోని విద్యార్థుల్లో 80%పైగా ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోనే ఉన్నారు.

కేంద్రప్రభుత్వ అసంబద్ధ చర్యలతో విద్యారంగంలో వినాశకర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఐదు, ఏడు తరగతుల్లో డిటెన్షన్‌ విధానం తేవటం వలన బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. రైతుల పేదరికాన్ని, దళితుల దయనీయ స్థితిని వివరించే చారిత్రక పాఠాలను సిలబస్‌ నుంచి తొలగిస్తూ విద్యార్థులు చుట్టూ ఉన్న సామాజిక సమస్యలు తెలుసుకోకుండా చేస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థలలో ఆర్‌ఎస్‌ఎస్‌లో శిక్షణ పొందిన వారినే నియమిస్తూ విద్యారంగంలో లౌకిక పునాదులను పెకి లించి వేస్తోంది. భారతీయ శిక్షా బోర్డ్‌ పేరుతో వేద విద్య కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి యోగా గురువైన బాబా రాందేవ్‌కి దానిని అప్పగిస్తోంది. విద్యలో ఫెయిలైన ప్రభుత్వాలను డిటెయిన్‌ చేస్తేనే విద్యారంగానికి మేలు జరుగుతుంది. 
-నాగటి నారాయణ
nagati1956@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement