ఉన్నతశ్రేణి విద్య మిథ్యేనా?! | Sakshi Editorial On World University Rankings | Sakshi
Sakshi News home page

ఉన్నతశ్రేణి విద్య మిథ్యేనా?!

Published Fri, Jun 30 2023 3:49 AM | Last Updated on Fri, Jun 30 2023 3:49 AM

Sakshi Editorial On World University Rankings

ఒకప్పుడు ప్రపంచానికి నలందా, తక్షశిలవంటి అత్యుత్తమ శ్రేణి విద్యాకేంద్రాలను అందించి, విశ్వమంతటా విజ్ఞాన కాంతులు వెదజల్లిన భారత్‌ చాన్నాళ్లుగా విద్యారంగంలో వెలవెలబోతోందన్న అసంతృప్తి ఉంది. ప్రతిష్ఠాత్మక క్యూఎస్‌ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ తాజా జాబితాలో మొదటి 150లో మన దేశానికి చోటుదక్కింది. అంతర్జాతీయంగా చూస్తే ఇదేమంత గొప్ప ర్యాంకు కాకపోవచ్చు. వినడానికి కాస్త ఇబ్బందిగా కూడా ఉండొచ్చు.

ఎందుకంటే ప్రపంచ శ్రేణి విద్యాసంస్థలనదగ్గ 1,500 విశ్వవిద్యాలయాల జాబితాను ఆ సంస్థ ప్రకటిస్తే మొదటి పదిలో, కనీసం మొదటి యాభైలో, పోనీ... మొదటి వందలో మన విద్యాసంస్థలేవీ లేవు. బొంబాయి ఐఐటీ ఈ జాబితాలో 149వ స్థానాన్ని పొందగలిగింది. ఆ సంస్థకు ఈ స్థాయి గౌరవం దక్కటం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే ప్రథమం.

బెంగళూరు ఐఐఎస్‌సీ తొలి 200 ర్యాంకుల్లో స్థానం దక్కించుకోలేకపోగా, మద్రాస్‌ ఐఐటీ నిరుడున్న 174వ స్థానాన్ని చేజార్చుకుని 197కి పోయింది. దాన్ని బట్టి మన ఉన్నత విద్యాకేంద్రాల తీరుతెన్నులెలా ఉన్నాయో సులభంగానే గ్రహించవచ్చు. ఏటా రివాజుగా క్యూఎస్‌ ర్యాంకులు ప్రక టించటం, అందులో మన యూనివర్సిటీలు ఎక్కడో అట్టడుగున ఉండటం అనేకులను బాధిస్తోంది.

ప్రపంచం మొత్తంలో 30,000 వరకూ విశ్వవిద్యాలయాలున్నాయి. క్యూఎస్‌ సంస్థ ఏటా అందులో అత్యుత్తమంగా భావించిన 5 శాతాన్ని... అంటే 1,500 యూనివర్సిటీలను ఎంపిక చేసుకుని వాటి వాటి అర్హతల ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది. జీవితంలో ఎదగాలన్న తపన, తాప త్రయం ఉన్నవారు...తమ జ్ఞాన తృష్ణ తీర్చుకోవటానికి అనువైన విద్యాకేంద్రం కోసం అన్వేషిస్తున్న వారు మెరుగైన విశ్వవిద్యాలయం కోసం వెదుకులాడతారు.

ప్రపంచం ఇంతగా ఎదిగినా, బహుళ రంగాల్లో అభివృద్ధి సాధించినా అత్యుత్తమ శ్రేణి సంస్థను ఎంపిక చేసుకోవటం ఏ విద్యార్థికైనా అంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి విశ్వవిద్యాలయమూ తమ దగ్గరున్న అధ్యాపక బృందం గురించి, తమ బోధనాంశాల తీరుతెన్నుల గురించి, పరిశోధనలకు అందే ప్రాధాన్యత గురించి స్వోత్కర్షలకు పోతుంది.

కానీ తటస్థ సంస్థలు నిర్దిష్టమైన గీటురాళ్లు రూపొందించుకుని వాటి మంచిచెడ్డలను చెప్పగలిగితే విద్యార్జన కోసం తాపత్రయపడే యువతకు ఎంపిక సులభమవుతుంది. అంతేకాదు...ఈ తులనాత్మక విశ్లేషణ పరిశోధన కోసం తపించే విద్యార్థులకూ, విధాన నిర్ణేతలకూ కూడా సాయపడుతుంది. విధానపరమైన నిర్ణయాల కోసం చేసే అధ్యయనంలో ఏ విశ్వవిద్యా లయం తోడ్పాటు తీసుకోవచ్చునో, నిధుల విడుదలలో ఏ సంస్థకు ప్రాధాన్యం ఇవ్వాలో విధాన నిర్ణేతలు నిర్ణయించుకుంటారు.

ప్రైవేటు రంగ పరిశ్రమలకు కూడా ఈ ర్యాంకింగ్‌లే ఆధారం. క్యూఎస్‌ సంస్థ ఆ పని చేస్తోంది. ఈనెల మొదటివారంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ అత్యుత్తమ శ్రేణి విద్యాసంస్థల జాబితాను విడుదల చేసింది. అందులో విశ్వవిద్యాలయాల్లో బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రథమ స్థానం పొందగా, ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ రెండో స్థానంలో, అక్కడి జమియా మిలియా ఇస్లామియా మూడో స్థానంలో నిలిచాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పదో ర్యాంకులో ఉంది. అలాగే ఐఐటీల్లో మద్రాస్‌ ఐఐటీ ప్రథమ స్థానంలో, బొంబాయి ఐఐటీ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. 

అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల విషయంలో విమర్శలు కూడా ఉన్నాయి.  విశ్వవిద్యాల యాల్లో సాగే పరిశోధనలు, ఆ సంస్థల పేరుప్రఖ్యాతులు, అక్కడుండే విద్యార్థి–అధ్యాపక నిష్పత్తి, అంతర్జాతీయ వైవిధ్యత తదితరాలను క్యూఎస్‌ వంటి సంస్థలు గీటురాళ్లుగా తీసుకుంటున్నాయి. సహజంగానే ఈ అంశాలన్నిటా సంపన్న దేశాల్లోని విశ్వవిద్యాలయాలే ముందంజలో ఉంటాయి. వాటికి అటు ప్రభుత్వాలనుంచీ, ఇటు ప్రైవేటు సంస్థలనుంచీ నిధులు దండిగా వస్తాయి.

వెనకబడిన దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో అత్యుత్తమ శ్రేణి అధ్యాపకులున్నా, అక్కడ మెరికల్లాంటి విద్యార్థులు రూపొందుతున్నా క్యూఎస్‌ సంస్థకు పట్టవు. అందువల్లే ఇలాంటి జాబితాల విశ్వసనీయతపైనా, వాటి కచ్చితత్వంపైనా విద్యారంగ నిపుణులు పెదవి విరుస్తుంటారు. ఈ విమర్శలను పరిగణనలోకి తీసుకుని కాబోలు... విద్యాసంస్థల నిర్వహణ, పరిశోధనలకుండే అంతర్జాతీయ నెట్‌వర్క్, అక్కడి విద్యార్థులకు లభించే ఉద్యోగావకాశాలు అనే అంశాలను ఈసారి చేర్చింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.

మన దేశంలో ఉన్నత విద్యారంగాన్ని గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. పూర్తికాలం పనిచేసే అత్యుత్తమ అధ్యాపకులను ఎంపిక చేయటానికి, అవసరమైన నిధులు కేటాయించి విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దటానికి పాలకులు ముందుకు రావటం లేదు. ఖాళీ అవు తున్న స్థానాల్లో కాంట్రాక్టు లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకుంటున్నారు. మన విశ్వవిద్యా లయాలకు ప్రపంచశ్రేణి గుర్తింపు తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించడానికి మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఆధ్వర్యంలో 13 మందితో నిపుణుల కమిటీని ఏర్పాటుచేశారు.

ఆ తర్వాత ప్రభుత్వ రంగంలో పది, ప్రైవేటు రంగంలో పది ఉన్నత విద్యాసంస్థలను ఆ కమిటీ ఎంపిక చేసింది. వాటికి తలో వందకోట్లు నిధులిస్తున్నామని కూడా ప్రకటించారు. అయితే క్యూఎస్‌ ఎంపిక చేసిన జాబితాలో ఒక్క బొంబాయి ఐఐటీ మాత్రమే ఆ మాత్రమైనా స్థానం సంపాదించుకోగలిగింది. ర్యాంకింగ్‌ల సంగతలావుంచి మన ఉన్నత విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరమైతే ఉంది. ఆ దిశగా చర్యలకు ఉపక్రమిస్తే భావి తరాలు ఉన్నత స్థాయికి ఎదుగుతాయి. మన దేశానికి మళ్లీ గత వైభవం సాధ్యమవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement