University Rankings
-
భారత వర్సిటీలకు అగ్రాసనం
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాత క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) ఆసియా వర్సిటీల ర్యాంకింగ్స్‌లో భారత్ అత్యధిక విద్యా సంస్థలతో అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం 856 విద్యా సంస్థలతో క్యూఎస్ ఆసియా వర్సిటీ ర్యాంకులను విడుదల చేసింది. ఈ జాబితాలో 148 వర్సిటీలతో భారత్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. గతేడాదితో పోలిస్తే కొత్తగా 37 భారతీయ వర్సిటీలు ర్యాంకులు పొందాయి. టాప్–100 ర్యాంకుల్లో ఏడు భారతీయ వర్సిటీలకు చోటు దక్కింది. క్యూఎస్ సంస్థ అంతర్జాతీయంగా ఉన్నత విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన వర్సిటీలకు 11 సూచికల్లో విశ్లేషించి ర్యాంకులను ఇస్తోంది. దేశంలో ఐఐటీ బాంబే టాప్ ఆసియా క్యూఎస్ ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు మునుపటి ఎడిషన్‌తో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. ఐఐటీ–బాంబే గతేడాది మాదిరిగానే 40వ ర్యాంకులో కొనసాగుతూ భారత్‌లో ఉత్తమ వర్సిటీగా నిలిచింది. ఆ తర్వాత ఐఐటీ–ఢిల్లీ (46), ఐఐటీ–మద్రాస్ (53) స్థిరంగా ఉన్నాయి. ఐఐఎస్సీ బెంగళూరు (58), ఐఐటీ ఖరగ్‌పూర్ (59), ఐఐటీ కాన్పూర్ (63), ఢిల్లీ వర్సిటీ(94) వందలోపు ర్యాంకులు సాధించాయి. 100–200 ర్యాంకింగ్స్‌లో ఐఐటీ గౌహతి 111, ఐఐటీ రూర్కీ 116వ ర్యాంకులో నిలిచాయి. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ 117, బెనారస్ హిందూ వర్సిటీలకు 199, గతేడాది 185 స్థానంలో ఉన్న ఛండీగఢ్ వర్సిటీ 149కి వచ్చింది. కోయంబత్తూరులోని భారతీయార్ వర్సిటీ 205 నుంచి 171కి, అమిటీ వర్సిటీ 200 నుంచి 186కి, వెల్లూరులోని విట్ పది స్థానాలు మెరుగుపర్చుకుని 163 ర్యాంకును సొంతం చేసుకున్నాయి. ఆసియా టాప్ వర్సిటీ ‘పెకింగ్’ భారత్ తర్వాత క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌లో చైనా 133, జపాన్ 96 వర్సిటీలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మయన్మార్, కంబోడియా, నేపాల్ తొలిసారిగా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన పెకింగ్ విశ్వవిద్యాలయం వరుసగా రెండవ ఏడాది టాప్ వర్సిటీగా నిలిచింది. హాంకాంగ్ విశ్వవిద్యాలయం 4వ స్థానం నుంచి రెండవ స్థానానికి ఎగబాకింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్) ఈ ఏడాది రెండో స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయింది. నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ (ఎన్టీయూ) ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. ఏపీ నుంచి ఐదు ప్రభుత్వ వర్సిటీలు తెలుగు రాష్ట్రాల నుంచి 12 వర్సిటీలకు క్యూఎస్ ఆసియా వర్సిటీల జాబితాలో స్థానం లభించింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జపాన్‌కు చెందిన కుమామోటో వర్సిటీతో సమానంగా 228 ర్యాంకును పంచుకుంటోంది. ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్ (301–350), ఉస్మానియా, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర (451–500), అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ (551–600), గుంటూరులోని ఆచార్య నాగార్జున (601–650), విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ, అనంతపురంలోని జేఎన్టీయూ (651–700), ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌లోని ఐసీఎఫ్ఏఐ, గుంటూరులోని కేఎల్‌యూ, విశాఖలోని గీతమ్, విజ్ఞాన్ వర్సిటీలు ఉన్నాయి. టాప్ 10 ఆసియా విశ్వవిద్యాలయాలివీ.. ♦ పెకింగ్ విశ్వవిద్యాలయం (చైనా) ♦ హాంకాంగ్ విశ్వవిద్యాలయం (హాంకాంగ్ ఎస్ఏఆర్) ♦ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (సింగపూర్) ♦ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (సింగపూర్) ♦ సింగువా విశ్వవిద్యాలయం (చైనా) ♦ జెజియాంగ్ విశ్వవిద్యాలయం (చైనా) ♦ ఫుడాన్ విశ్వవిద్యాలయం (చైనా) ♦ యోన్సీ విశ్వవిద్యాలయం (సౌత్ కొరియా) ♦ కొరియా విశ్వవిద్యాలయం (సౌత్ కొరియా) ♦ చైనీస్ యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్ (హాంకాంగ్ ఎస్ఏఆర్) -
ఉన్నతశ్రేణి విద్య మిథ్యేనా?!
ఒకప్పుడు ప్రపంచానికి నలందా, తక్షశిలవంటి అత్యుత్తమ శ్రేణి విద్యాకేంద్రాలను అందించి, విశ్వమంతటా విజ్ఞాన కాంతులు వెదజల్లిన భారత్ చాన్నాళ్లుగా విద్యారంగంలో వెలవెలబోతోందన్న అసంతృప్తి ఉంది. ప్రతిష్ఠాత్మక క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ తాజా జాబితాలో మొదటి 150లో మన దేశానికి చోటుదక్కింది. అంతర్జాతీయంగా చూస్తే ఇదేమంత గొప్ప ర్యాంకు కాకపోవచ్చు. వినడానికి కాస్త ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రపంచ శ్రేణి విద్యాసంస్థలనదగ్గ 1,500 విశ్వవిద్యాలయాల జాబితాను ఆ సంస్థ ప్రకటిస్తే మొదటి పదిలో, కనీసం మొదటి యాభైలో, పోనీ... మొదటి వందలో మన విద్యాసంస్థలేవీ లేవు. బొంబాయి ఐఐటీ ఈ జాబితాలో 149వ స్థానాన్ని పొందగలిగింది. ఆ సంస్థకు ఈ స్థాయి గౌరవం దక్కటం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే ప్రథమం. బెంగళూరు ఐఐఎస్సీ తొలి 200 ర్యాంకుల్లో స్థానం దక్కించుకోలేకపోగా, మద్రాస్ ఐఐటీ నిరుడున్న 174వ స్థానాన్ని చేజార్చుకుని 197కి పోయింది. దాన్ని బట్టి మన ఉన్నత విద్యాకేంద్రాల తీరుతెన్నులెలా ఉన్నాయో సులభంగానే గ్రహించవచ్చు. ఏటా రివాజుగా క్యూఎస్ ర్యాంకులు ప్రక టించటం, అందులో మన యూనివర్సిటీలు ఎక్కడో అట్టడుగున ఉండటం అనేకులను బాధిస్తోంది. ప్రపంచం మొత్తంలో 30,000 వరకూ విశ్వవిద్యాలయాలున్నాయి. క్యూఎస్ సంస్థ ఏటా అందులో అత్యుత్తమంగా భావించిన 5 శాతాన్ని... అంటే 1,500 యూనివర్సిటీలను ఎంపిక చేసుకుని వాటి వాటి అర్హతల ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది. జీవితంలో ఎదగాలన్న తపన, తాప త్రయం ఉన్నవారు...తమ జ్ఞాన తృష్ణ తీర్చుకోవటానికి అనువైన విద్యాకేంద్రం కోసం అన్వేషిస్తున్న వారు మెరుగైన విశ్వవిద్యాలయం కోసం వెదుకులాడతారు. ప్రపంచం ఇంతగా ఎదిగినా, బహుళ రంగాల్లో అభివృద్ధి సాధించినా అత్యుత్తమ శ్రేణి సంస్థను ఎంపిక చేసుకోవటం ఏ విద్యార్థికైనా అంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి విశ్వవిద్యాలయమూ తమ దగ్గరున్న అధ్యాపక బృందం గురించి, తమ బోధనాంశాల తీరుతెన్నుల గురించి, పరిశోధనలకు అందే ప్రాధాన్యత గురించి స్వోత్కర్షలకు పోతుంది. కానీ తటస్థ సంస్థలు నిర్దిష్టమైన గీటురాళ్లు రూపొందించుకుని వాటి మంచిచెడ్డలను చెప్పగలిగితే విద్యార్జన కోసం తాపత్రయపడే యువతకు ఎంపిక సులభమవుతుంది. అంతేకాదు...ఈ తులనాత్మక విశ్లేషణ పరిశోధన కోసం తపించే విద్యార్థులకూ, విధాన నిర్ణేతలకూ కూడా సాయపడుతుంది. విధానపరమైన నిర్ణయాల కోసం చేసే అధ్యయనంలో ఏ విశ్వవిద్యా లయం తోడ్పాటు తీసుకోవచ్చునో, నిధుల విడుదలలో ఏ సంస్థకు ప్రాధాన్యం ఇవ్వాలో విధాన నిర్ణేతలు నిర్ణయించుకుంటారు. ప్రైవేటు రంగ పరిశ్రమలకు కూడా ఈ ర్యాంకింగ్లే ఆధారం. క్యూఎస్ సంస్థ ఆ పని చేస్తోంది. ఈనెల మొదటివారంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే ఎన్ఐఆర్ఎఫ్ అత్యుత్తమ శ్రేణి విద్యాసంస్థల జాబితాను విడుదల చేసింది. అందులో విశ్వవిద్యాలయాల్లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రథమ స్థానం పొందగా, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ రెండో స్థానంలో, అక్కడి జమియా మిలియా ఇస్లామియా మూడో స్థానంలో నిలిచాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పదో ర్యాంకులో ఉంది. అలాగే ఐఐటీల్లో మద్రాస్ ఐఐటీ ప్రథమ స్థానంలో, బొంబాయి ఐఐటీ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల విషయంలో విమర్శలు కూడా ఉన్నాయి. విశ్వవిద్యాల యాల్లో సాగే పరిశోధనలు, ఆ సంస్థల పేరుప్రఖ్యాతులు, అక్కడుండే విద్యార్థి–అధ్యాపక నిష్పత్తి, అంతర్జాతీయ వైవిధ్యత తదితరాలను క్యూఎస్ వంటి సంస్థలు గీటురాళ్లుగా తీసుకుంటున్నాయి. సహజంగానే ఈ అంశాలన్నిటా సంపన్న దేశాల్లోని విశ్వవిద్యాలయాలే ముందంజలో ఉంటాయి. వాటికి అటు ప్రభుత్వాలనుంచీ, ఇటు ప్రైవేటు సంస్థలనుంచీ నిధులు దండిగా వస్తాయి. వెనకబడిన దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో అత్యుత్తమ శ్రేణి అధ్యాపకులున్నా, అక్కడ మెరికల్లాంటి విద్యార్థులు రూపొందుతున్నా క్యూఎస్ సంస్థకు పట్టవు. అందువల్లే ఇలాంటి జాబితాల విశ్వసనీయతపైనా, వాటి కచ్చితత్వంపైనా విద్యారంగ నిపుణులు పెదవి విరుస్తుంటారు. ఈ విమర్శలను పరిగణనలోకి తీసుకుని కాబోలు... విద్యాసంస్థల నిర్వహణ, పరిశోధనలకుండే అంతర్జాతీయ నెట్వర్క్, అక్కడి విద్యార్థులకు లభించే ఉద్యోగావకాశాలు అనే అంశాలను ఈసారి చేర్చింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మన దేశంలో ఉన్నత విద్యారంగాన్ని గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. పూర్తికాలం పనిచేసే అత్యుత్తమ అధ్యాపకులను ఎంపిక చేయటానికి, అవసరమైన నిధులు కేటాయించి విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దటానికి పాలకులు ముందుకు రావటం లేదు. ఖాళీ అవు తున్న స్థానాల్లో కాంట్రాక్టు లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకుంటున్నారు. మన విశ్వవిద్యా లయాలకు ప్రపంచశ్రేణి గుర్తింపు తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించడానికి మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో 13 మందితో నిపుణుల కమిటీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగంలో పది, ప్రైవేటు రంగంలో పది ఉన్నత విద్యాసంస్థలను ఆ కమిటీ ఎంపిక చేసింది. వాటికి తలో వందకోట్లు నిధులిస్తున్నామని కూడా ప్రకటించారు. అయితే క్యూఎస్ ఎంపిక చేసిన జాబితాలో ఒక్క బొంబాయి ఐఐటీ మాత్రమే ఆ మాత్రమైనా స్థానం సంపాదించుకోగలిగింది. ర్యాంకింగ్‌ల సంగతలావుంచి మన ఉన్నత విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరమైతే ఉంది. ఆ దిశగా చర్యలకు ఉపక్రమిస్తే భావి తరాలు ఉన్నత స్థాయికి ఎదుగుతాయి. మన దేశానికి మళ్లీ గత వైభవం సాధ్యమవుతుంది. -
వరల్డ్ టాప్ వర్సిటీల్లోహెచ్సీయూ, ఐఐటీ–హైదరాబాద్
సాక్షి, న్యూఢిల్లీ: సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్)–2023లో తెలంగాణ నుంచి రెండు యూనివర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి. మొదటి 2 వేల యూనివర్సిటీల్లో దేశం నుంచి 64 యూనివర్సిటీలు టాప్ ర్యాంకుల్లో ఉండగా, తెలంగాణ నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 1,265వ ర్యాంకు, ఐఐటీ–హైదరాబాద్ 1,373వ ర్యాంకు సాధించాయి. గత ఏడాది ర్యాంకులతో పోలిస్తే హెచ్‌సీయూ 7 ర్యాంకులు కిందకు పడిపోగా, ఐఐటీ–హైదరాబాద్ మాత్రం 68 స్థానాలు పైకి ఎగబాకింది. దేశంలో ఐఐటీ–అహ్మదాబాద్ 419 ర్యాంకుతో టాప్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐటీ–మద్రాస్ ఉన్నాయి. ఇక వరల్డ్ టాప్ వర్సిటీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ నంబర్‌వన్‌గా నిలిచింది. విద్య నాణ్యత, ఉపాధి, అధ్యాపకుల నాణ్యత, పరిశోధన పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించింది. పరిశోధనల్లో వెనకబాటుతో పాటు నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం కారణంగా దేశ యూనివర్సిటీలు వెనకబడ్డాయని సీడబ్ల్యూయూఆర్ నివేదిక వెల్లడించింది. దేశంలో నాల్గోస్థానం రాయదుర్గం: దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిలిచింది. ‘ది వీక్ హన్సా’పరిశోధన సర్వే–2023లో దేశంలోని టాప్ 85 మల్టీ డిసిప్లినరీ వర్సిటీల్లో రాష్ట్ర, సెంట్రల్, ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో హెచ్‌సీయూ నాల్గోస్థానంలో నిలిచింది. 2022లో ఐదో స్థానంలో ఉండగా ఈ సంవత్సరం ఒక స్థానం పైకి ఎగబాకింది. దక్షిణాదిలోని టాప్ మల్టీ డిసిప్లినరీ విశ్వవిద్యాలయాల్లో మొదటి స్థానంలో ఉంది. అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధికార యంత్రాంగం, సిబ్బంది సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో టాప్‌లో నిలిచేందుకు ప్రయత్నం చేస్తామని వీసీ ప్రొఫెసర్ బీజేరావు తెలిపారు. -
ఏఎన్‌యూకి హరిత వర్సిటీ ర్యాంకు
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హరిత యూనివర్సిటీ ర్యాంకు పొందింది. యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియా ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు సోమవారం రాత్రి ‘యూఐ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2022’ పేరుతో ర్యాంకులు జారీ చేసింది. వీటిలో ఏఎన్‌యూ ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ర్యాంకును, జాతీయ స్థాయిలో 6వ, అంతర్జాతీయ స్థాయిలో 246 ర్యాంకును సొంతం చేసుకుంది. ఆయా యూనివర్సిటీలలోని సెట్టింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, వేస్ట్ ట్రీట్మెంట్, వాటర్ రిసోర్స్ యూసేజ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులను కేటాయించింది. ఈ అంశాలన్నింటిలో 10వేల మార్కులకు గాను ఏఎన్‌యూ 7,325 మార్కులు దక్కించుకుని ఈ ర్యాంకులు సొంతం చేసుకుంది. ఏఎన్‌యూకి ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు రావడం అభినందనీయమని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ అన్నారు. యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎన్‌యూకి ఐదేళ్లలో 150 జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు రావడాన్ని పురస్కరించుకొని వీసీ కేక్ కట్ చేశారు. వర్సిటీ ర్యాంకింగ్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ భవనం నాగకిషోర్‌ను అభినందించారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
ప్రపంచ వర్సిటీ ర్యాంకింగ్‌లలో ఓయూ
సాక్షి, హైదరాబాద్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2018లో తెలంగాణ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి స్థానం దక్కింది. 801–1,000 లోపు ర్యాంకింగ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నిలిచింది. బోధన, పరిశోధన, ఇండస్ట్రీ ఇన్కమ్, ఇంటర్నేషనల్ ఔట్లుక్ తదితర అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా చేసిన ఈ సర్వేలో టాప్ 1,000 యూనివర్సిటీలకు ర్యాంకింగ్‌లను ఇచ్చింది. ఇందులో టాప్–100లో దేశంలోని విద్యా సంస్థలేవీ లేవు. అయితే 251–800 వరకు ఉన్న స్థానాల్లో ఐఐటీలు నిలిచాయి. ఇక 801 నుంచి 1,000లోపు స్థానాల్లో ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలు నిలిచాయి. ఈ ర్యాంకులను టైమ్స్ సంస్థ ఇటీవల ప్రకటించింది. -
టాప్ టెన్ యూనివర్శిటీల్లో అమెరికాదే హవా
బీజింగ్: ప్రపంచ టాప్ యూనివర్శిటీల్లో ఈ ఏడాది కూడా అమెరికా యూనివర్శిటీలదే హవా. వరుసగా పదమూడవ సంవత్సరం కూడా హార్వర్డ్ యూనివర్శిటీ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. స్టాన్‌ఫర్డ్, మసాచుసెట్స్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (ఎఐటీ) ద్వితీయ, తృతీయ స్థానాల్లో, బెర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ, ప్రిన్సిటన్ యూనివర్శిటీ, కాలిఫోర్నియా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ యూనివర్శిటీలు ఈసారి కూడా నాలుగు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. కొలంబియా యూనివర్శిటీ, షికాగో యూనివర్శిటీ ఎనిమిది, తొమ్మిదవ స్థానాలను సాధించాయి. మొత్తం టాప్ టెన్ యూనివర్శిటీల్లో ఎనిమిది యూనివర్శిటీ అమెరికావే కావడం విశేషం. అమెరికేతర యూనివర్శిటీలైన యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలు వరుసగా ఐదు, పదవ స్థానాలను ఆక్రమించాయి. షాంగ్ జియాటాంగ్ యూనివర్శిటీ పర్యవేక్షణలో చైనీస్ రిసెర్చ్ సెంటర్ ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఈ సారి ఫ్రెంచ్ యూనివర్శిటీలు బాగా వెనకపడి పోయాయి. టాప్ వంద యూనివర్శిటీల్లో ఫ్రెంచ్ యూనివర్శిటీలకు మూడు స్థానాలు మాత్రమే లభించాయి. ఫ్రాన్స్‌లోని పియరీ అండ్ మేరి క్యూరి యూనివర్శిటీకి 39వ స్థానం, పారిస్ సూద్‌కు 46, ఎకోల్ నార్మేల్ సుపీరియర్‌కు 87వ స్థానం లభించాయి. ఒక్క మాథమేటిక్స్ విభాగంలోనే ఫ్రెంచ్ యూనివర్శిటీలకు ఎక్కువ మార్కులు వచ్చాయి. అయితే యూనివర్శిటీ ర్యాంకులను నిర్ణయించేందుకు చైనా అనుసరించిన ప్రమాణాలే పూర్తిగా తప్పని, వారు కేవలం సైన్స్ విభాగాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి తియరీ మాండన్ విమర్శించారు. తమ విద్యానాన్నే చైనా తప్పుగా అర్థం చేసుకొందని, ప్రపంచంలో నెంబర్ ర్యాంకును సాధించడం తమ విద్యావిధానం లక్ష్యం కాదని ఆయన చెప్పారు. అయితే తాము అనేక విద్యా ప్రమాణాలను పరిగణలోకి తీసుకొనే ర్యాంకులు నిర్ణయించామని, పైగా మూడవ పార్టీ అధ్యయనంతోనే ర్యాంకులను శాస్త్రీయ ప్రమాణాలతో ఖరారు చేశామని చైనా యూనివర్శిటీ తెలిపింది. పూర్వ విద్యార్థుల రాణింపును, యూనివర్శిటీ సిబ్బందికి వచ్చే నోబెల్ బహుమతులను, ఫీల్డ్ మెడళ్లను కూడా పరిగణలోకి తీసుకుని ర్యాంకులు నిర్ణయించామని తెలిపింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1200 యూనివర్శిటీలను అధ్యయనం చేసి ప్రతి ఏట 500 టాప్ యూనివర్శిటీల ర్యాంకులను నిర్ణయిస్తామని, ఈసారి కూడా అలాగే చేశామని చైనా యూనివర్శిటీ వివరించింది. ర్యాంకింగ్‌ల కోసం అధ్యయనం నిర్వహించిన చైనా జియాటాంగ్ యూనివర్శిటీకి 118వ స్థానం లభించింది. గత ఏడాదికన్నా నాలుగు స్థానాలు ముందుకు జరిగింది.