సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాత క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) ఆసియా వర్సిటీల ర్యాంకింగ్స్‌లో భారత్ అత్యధిక విద్యా సంస్థలతో అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం 856 విద్యా సంస్థలతో క్యూఎస్ ఆసియా వర్సిటీ ర్యాంకులను విడుదల చేసింది. ఈ జాబితాలో 148 వర్సిటీలతో భారత్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. గతేడాదితో పోలిస్తే కొత్తగా 37 భారతీయ వర్సిటీలు ర్యాంకులు పొందాయి. టాప్–100 ర్యాంకుల్లో ఏడు భారతీయ వర్సిటీలకు చోటు దక్కింది. క్యూఎస్ సంస్థ అంతర్జాతీయంగా ఉన్నత విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన వర్సిటీలకు 11 సూచికల్లో విశ్లేషించి ర్యాంకులను ఇస్తోంది.
దేశంలో ఐఐటీ బాంబే టాప్
ఆసియా క్యూఎస్ ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు మునుపటి ఎడిషన్‌తో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. ఐఐటీ–బాంబే గతేడాది మాదిరిగానే 40వ ర్యాంకులో కొనసాగుతూ భారత్‌లో ఉత్తమ వర్సిటీగా నిలిచింది. ఆ తర్వాత ఐఐటీ–ఢిల్లీ (46), ఐఐటీ–మద్రాస్ (53) స్థిరంగా ఉన్నాయి. ఐఐఎస్‌సీ బెంగళూరు (58), ఐఐటీ ఖరగ్‌పూర్ (59), ఐఐటీ కాన్పూర్ (63), ఢిల్లీ వర్సిటీ(94) వందలోపు ర్యాంకులు సాధించాయి.
100–200 ర్యాంకింగ్స్‌లో ఐఐటీ గౌహతి 111, ఐఐటీ రూర్కీ 116వ ర్యాంకులో నిలిచాయి. జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ 117, బెనారస్ హిందూ వర్సిటీలకు 199, గతేడాది 185 స్థానంలో ఉన్న ఛండీగఢ్ వర్సిటీ 149కి వచ్చింది. కోయంబత్తూరులోని భారతీయార్ వర్సిటీ 205 నుంచి 171కి, అమిటీ వర్సిటీ 200 నుంచి 186కి, వెల్లూరులోని విట్ పది స్థానాలు మెరుగుపర్చుకుని 163 ర్యాంకును సొంతం చేసుకున్నాయి.
ఆసియా టాప్ వర్సిటీ ‘పెకింగ్’
భారత్ తర్వాత క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌లో చైనా 133, జపాన్ 96 వర్సిటీలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మయన్మార్, కంబోడియా, నేపాల్ తొలిసారిగా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన పెకింగ్ విశ్వవిద్యాలయం వరుసగా రెండవ ఏడాది టాప్ వర్సిటీగా నిలిచింది. హాంకాంగ్ విశ్వవిద్యాలయం 4వ స్థానం నుంచి రెండవ స్థానానికి ఎగబాకింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్) ఈ ఏడాది రెండో స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయింది. నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ (ఎన్టీయూ) ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది.
ఏపీ నుంచి ఐదు ప్రభుత్వ వర్సిటీలు
తెలుగు రాష్ట్రాల నుంచి 12 వర్సిటీలకు క్యూఎస్ ఆసియా వర్సిటీల జాబితాలో స్థానం లభించింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జపాన్‌కు చెందిన కుమామోటో వర్సిటీతో సమానంగా 228 ర్యాంకును పంచుకుంటోంది. ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్ (301–350), ఉస్మానియా, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర (451–500), అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ (551–600), గుంటూరులోని ఆచార్య నాగార్జున (601–650), విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ, అనంతపురంలోని జేఎన్‌టీయూ (651–700), ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌లోని ఐసీఎఫ్‌ఏఐ, గుంటూరులోని కేఎల్‌యూ, విశాఖలోని గీతమ్, విజ్ఞాన్ వర్సిటీలు ఉన్నాయి.
టాప్ 10 ఆసియా విశ్వవిద్యాలయాలివీ..
♦ పెకింగ్ విశ్వవిద్యాలయం (చైనా)
♦ హాంకాంగ్ విశ్వవిద్యాలయం (హాంకాంగ్ ఎస్‌ఏఆర్)
♦ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (సింగపూర్)
♦ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (సింగపూర్)
♦ సింగువా విశ్వవిద్యాలయం (చైనా)
♦ జెజియాంగ్ విశ్వవిద్యాలయం (చైనా)
♦ ఫుడాన్ విశ్వవిద్యాలయం (చైనా)
♦ యోన్సీ విశ్వవిద్యాలయం (సౌత్ కొరియా)
♦ కొరియా విశ్వవిద్యాలయం (సౌత్ కొరియా)
♦ చైనీస్ యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్ (హాంకాంగ్ ఎస్‌ఏఆర్)
Comments
Please login to add a commentAdd a comment