సరిగ్గా వారం రోజుల్లో ఈ ఏడాది(2023) ముగియనుంది. కొత్త సంవత్సరం సోమవారంతో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎన్నో అనూహ్య పరిణామాలకు సాక్షిగా నిలిచింది. ఈ సంవత్సరంలో కార్పొరేట్ ప్రపంచంలో పెను మార్పులు కనిపించాయి. 2023లో పలువురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉదయ్ కోటక్ (కోటక్ మహీంద్రా బ్యాంక్)
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉదయ్ కోటక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నిర్ణీత సమయం కంటే ముందే పదవిని వదిలిపెట్టి, మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు. ఉదయ్ కోటక్ ఇంత హఠాత్తుగా ఎందుకు తన పదవిని విడిచిపెట్టారనే దానిపై ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు. వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే ఆయన రాజీనామా చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
2. రాజేష్ గోపీనాథన్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్/టీసీఎస్)
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌లో ఈ ఏడాది నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ మార్చిలో హఠాత్తుగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐదు దశాబ్దాల కంపెనీ చరిత్రలో కేవలం నలుగురు సీఈవోలు మాత్రమే విధులు నిర్వహించారు.
3. వేణు నాయర్ (షాపర్స్ స్టాప్)
రిటైల్ స్టోర్ చైన్ షాపర్స్ స్టాప్ సీఈఓ వేణు నాయర్ గత ఆగస్టులో రాజీనామా చేశారు. తన కుటుంబంతో సమయం గడిపేందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత వేణు షాపర్స్ స్టాప్‌లో చేరారు. కంపెనీని ఓమ్నిఛానల్ రిటైలర్‌గా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన రాజీనామా మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. ఈ వార్త బయటకు వచ్చాక కంపెనీ షేర్లు 11 శాతం మేరకు పడిపోయాయి.
4. మురళీ రామకృష్ణన్ (సౌత్ ఇండియన్ బ్యాంక్)
మురళీ రామకృష్ణన్ ఈ ఏడాది మార్చిలో ఇండియన్ బ్యాంక్ నుండి నిష్క్రమించారు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నానని, అందుకే రాజీనామా చేశానని తెలిపారు. 2020 జూలైలో బ్యాంక్‌లో సలహాదారుగా చేరిన రామకృష్ణన్ నాలుగు నెలల వ్యవధిలోనే ఎండీ, సీఈఓగా ఎదిగారు.
5. మాథ్యూ జాబ్ (క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్)
క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ సీఈఓ మాథ్యూ జాబ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇతర కెరీర్ ప్రయోజనాలను కారణంగా చూపుతూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆకస్మిక రాజీనామా కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది.
ఇది కూడా చదవండి: లక్షమంది సామూహిక గీతా పఠనం..ప్రధాని అభినందనలు!
Comments
Please login to add a commentAdd a comment