అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది? ఎదురవుతున్న ఆటంకాలేమిటి? | National Education Day 2023 November 11 Every Year - Sakshi
Sakshi News home page

National Education Day: అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది?

Published Sat, Nov 11 2023 8:07 AM | Last Updated on Sat, Nov 11 2023 8:51 AM

National Education Day November 11 every year - Sakshi

విద్యాభివృద్ధితోనే ఏ దేశమైనా సమగ్రాభివృద్ధి చెందుతునేది అక్షర సత్యం. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపిస్తుంది. విద్యకుగల ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచంలోని దేశాలన్నీ తమ దేశాలలో విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దేశప్రజలంతా విద్యావంతులు కావాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మన భారతదేశం విషయానికొస్తే నవంబరు 11న(నేడు) జాతీయ విద్యాదినోత్సవం జరుపుకుంటారు. 

భారతదేశం అక్షరాస్యత విషయంలో ఘనమైన చరిత్రను కలిగివుంది. ప్రపంచంలోనే ఎంతో పేరొందిన నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి పురాతన విశ్వవిద్యాలయాలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. చాణక్య, కాళిదాసు, రవీంద్రనాథ్ ఠాగూర్, రామానుజన్, అమర్త్య సేన్ తదితర పండితులు, రచయితలు, కవులు, ఆలోచనాపరులను భారతదేశం ప్రపంచానికి అందించింది.

స్వతంత్ర భారతదేశ మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11 న దేశంలో జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. నవంబరు 11న దేశంలోని విద్యా సంస్థలు సెమినార్లు నిర్వహించడంతో పాటు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాయి. అక్షరాస్యత  ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తాయి. స్వతంత్ర భారతావనిలో విద్యావ్యవస్థకు పునాదులు పడటం మొదలుకొని, ఈ రంగంలో నేడున్న స్థితిగతులు.. ఇందుకు నాటి విద్యాశాఖ మంత్రి ఆజాద్ అందించిన సహకారాన్ని ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం  ఎంతైనా ఉంది. 

భారతదేశంలో అక్షరాస్యత వాస్తవాలు
ప్రపంచంలోని 135 దేశాలలో మహిళల అక్షరాస్యత రేటులో భారతదేశం 123వ స్థానంలో ఉంది.
దేశంలో 60 లక్షల మంది పిల్లలు బడి బయట అంటే చదవుకు దూరంగా ఉన్నారు.
దేశంలో ప్రతి 50 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు.
దేశంలో వయోజన అక్షరాస్యత రేటు 63%.
ప్రపంచంలో అత్యధికంగా 287 మిలియన్ల(ఒక మిలియన్‌ అంటే 10 లక్షలు) నిరక్షరాస్యులైన వయోజనులకు నిలయంగా భారతదేశం ఉంది
భారతదేశంలో బడి బయట ఉన్న పిల్లల్లో 47.78% మంది బాలికలే కావడం విశేషం.
1950లలో 10 మంది భారతీయుల్లో కేవలం ఇద్దరు మాత్రమే అక్షరాస్యులు. 
2022నాటి విద్యా గణాంకాలు దేశంలో విద్యాభివృద్ధికి సూచికగా నిలిచాయి. 2018లో దేశంలో అక్షరాస్యత రేటు 74.4%కి చేరింది. దీనిని చూస్తే దేశంలో అక్షరాస్యుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలుస్తుంది. 

దేశంలో అక్షరాస్యత రేటు లింగం, ప్రాంతం, సామాజిక పరిస్థితులను అనుసరించి మారుతుంటుంది. 2018 నాటికి పురుషుల అక్షరాస్యత రేటు 82.4శాతం, స్త్రీల అక్షరాస్యత రేటు 65.8శాతం. అక్షరాస్యత రేటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విభిన్నంగా కనిపిస్తుంది. కేరళలో అక్షరాస్యత రేటు 96.2 శాతం. ఇది దేశంలోనే అత్యధికం. ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్ప అక్షరాస్యత రేటు నమోదయ్యింది. ఇది 66.4శాతంగా ఉంది. ప్రభుత్వ విధానాలు, సామాజిక ఉద్యమాలు, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతి తదితరాలతో దేశంలో అక్షరాస్యత రేటు పెరుగుతూ వస్తోంది. దేశంలో అక్షరాస్యత శాతం పెరిగేందుకు దోహదపడిన ప్రభుత్వ కార్యక్రమాలిలా ఉన్నాయి. 

జాతీయ అక్షరాస్యత మిషన్: 
ఇది 1988లో ప్రారంభమయ్యింది. ఇది వయోజనులకు ప్రాథమిక విద్యను అందించడం, జీవన నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా వారిలో నిరక్షరాస్యతను నిర్మూలించడం లక్ష్యంగా పనిచేస్తోంది.

సర్వశిక్షా అభియాన్: 
2001లో ప్రారంభమయ్యింది. ఇది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది.



విద్యా హక్కు చట్టం: 
దీనిని 2009లో రూపొందించారు. ఇది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి విద్యను ప్రాథమిక హక్కుగా పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత , నిర్బంధ విద్యను తప్పనిసరి చేశారు.

రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్: 
2009లో ప్రారంభమయ్యింది. ఇది 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ మాధ్యమిక విద్యను అందించడంతో పాటు విద్యా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా  ముందుకు సాగుతోంది.

డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్:
2015లో ఇది ప్రారంభమయ్యింది. ఇంటర్నెట్ ద్వారా దేశ పౌరులలో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ విద్యావిధానం ప్రారంభమయ్యింది. 

అక్షరాస్యతాభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు 
దేశఅక్షరాస్యతలో లింగ అంతరం కనిపిస్తోంది. ఇది బాలికలు, మహిళలు విద్య, సాధికారతను పొందకుండా  అడ్డుపడుతోంది.  ఈ అంతరానికి పలు సామాజిక నమ్మకాలు, ఆచారాలు కారణంగా నిలుస్తున్నాయి.
అక్షరాస్యతలో ప్రాంతీయ అసమానత.. ఇది వివిధ రాష్ట్రాలు-ప్రాంతాల మధ్య వనరులు, అవకాశాల అసమాన పంపిణీని ప్రతిబింబిస్తుంది. భవిష్యత్‌లో ఈ సవాళ్లు అధిగమించి భారత్‌ అక్షరాస్యత విషయంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిద్దాం!
ఇది కూడా చదవండి:  గ్రీన్‌ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement