జంషెడ్‌పూర్: నేడు (సెప్టెంబర్ 22) జాతీయ కుమార్తెల దినోత్సవం. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ లక్ష్యం. అంతేకాదు కూతుళ్లు కొడుకుల కంటే ఏమాత్రం తక్కువ కాదన్న సందేశాన్ని అందించేందుకే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన రితికా టిర్కీ టాటా-పట్నా వందే భారత్‌ను నడిపి తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు.
జంషెడ్‌పూర్‌లోని జుగ్‌సలై నివాసి రితికా టిర్కీ(27) టాటా-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపి వందేభారత్‌ను నడిపిన దేశంలోనే తొలి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందారు. రితికా తండ్రి లూటియా భగత్ రిటైర్డ్ ఫారెస్ట్ గార్డు. వెనుకబడిన గిరిజన కుటుంబానికి చెందినప్పటికీ రితిక చదువులో ఎంతో ప్రతిభ చూపారు. రాంచీలో పాఠశాల విద్యను పూర్తి చేశాక,మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ అందుకున్నారు. 2019లో రైల్వేలో లోకో పైలట్‌గా నియమితురాలయ్యారు. మొదట చంద్రపురలో పోస్ట్ అయిన ఆమె ఆ తర్వాత 2021లో టాటానగర్‌కు బదిలీ అయ్యారు. రితికా భర్త బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి.
రితికా మీడియాతో మాట్లాడుతూ కూతుళ్లు.. కుమారులతో సమానమేనని, వారు ఏ రంగంలోనూ వెనుకబడరని తెలిపారు. లోకో పైలట్‌గా రైలు నడపడం సవాలుతో కూడుకున్న పని అని, అయితే దీనినే కెరీర్‌గా మార్చుకుని ఈరోజు ఈ స్థానాన్ని సంపాదించానన్నారు. వందేభారత్ రైలును నడిపిన మొదటి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలు, యువతులకు అనేక అవకాశాలు అందించేందుకు ప్రపంచం తలుపులు తెరిచిందన్నారు.
ఇది కూడా చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!
Comments
Please login to add a commentAdd a comment