సంపాదకీయం: అధికారం నిలుపుకోవడానికి అనుక్షణమూ అర్రులుచాచే పాలకులు ఆ అధికారాలను కింది స్థాయిలో వికేంద్రీకరించాల్సి వచ్చేసరికి విలవిల్లాడిపోతున్నారు. మిన్ను విరిగి మీదపడుతుందేమోనన్నట్టు భయపడుతున్నారు. తాము ఏదో కోల్పోతున్నామన్న బాధతో కుంగిపోతున్నారు. గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు ఉండే చెక్ పవర్‌ను నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో నంబర్ 385 ఈ కోవలోకే వస్తుంది. అసలు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు జరపడానికే ప్రభుత్వానికి కాలూ చెయ్యీ ఆడలేదు. ఏదో సాకుతో, ఇంకేదో కారణంతో వాటిని వాయిదా వేయడానికే ప్రయత్నించింది. మీనమేషాలు లెక్కిస్తూ రెండేళ్లు కాలక్షేపం చేసింది.
గ్రామ స్వరాజ్యం పటిష్టంగా ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్న మహాత్ముడి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించకుండా పంచాయతీలను అనుమాన దృక్కులతో చూడటానికే నిర్ణయించుకుంది. పునాది స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించాలని, పరిపాలనలో స్థానిక ప్రజానీకానికి చోటిచ్చి, అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని ఎందరెందరో కోరుతూనే ఉన్నారు. ఆ దిశగా రెండు దశాబ్దాల క్రితం కొంత ప్రయత్నమూ జరిగింది. 29 అంశాల్లో పంచాయతీలే స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి... విధులు, నిధుల వ్యవహారాన్ని అవే పర్యవేక్షించుకోవడానికి వీలుకల్పిస్తూ అప్పుడు 73వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు.
కానీ, ఈ ఇరవైయ్యేళ్లలోనూ ఏ రాష్ట్రప్రభుత్వమూ రాజ్యాంగం సూచించిన అధికారాలను వాటికి అప్పగించడానికి సిద్ధపడలేదు. పర్యవసానంగా వీధి దీపాలు వెలిగించుకోవాలన్నా, ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు అందించడానికి ప్రయత్నించాలన్నా, ఆఖరికి పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టాలన్నా పంచాయతీ రాజ్ సంస్థలు ప్రభుత్వంవైపు చూడవలసివస్తున్నది. అధికారాలను బదలాయించడా నికి ససేమిరా అంగీకరించని పాలకులుంటారన్న భావనతోనే రాజ్యాంగ అధికరణంలో కట్టుదిట్టమైన నిబంధనలుంచారు. ఎన్నికలు నిర్వహించడంలో విఫలమయ్యే ప్రభుత్వాలకు నిధులు కోతపెట్టాలని నిర్దేశించారు. ఆ నిబంధనల పర్యవసానంగా మనకు రావాల్సిన వేలాది కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయి కూడా. తప్పనిసరై ఎన్నికలు నిర్వహించాక కూడా అధికారాల బదలాయింపులో రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించదల్చుకోలేదని జీవో నంబర్ 385 చూస్తే అర్థమవుతోంది.
పారదర్శకతనూ, జవాబుదారీతనాన్ని నెలకొల్పడానికే ఈ చర్య తీసుకుంటున్నట్టు జీవోలో చెప్పడం పంచాయతీరాజ్ సంస్థలను, సర్పంచ్‌లను దారుణంగా అవమానించడమే. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు ఎంతో అవసరమైన పారిశుద్ధ్యమైనా, వ్యవసాయ సంబంధమైన పథకాలైనా, పశు సంరక్షణకు సంబంధించిన అంశాలైనా పంచాయతీల పరిధిలో పెట్టినట్టే పెట్టి ఆచరణలో మాత్రం మొండిచేయి చూపారు. కార్యక్రమాలను అమలుచేసే అధికారం పంచాయతీలకిచ్చారు తప్ప వాటికి అవసరమైన నిధులను మాత్రం తమ గుప్పెట్లోనే ఉంచుకున్నారు.
మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ, గ్రామీణ నీటి సరఫరా, వయోజన విద్య, ఖాదీ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, గ్రామీణ విద్యుదీకరణ, రోడ్లు వంటివెన్నో పంచాయతీలకు అప్పజెప్పి... వాటిని విస్తరించడానికైనా, నిర్వహించడానికైనా నిధులను బదిలీచేయాల్సి ఉండగా ఏ ఒక్కటీ అమలుకావడం లేదు. ఒకపక్క తాము అమలుచేస్తున్న పథకాల్లో అవినీతిని అరికట్టలేకపోతున్న ప్రభుత్వాలు పంచాయతీలకు డబ్బులిస్తే దుర్వినియోగమవుతాయని చెప్పడానికి సాహసిస్తున్నాయి. పంచాయతీల ద్వారా అభివృద్ధి పనులను కొనసాగిస్తే స్థానికంగా ఉన్న తమ పార్టీకో, తమ ఎమ్మెల్యేకో పలుకుబడి, పరపతి ఉండదన్న భయంతో వణుకుతున్నాయి. ఆ మనస్తత్వమే ఇలాంటి జీవోలను పుట్టిస్తోంది.
నిజానికి పంచాయతీల్లో పారదర్శకత, జవాబుదారీతనం దండిగా ఉన్నాయి. ఏడాదికి నాలుగుసార్లు జరిగే గ్రామసభల్లో చర్చించి, నిర్ణయించిన అభివృద్ధి కార్యక్రమాలను మాత్రమే పంచాయతీలు చేపడతాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాల జమాఖర్చుల్ని కూడా గ్రామసభలు పరిశీలిస్తాయి. పంచాయతీల సర్వసభ్య సమావేశాలు గరిష్టంగా 90 రోజులలోపు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. అది జరగకపోతే ఆ పంచాయతీలు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీటికితోడు పంచాయతీ సర్పంచ్ అయినా, వార్డు సభ్యుడైనా నిత్యం జనం మధ్యే తిరగవలసి ఉంటుంది.
లోటుపాట్లుంటే వారిని నిలదీసేవారు ఎక్కువుంటారు. సారాంశంలో ఒక ఎమ్మెల్యేతో పోల్చినా, ఎంపీతోపోల్చినా పంచాయతీ వార్డు సభ్యుడికుండే జవాబు దారీతనం ఎక్కువ. వాస్తవం ఇదికాగా, నిధుల వినియోగాన్ని సర్పంచ్‌లకు విడిచి పెడితే ఏదో అయిపోతుందని చెప్పడం అన్యాయం. ఇంత పెద్ద వ్యవస్థలో లోటు పాట్లుండవనీ, అవినీతికి తావేలేదని ఎవరూ అనరు. అవసరమనుకుంటే వాటిపై ఇప్పటికే ఉన్న నిఘా, పర్యవేక్షణ మరింత విస్తృతం చేయవచ్చు. గ్రామసభలు సక్రమంగా జరగకపోయినా, పంచాయతీ సర్వసభ్య సమావేశం నిబంధనల ప్రకారం నిర్వహించకపోయినా వాటిపై చర్యలు తీసుకోవచ్చు.
అంతేతప్ప, సర్పంచ్‌లను అవమానపరిచేలా వారిని దోషులుగా చూడాల్సిన అవసరం లేదు. 1995 వరకూ ఉన్న జాయింట్ చెక్ పవర్ విధానం రద్దుకు అప్పట్లో సర్పంచ్‌లు సమష్టిగా పోరాడారు. ప్రభుత్వం మెడలువంచి తమ డిమాండును సాధించుకున్నారు. ఇన్నాళ్ల తర్వాత దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎసరుపెట్టింది. నిజానికి ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగితే అది చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా పనిచేసేలా, అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకునేలా అక్కడి ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వొచ్చు. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాలను వాటికి దఖలుపరిచి, అవి జవజీవాలతో కళకళలాడేలా చేయవచ్చు. మహాత్ముడు చెప్పినట్టు గ్రామస్వరాజ్య స్థాపనకు పాటుపడవచ్చు. ఇవేమీ చేయకుండా పంచాయతీలపై అత్తగారి పెత్తనాన్ని చెలాయిద్దామని చూస్తే సర్పంచ్‌లు సహించరు.