
విద్య, ఉద్యోగాల్లో.. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
బీసీలకు రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం ప్రధాని మోదీని కలుద్దాం.. సమైక్య గొంతు వినిపిద్దాం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా పాటిద్దామని వెల్లడి
ఆమోదం వచ్చేలా శాస్త్రీయంగా రూపొందించాం: డిప్యూటీ సీఎం భట్టి
తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించుకుందాం: మంత్రి పొన్నం ప్రభాకర్
న్యాయపరమైన చిక్కులకు అవకాశం: వివేకానంద
బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును చట్టం చేసేలా కేంద్రంపై అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. దీనిపై తెలంగాణ సమాజం ఏకాభిప్రాయంతో ఉందనే సందేశాన్ని కేంద్రానికి పంపాలి. బీసీ రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా.
-సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సోమవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఒక బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి మరో బిల్లు ఆమోదం పొందాయి. అనంతరం అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది.
సోమవారం ఉదయం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ రెండు బీసీ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించారు. తర్వాత సాయంత్రం వరకు కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లులపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది.
ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుదాం..
బీసీ బిల్లులపై చర్చ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బీసీలకు 37శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును గతంలో అసెంబ్లీ ఆమోదించింది. దానికి సంబంధించిన తీర్మానం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. సాంకేతిక కారణాల రీత్యా గతంలో చేసిన తీర్మానం ఉపసంహరించుకుని, కొత్తగా అసెంబ్లీ తీర్మానం చేసింది.
బిల్లుకు మద్దతు ఇచ్చిన పక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేంద్రంలో అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేస్తామని మా నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం అడుగులు వేస్తోంది’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోనని చెప్పారు. ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుదామన్నారు.
ఏకాభిప్రాయంతో వెళదాం.. నాయకత్వం వహిస్తా..
బీసీల లెక్క తెలియకపోవడం వల్లే రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రం కులగణన సర్వే చేపట్టామన్నారు. ‘‘బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును చట్టం చేసేలా కేంద్రంపై అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. దీనిపై తెలంగాణ సమాజం ఏకాభిప్రాయంతో ఉందనే సందేశాన్ని కేంద్రానికి పంపాలి. బీసీ రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా. అఖిలపక్ష నాయకులంతా సమైక్యంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రిని కలుద్దాం.
ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ తీసుకొచ్చే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలి. మేం రాహుల్ గాం«దీని కలసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతాం. ఆయనను కలిసే బాధ్యత, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించేలా చేసే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అప్పగిస్తాం..’’ అని సీఎం రేవంత్ చెప్పారు. బీసీ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా చేసే బాధ్యత ప్రతి పార్టీపైనా ఉందన్నారు.
చట్టబద్ధత లభించేలా శాస్త్రీయంగా చేశాం: భట్టి విక్రమార్క
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు కసరత్తు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందన్నారు. శాస్త్రీయంగా, పకడ్బందీగా 50రోజుల్లో దీనిని పూర్తి చేశామని చెప్పారు. ‘‘దేశంలో కులగణన శాస్త్రీయంగా జరిగిందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే.. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కులగణన చేయాల్సిన సమయంలో మనం చేసిన సర్వేను మోడల్‌గా తీసుకునేంత శాస్త్రీయంగా చేయించాం.
గతంలో కేంద్రానికి పంపిన అనేక తీర్మానాలు శాస్త్రీయంగా లేకపోవడం వల్ల కోర్టుల్లో వీగిపోయేవి. అలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా సర్వే చేయించి, అసెంబ్లీలో తీర్మానం చేశాం..’’ అని భట్టి వివరించారు. కుల గణనలో బీసీలు 50.36 శాతం ఉన్నట్టు తేలిందని.. దీని ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కోసం సభలో తీర్మానం పెట్టామన్నారు. తెలంగాణలో కులగణన జరిగినట్టే దేశవ్యాప్తంగా జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించుకుందాం: పొన్నం ప్రభాకర్
తమిళనాడులో మొత్తం 68శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. 50శాతం రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధన కూడా ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం రిజర్వేషన్లతో తొలగిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తమిళనాడు స్ఫూర్తితో రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఒకేతాటిపై ఉన్నాయన్న సంకేతం పంపిద్దామని.. ఎవరేం చేశారన్నది మరోసారి చర్చించుకుందామని చెప్పారు. బీసీ బిల్లుపై చర్చించేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యతను బీజేపీ నేతలు తీసుకోవాలన్నారు. బీజేపీకి ఇది శీలపరీక్ష లాంటిదని, ఆ పార్టీ వ్యాపారుల పార్టీనా, బీసీల పార్టీనా తేలిపోతుందని పేర్కొన్నారు.
న్యాయపరమైన చిక్కులకు అవకాశం: కేపీ వివేకానంద
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ సభ్యుడు కేపీ వివేకానంద పేర్కొన్నారు. బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్‌ల పేర్లతో శాస్త్రీయత లేకుండా బీసీ రిజర్వేషన్లను నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉందని.. బీజేపీ కేంద్ర మంత్రులు కూడా అదే చెప్తున్నారని తెలిపారు.
ఒక పద్ధతి ప్రకారం రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ జరగాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా జరిపారని పేర్కొన్నారు. అయితే వివేకానంద చెప్పిన అంశాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అభ్యంతరం తెలిపారు. కేంద్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీ బిల్లును ఆమోదిస్తుందని చెప్పారు. ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలుస్తామన్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ సభ్యులు బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ కూడా ప్రసంగించారు.
స్వీట్లు తినిపించుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు
బీసీ బిల్లులకు శాసనసభ ఆమోదం పొందడం మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి, బీసీ ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment