
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) అధ్యక్షుడిగా మరో మూడేళ్ల కాలానికి ఎన్నికయ్యారు. దీంతో 2021, ఆగస్టు వరకూ ఆయన జపాన్ ప్రధానిగా కొనసాగనున్నారు. గురువారం జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 807 ఓట్లకుగానూ అబే 553 ఓట్లను దక్కించుకోగా, ఆయన ప్రత్యర్థి, మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబాకు 254 ఓట్లు లభించాయి. విజయం అనంతరం అబే మాట్లాడుతూ..‘పోరాటం ముగిసింది. ఇక రాజ్యాంగ సవరణపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది.
పదండి.. సరికొత్త జపాన్ కోసం మనమందరం కలసికట్టుగా కృషి చేద్దాం’ అని పిలుపునిచ్చారు. తాజా విజయంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒత్తిడితో 1947లో రూపొందించిన రాజ్యాంగాన్ని సవరించేందుకు అబేకు మార్గం సుగమమైంది. ఉభయసభల్లో అబే నేతృత్వంలోని ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. జపాన్‌కు యుద్ధం చేసేందుకు సైన్యం లేకుండా, అంతర్జాతీయంగా తలెత్తే ఘర్షణల్లో పాల్గొనకుండా నిషేధిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 9కు సవరణలు చేయాలని అబే పట్టుదలతో ఉన్నారు. జపాన్‌కు ప్రస్తుతం ఆత్మరక్షణకు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్(జేఎస్‌డీఎఫ్) అనే పరిమిత సైన్యం మాత్రమే ఉంది.