
బరిలో ఏడుగురు అభ్యర్థులు
క్రిస్టీ కొవెంట్రీ, సెబాస్టియన్ కో, సమరాంచ్ మధ్య అసలు పోరు
ఈ నెల 18 నుంచి 21 వరకు ఎన్నికలు
లుసానే: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ (జర్మనీ) పదవీకాలం ముగియనుండటంతో... చైర్మన్ పదవి కోసం ఎన్నిక జరగనుంది. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. వివిధ క్రీడా సమాఖ్యల్లో కీలక పదవులు నిర్వర్తిస్తున్న విశేష అనుభవం ఉన్నవారు పోటీలో ఉండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది.
ఐఓసీలోని మొత్తం 109 మంది సభ్యులు ‘రహస్య బ్యాలెట్’ పద్ధతిలో ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. అధ్యక్షుడి పదవీ కాలం 8 సంవత్సరాలు కాగా... నాలుగేళ్లకోసారి పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ ఎన్నికను ఎగ్జిక్యూటివ్ బోర్డు పర్యవేక్షిస్తుంది. ఈ నెల 18 నుంచి 21 మధ్య గ్రీస్‌లో ఓటింగ్ జరగనుంది. ప్రస్తుత చైర్మన్ థామస్ బాచ్ పదవీకాలం అధికారికంగా జూన్ 23తో ముగియనుంది.
» ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ఐఓసీ అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్నాడు. బ్రిటన్‌కు చెందిన సెబాస్టియన్‌కు క్రీడా పరిపాలన రంగంలో విశేష అనుభవం ఉంది.
» ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యురాలు క్రిస్టీ కొవెంట్రీ కూడా అధ్యక్ష పీఠంపై కన్నేసింది. జింబాబ్వేకు చెందిన 41 ఏళ్ల ఈ ప్రఖ్యాత స్విమ్మర్ ప్రస్తుతం జింబాబ్వే కేబినెట్‌లో క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తోంది. ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించిన క్రిస్టీ కొవెంట్రీ విజయంపై ధీమాగా ఉంది.
» అంతర్జాతీయ స్కీయింగ్, స్నోబోర్డ్ సమాఖ్య అధ్యక్షుడు జోహన్ ఎలియాష్ కూడా పోటీలో ముందున్నారు. బ్రిటన్, స్వీటన్ కేంద్రంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఎలియాస్... ప్రకృతి ప్రేమికుడిగా, పర్యవారణ పరిరక్షకుడిగా కూడా సుపరిచితుడే.
» ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్న జోర్డాన్ యువరాజు ఫైజల్ అల్ హుసేన్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. యుద్ధ విద్యల్లో మంచి అనుభవం ఉన్న ఫైజల్ ఇప్పుడు క్రీడా పరిపాలనలోనూ తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు.
» అంతర్జాతీయ సైక్లింగ్ చీఫ్ డేవిడ్ లాపరి్టయెంట్, అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య అధ్యక్షుడు మెరినరి వతనబె కూడా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతుండగా... ప్రస్తుతం ఐఓసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న యువాన్ ఆంటోనీ సమరాంచ్ జూనియర్ అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్నాడు. పరిపాలనలో విశేష అనుభవం ఉన్న స్పెయిన్‌కు చెందిన ఈ సీనియర్ ఉపాధ్యక్షుడు ... చైర్మన్‌గా తనకు మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
» కొత్తగా ఎన్నిక కానున్న ఐఓసీ అధ్యక్షుడి ముందు క్రీడల్లో కృత్రిమ మేధ వినియోగం... డిజిటల్ మాధ్యమాల ద్వారా యువతను భాగం చేయడం. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలు రచించడం... క్రీడారంగంలో మహిళలకు పెద్దపీట వేయడం వంటి పలు సవాళ్లు ఉన్నాయి.
» జింబాబ్వేకు చెందిన క్రిస్టీ కొవెంట్రీని చైర్మన్‌గా ఎంపిక చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ భావిస్తున్నాడు. అయితే ఐఓసీ సీనియర్ ఉపాధ్యక్షుడు యువాన్ సమరాంచ్, ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో కూడా పీఠం అధిరోహించాలని పట్టుదలతో ఉన్నారు.
» ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షుడు... విశ్వక్రీడల భవిష్యత్తును నిర్మించనున్నారు. ఆటల ఎంపిక, నిర్వహణ పద్ధతి, అథ్లెట్ల సంక్షేమం, వేదికల ఏర్పాటు ఇలా లెక్కకు మిక్కిలి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
» 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఐఓసీ అధ్యక్ష ఎన్నికపై మన దగ్గర కూడా ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment