
ఐఓసీ ఉపాధ్యక్షుడు సమరాంచ్ అభిప్రాయం
బెర్లిన్: లింగమార్పిడి చేసుకున్న క్రీడాకారుల్ని విశ్వక్రీడల్లో అనుమతించే విషయమై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఐఓసీ ఉపాధ్యక్షుడు యువాన్ ఆంటోని సమరాంచ్ సూచించారు. ‘ఈ విషయంలో యావత్ ప్రపంచం ఐఓసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. మహిళా అథ్లెట్లు నష్టపోకుండా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు దిక్సూచిలా వ్యవహరించే నిర్ణయాన్ని ఐఓసీ తీసుకోవాలి. దీనిపై తాత్సారం చేయకుండా శాస్త్రీయమైన కారణాలను పరిశీలించి వెంటనే ఓ నిర్ణయానికి రావాలి’ అని 65 ఏళ్ల సమరాంచ్ పేర్కొన్నారు.
లింగమార్పిడితో అమ్మాయిలుగా మారిన ట్రాన్స్‌జెండర్లతో నిజమైన మహిళా అథ్లెట్ల ప్రయోజనాలకు నష్టం కలుగకుండా ఐఓసీ నిర్ణయం ఉండాలన్నారు. గతేడాది రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ట్రాన్స్‌జెండర్లను అనుమతించబోమనే ప్రెసిడెన్షియల్ రూల్ కూడా ఉంది. ఇప్పటికే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లను మహిళల కేటగిరీలో పోటీపడకుండా నిక్కచ్చిగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.
ఎందుకంటే 2028లో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమరాంచ్ కూడా ఐఓసీ ఉన్నతస్థాయి మండలి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. స్పెయిన్‌కు చెందిన ఈ సీనియర్ ఉపాధ్యక్షుడు ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్నారు. పదవీకాలం ముగిసిన ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ వారసుడి ఎన్నిక కోసం మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు.
ఈ నెల 20న ఐఓసీ ఎన్నికలు జరుగనున్నాయి. సమరాంచ్‌తో పాటు ప్రపంచ అథ్లెటిక్స్ చీఫ్ సెబాస్టియన్ కో, పలు ఒలింపిక్స్‌లలో స్విమ్మింగ్ చాంపియన్ క్రిస్టీ కొవెంట్రీ, అంతర్జాతీయ సైక్లింగ్ చీఫ్ డేవిడ్ లాపర్టియెంట్, జోర్డాన్ చక్రవర్తి ఫైజల్ అల్ హుస్సేన్, ప్రపంచ జిమ్నాస్టిక్స్ హెడ్ మోరినరి వతనబె, కొత్తగా ఐఓసీలోకి వచ్చిన మల్టీ మిలియనీర్ జోహన్ ఎలియస్చ్ (ప్రపంచ స్కీయింగ్ చీఫ్)లు ఐఓసీ అధ్యక్ష పీఠంపై కన్నేశారు.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో లింగమార్పిడి చేసుకున్న న్యూజిలాండ్ వెయిట్‌లిఫ్టర్ లారెల్ హబర్డ్ మహిళల ప్లస్ 87 కేజీ విభాగంలో పోటీపడింది. అయితే ఆమె చివరిదైన 14వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ తొలి ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌గా ఆమె గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment