అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఈసారి ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పష్టమైన చిత్రం ఆవిష్కృతమవ్వడానికి రెండు, మూడు రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనదేశంలో లాగా అమెరికాలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉండదు. ఓట్ల లెక్కింపు బాధ్యత రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలదే. 50 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఒకేలా ఉండదు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు సాగిన నేపథ్యంలో ఫలితాల వెల్లడికి సమయం పట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లో అమెరికా మీడియా సంస్థలు ఎవరు ఆధిక్యంలో ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తాయి.
అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఫలితాల కోసం వీటిపైనే ఆధారపడతారు. అమెరికాలో ఆరు కాలమానాలున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం 11:30 గంటలకు అమెరికావ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అంటే బుధవారం రాత్రికల్లా ఫలితాల ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది తెలిసే అవకాశం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో అవి ఎటువైపు మొగ్గుతాయనేది ముందు నుంచే తెలిసి ఉంటుంది. సులభంగా అంచనా వేయవచ్చు. ఈ రాష్ట్రాల్లో ఫలితాలు తొందరగానే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది ఏడు స్వింగ్ రాష్ట్రాలు.
వీటిలో ఫలితాలు వెల్లడైతే గాని ఉత్కంఠకు తెరపడదు. హోరాహోరీ పోరు దృష్ట్యా స్వింగ్ రాష్ట్రాలు.. ముఖ్యంగా పెన్సిల్వేనియా తదుపరి అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయించనున్నాయి. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీలు ఉన్నాయి. ఈ స్వింగ్ రాష్ట్రాలు స్వల్ప ఆధిక్యంతో ఏదైనా పార్టీ ఖాతాలో పడొచ్చు. అప్పుడు రీకౌంటింగ్ అవసరమవుతుంది. అప్పుడు ఫలితాల వెల్లడి మరింత ఆలస్యమవుతుంది.
ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తే.. అక్కడున్న ఎలక్టోరల్ ఓట్లన్నీ సదరు పార్టీ ఖాతాలో పడతాయి. ప్రతి రాష్ట్రానికి జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజి ఓట్లుంటాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లుంటాయి. అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాలి. దేశవ్యాప్తంగా మెజారిటీ ఓట్లు సాధించినా అధ్యక్షపదవి వరిస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఎలక్టోరల్ ఓట్లే అధ్యక్షుడెవరనేది నిర్ణయిస్తాయి. 2020లో నవంబరు 3న ఎన్నికలు జరగగ్గా... ఫలితం తేలడానికి నాలుగు రోజులు పట్టింది.
పెన్సిల్వేనియాలో ఫలితం స్పష్టమయ్యాక.. జో బైడెన్ నెగ్గారని మీడియా ప్రకటించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాక ట్రంప్ తొలుత 11 శాతం ఓట్ల ఆధిక్యం కనబర్చారు. తర్వాత రెండురోజుల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రారంభమయ్యాక.. బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు. వార్త సంస్థ ‘అసోసియేటెడ్ ప్రెస్’ తొలుత విజేతను ప్రకటిస్తూ వస్తోంది. 1848 నుంచి కచ్చితంగా విజేత ఎవరో తొలుత చెబుతోంది. 2016 ఎన్నికలు జరిగిన రోజు రాత్రే డొనాల్డ్ ట్రంప్‌ను అసోసియేటెడ్ ప్రెస్ విజేతగా ప్రకటించింది. అధికారిక ప్రక్రియ మాత్రం కొనసాగుతూ ఉంటుంది. డిసెంబరు 11 కల్లా రాష్ట్రాలు ఫలితాలను ప్రకటించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment