Japan prime minister Shinzo Abe
-
షింజో అబె గుడ్ బై
టోక్యో: జపాన్ను సుదీర్ఘకాలం పరిపాలించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన షింజో అబె అనారోగ్య కారణాలతో పదవి వీడనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శుక్రవారం మీడియాకి వెల్లడించారు. తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోకుండానే పదవి వీడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రజలకు మంచి జరిగే నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేనప్పుడు ప్రధానిగా కొనసాగలేను. నా పదవికి రాజీనామా చేస్తున్నా’’అని 65 ఏళ్ల వయసున్న అబె ప్రకటించారు. యుక్త వయసులో ఉన్నప్పట్నుంచి అల్సరేటివ్ కాలిట్స్ అనే పెద్ద పేగుకి సంబంధించిన సమస్యతో అబె బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైనా పూర్తి స్థాయిలో కోలుకుంటానన్న నమ్మకం తనకి లేదన్నారు. చికిత్స పూర్తయ్యాక సోమవారం పదవి నుంచి వైదొలుగుతానని షింజో అబె చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌తో ఆయన పదవీకాలం ముగిసిపోతుంది. అంతవరకు షింజో అబె పదవిలో కొనసాగాలని పార్టీ ప్రతినిధులు భావించారు కానీ అబె ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆయన రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 2006లో తొలిసారిగా జపాన్‌కు ప్రధాని అయిన అబె అనారోగ్య సమస్యలతో ఏడాదికే రాజీనామా చేశారు. తిరిగి 2012లో అధికారంలోకి వచ్చిన ఆయన తన ఆర్థిక విధానాలతో గుర్తింపు పొందారు. జపాన్ ప్రధానమంత్రి అనారోగ్యంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ‘‘స్నేహితుడా నీ అనారోగ్యం అత్యంత బాధాకరం. నీ నాయకత్వం, చిత్తశుద్ధితో భారత్, జపాన్ మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయి. అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, ప్రపంచంలోనే ఆర్థికంగా శక్తిమంతమైన మూడో దేశమైన జపాన్ తదుపరి ప్రధాని ఎవరన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఉప ప్రధాని తారో అసో, రక్షణ మంత్రి షిగెరు ఇషిబా, ఫ్యుమియో కిషిడా పేర్లు వినిపిస్తున్నాయి. -
త్వరలో జపాన్‌తో 2+2 చర్చలు
టోక్యో: భారత్, జపాన్ల విదేశాంగ, రక్షణ మంత్రులతో కూడిన 2+2 చర్చలు త్వరలో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఈ మేరకు ఇరు దేశాలూ నిర్ణయం తీసుకున్నాయి. భారత్–జపాన్ 13వ ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా సోమవారం టోక్యోలో జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ భేటీ అయ్యారు. ఆర్థిక, రక్షణ, ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, జపాన్ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సహా పలు అంశాలపై వారు విస్తృత చర్చలు జరిపారు. పాకిస్తాన్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇతర దేశాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు తమతమ దేశాలను వాడుకోకుండా అన్ని దేశాలూ చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. భేటీ అనంతరం మోదీ ‘షింజో అబేతో ఫలప్రదమైన, విస్తృత చర్చలు జరిపాను. మరింత మెరుగైన ఆర్థిక బంధాలు, రక్షణ–భద్రత రంగంలో బలమైన సహకారంపై ప్రధానంగా మేం మట్లాడాం’ అని ట్విట్టర్లో తెలిపారు. భారత్–జపాన్ల బంధం ప్రపంచంలోనే అత్యంత బలమైనదని అబే పేర్కొన్నారు. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి జపాన్ మద్దతు తెలిపింది. శాంతంగా పరిష్కరించుకోవాలి.. చర్చల అనంతరం ఇండియా–జపాన్ దార్శనిక ప్రకటనను ఇరువురు ప్రధానులు సంయుక్తంగా విడుదల చేశారు. ప్రపంచ దేశాలు సమస్యలను శాంతితో సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప బెదిరింపులకు, బలప్రయోగాలకు దిగకూడదని కోరారు. ఇరుదేశాల పరస్పర అభివృద్ధి కోసం అవరోధాల్లేని వాణిజ్యం, పౌరుల వలసలు, సాంకేతికతను పంచుకోవడం తదితరాలపై భారత్, జపాన్‌లు కలిసి పనిచేయాలని తాము నిర్ణయించామన్నారు. ‘అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించేందుకు, అణ్వస్త్ర వ్యాప్తి, అణు ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఇద్దరం కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. కూల్‌డ్రింక్ కన్నా జీబీ డేటా తక్కువ జపాన్‌లోని భారతీయులతోనూ మోదీ సమావేశమై అక్కడ ప్రసంగించారు. జపాన్‌లో స్థిరపడిన భారతీయులు స్వదేశంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి దోహదపడాలని కోరారు. దేశంలో డిజిటల్ మౌలిక వసతులు ఎంతగానో మెరుగుపడ్డాయనీ, ఇప్పుడు చిన్న కూల్‌డ్రింక్ బాటిల్ ఖరీదు కన్నా ఒక జీబీ డేటా ధర తక్కువగా ఉందన్నారు. అనంతరం మోదీ భారత్‌కు బయలుదేరారు. -
భాగస్వామ్యం బలోపేతం
యమనషి: భారత్–జపాన్ల భాగస్వామ్యం పూర్తిగా పరివర్తనం చెందిందనీ, ఇప్పుడు అది ‘ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం’గా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘ఇరు దేశాల బంధంలో ప్రతికూలతలేవీ లేవు. ఉన్నవన్నీ అవకాశాలే’ అని జపాన్ మీడియాతో మోదీ అన్నారు. జపాన్–భారత్ 13వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోదీ జపాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశంలోని అత్యంత ఎత్తైన పర్వతం ఫుజి దగ్గర్లోని ఓ రిసార్ట్‌లో జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ అనధికారిక చర్చలు జరిపారు. ఆదివారం మొత్తంగా మోదీ–అబేలు 8 గంటలపాటు కలిసి గడిపారు. జపాన్–భారత్ సంబంధాల పురోగతిని సమీక్షించి, వ్యూహాత్మకంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ‘సుందరమైన యమనషి ప్రాంతంలో అబెను కలుసుకోవడం అమితానందంగా ఉంది’ అని మోదీ అన్నారు. ప్రత్యేక ఆతిథ్యానికి కృతజ్ఞతలు: మోదీ రోబో పరిశ్రమను సందర్శించిన అనంతరం కవగుచి సరస్సు సమీపంలోని తన సొంత ఇంటికి మోదీని అబే తీసుకెళ్లి విందు ఇచ్చారు. విదేశీ నేతను ఈ ఇంటికి అబే ఆహ్వానించడం ఇదే తొలిసారి. దీనిపై మోదీ ట్వీటర్లో స్పందిస్తూ ‘తన ఇంట్లో ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చిన అబేకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాప్‌స్టిక్‌లను ఉపయోగించి జపాన్ విధానంలో ఆహారాన్ని ఎలా తినాలో కూడా అబే నాకు నేర్పించారు’ అని తెలిపారు. విందు తర్వాత ఇరువురు ప్రధానులు రైలులో టోక్యోకు చేరుకున్నారు. అక్కడే సోమవారం అధికారిక భేటీలో మోదీ, అబేలు పాల్గొంటారు. ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక సహకారాలను బలపరిచే అంశంపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం తరహాలోనే జపాన్ కూడా ఓ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిపై కూడా వారిద్దరూ చర్చించే అవకాశం ఉంది. తాను ప్రధాని అయ్యాక అబేను కలవడం ఇది 12వ సారని మోదీ చెప్పారు. భారత్‌కు జీవితకాల మిత్రుణ్ని: అబే భారత్‌కు తాను జీవితకాల మిత్రుడినని అబే తెలిపారు. తాను అత్యంత ఆధారపడదగ్గ, తనకున్న అత్యంత విలువైన స్నేహితుల్లో మోదీ ఒకరన్నారు. జపాన్ తొలి ప్రధాని, తన తాత నొబుసుకె కిషి 1957లో భారత్‌ను సందర్శించడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘జపాన్ ఇంత ధనిక దేశం కానప్పుడు నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కిషిని తీసుకెళ్లి జపాన్ ప్రధానిగా వేలాదిమందికి పరిచయం చేశారు. 1958 నుంచే భారత్‌కు జపాన్ రుణాలు ఇవ్వడం ప్రారంభమైంది’ అని అబే పేర్కొన్నారు. 2007లో తాను భారత్‌ను సందర్శించినప్పుడు ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పార్లమెంటులో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా తనకు భారత్ కల్పించిన గౌరవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అబేకి మోదీ బహుమతి హోటల్లో మోదీకి అబే అల్పాహారం విందు ఇచ్చారు. అనంతరం వారిద్దరూ అక్కడి ఉద్యానవనంలో తిరుగుతూ మాట్లాడుకున్నారు. చేతితో మలిచిన రెండు రాతిగిన్నెలను, రాజస్తాన్ పలుగురాళ్లు పొదిగిన దుప్పట్లను, జోధ్‌పూర్‌లో తయారైన చెక్కపెట్టెను మోదీ అబేకు బహుమతిగా ఇచ్చారు. వీటన్నింటినీ మోదీ జపాన్ పర్యటన కోసమే ప్రత్యేకంగా తయారు చేయించారు. తర్వాత ఇద్దరూ పారిశ్రామిక రోబోలను తయారుచేసే ఎఫ్ఏఎన్యూసీ పరిశ్రమను సందర్శించారు. ‘ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ఆధునిక సాంకేతికత స్థాయికి తీసుకెళ్తున్నాం. మోదీ, అబే రోబోల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎఫ్ఏఎన్యూసీ పరిశ్రమను సందర్శించారు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. రోబోలు ఎలా పనిచేస్తాయి, వాటి సామర్థ్యాలేంటనే విషయాలను పరిశ్రమ సిబ్బంది వారికి వివరించారు. -
భారత్–జపాన్.. గెలుపు జోడీ
న్యూఢిల్లీ: భారత్–జపాన్ ద్వైపాక్షిక వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్ చేరుకున్నారు. అంతకుముందు, మోదీ మాట్లాడుతూ భారత్, జపాన్‌లది గెలుపు జోడీ అని అభివర్ణించారు. ఆర్థిక, సాంకేతికాభివృద్ధిలో భారత్‌కు జపాన్ విశ్వసనీయమైన భాగస్వామి అని అన్నారు. టోక్యో విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆదివారం, సోమవారం జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ భేటీ అవుతారు. 2014లో ప్రధాని అయ్యాక మోదీ అబేతో సమావేశమవడం ఇది 13వ సారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలు రక్షణ, ప్రాంతీయ అనుసంధానత సహా పలు అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. ఇరు దేశాల సంబంధాల్లో పురోగతిని సమీక్షించి, వాటిని వ్యూహాత్మక కోణంలో బలోపేతం చేయడమే అజెండాగా ఈ సమావేశం జరుగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆదివారం నాటి షెడ్యూల్లో ఫ్యాక్టరీ ఆటోమేషన్‌లో అతిపెద్ద ఉత్పత్తిదారైన ఓ కంపెనీని మోదీ, అబే సందర్శిస్తారు. జపాన్ రాజధాని టోక్యోకు 110 కి.మీ.ల దూరంలోని యామాన్షి ప్రావిన్సులో ప్రకృతి సోయగాల మధ్య, ఆ దేశంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఫుజి ఆవరించి ఉన్న తన విడిది గృహంలో అబే ప్రధాని మోదీకి రాత్రి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఈ గౌరవం పొందబోతున్న తొలి విదేశీ నేత మోదీనే. విందు అనంతరం మోదీ, అబేలు రైలులో టోక్యో బయల్దేరుతారు. ఈ పర్యటనలో మోదీ టోక్యోలో అక్కడి భారత సంతతి ప్రజలతో ముచ్చటిస్తారు. కొన్ని వాణిజ్య వేదికలపై కూడా మోదీ ప్రసంగించనున్నారు. 6న కేదర్‌నాథ్‌కు.. వచ్చే నెల 6న మోదీ ఉత్తరాఖండ్‌లోని కేదర్నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించే అవకాశాలున్నాయి. అలాగే, కేదర్‌పురి ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా సమీక్షించే వీలుంది. అయితే ప్రధాని పర్యటనపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కేదర్‌పురి ఆలయానికి మోదీ గతేడాది శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులను తరచూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. -
మోదీకి అరుదైన ఆతిథ్యం
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీకి జపాన్ ప్రధాని షింజో అబే అరుదైన ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జపాన్‌లో పర్యటన సందర్భంగా ప్రధాని షింజో అబే తన విశ్రాంతి గృహానికి మోదీని ఆహ్వానించారు. యమనషి ప్రావిన్స్‌లో కొండల మధ్య ఉన్న సుందరమైన ఆ విశ్రాంతి గృహానికి ఒక విదేశీ నేతను అబే ఆహ్వానించటం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఇద్దరు ప్రధానులు అక్కడి హోటల్లో మధ్యాహ్నం విందు చేయనున్నారు. -
మరో మూడేళ్లు అబేనే
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) అధ్యక్షుడిగా మరో మూడేళ్ల కాలానికి ఎన్నికయ్యారు. దీంతో 2021, ఆగస్టు వరకూ ఆయన జపాన్ ప్రధానిగా కొనసాగనున్నారు. గురువారం జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 807 ఓట్లకుగానూ అబే 553 ఓట్లను దక్కించుకోగా, ఆయన ప్రత్యర్థి, మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబాకు 254 ఓట్లు లభించాయి. విజయం అనంతరం అబే మాట్లాడుతూ..‘పోరాటం ముగిసింది. ఇక రాజ్యాంగ సవరణపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. పదండి.. సరికొత్త జపాన్ కోసం మనమందరం కలసికట్టుగా కృషి చేద్దాం’ అని పిలుపునిచ్చారు. తాజా విజయంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒత్తిడితో 1947లో రూపొందించిన రాజ్యాంగాన్ని సవరించేందుకు అబేకు మార్గం సుగమమైంది. ఉభయసభల్లో అబే నేతృత్వంలోని ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. జపాన్‌కు యుద్ధం చేసేందుకు సైన్యం లేకుండా, అంతర్జాతీయంగా తలెత్తే ఘర్షణల్లో పాల్గొనకుండా నిషేధిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 9కు సవరణలు చేయాలని అబే పట్టుదలతో ఉన్నారు. జపాన్‌కు ప్రస్తుతం ఆత్మరక్షణకు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్(జేఎస్‌డీఎఫ్) అనే పరిమిత సైన్యం మాత్రమే ఉంది. -
మోదీతో మాటామంతికి అబే వస్తున్నారు
టోక్యో : జపాన్ ప్రధాని షింజో అబే గుజరాత్లో అడుగుపెట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో ఆయన ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చర్చలు చేయనున్నారు. ఈ వారంలోనే ఇరు నేతల మధ్య సమావేశం ఉండనున్నట్లు భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సోమవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వివరించింది. బుధవారం నుంచి రెండు రోజులపాటు అబే పర్యటన ఉంటుందని తెలిపింది. ఇండియా - జపాన్ 12వ వార్షిక సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటుచేస్తున్నారు. ఉత్తర కొరియా వరుస అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న నేపథ్యంలో అవుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. మరోపక్క, దక్షిణ చైనా సముద్రంపై కూడా చైనా చేస్తున్న రాజకీయాలు జపాన్‌కు కొంత ఇబ్బందిని కలిగిస్తున్న నేపథ్యంలో కూడా ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది. వ్యక్తిగతంగా చూస్తే ప్రధాని మోదీకి, అబేకు మధ్య భేటీ జరగడం ఇది నాలుగో సారి. ప్రస్తుతం భారత్, జపాన్ మధ్య వృద్ధి చెందిన సంబంధాలు, వ్యూహాత్మక సంబంధాలు, అంతర్జాతీయ వేదికపై ఉన్న భాగస్వామ్యం, భవిష్యత్‌లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే తదితర విషయాలను పరిశీలించనున్నారు.