టోక్యోలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తున్న మోదీ
టోక్యో: భారత్, జపాన్‌ల విదేశాంగ, రక్షణ మంత్రులతో కూడిన 2+2 చర్చలు త్వరలో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఈ మేరకు ఇరు దేశాలూ నిర్ణయం తీసుకున్నాయి. భారత్–జపాన్ 13వ ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా సోమవారం టోక్యోలో జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ భేటీ అయ్యారు. ఆర్థిక, రక్షణ, ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, జపాన్ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సహా పలు అంశాలపై వారు విస్తృత చర్చలు జరిపారు.
పాకిస్తాన్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇతర దేశాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు తమతమ దేశాలను వాడుకోకుండా అన్ని దేశాలూ చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. భేటీ అనంతరం మోదీ ‘షింజో అబేతో ఫలప్రదమైన, విస్తృత చర్చలు జరిపాను. మరింత మెరుగైన ఆర్థిక బంధాలు, రక్షణ–భద్రత రంగంలో బలమైన సహకారంపై ప్రధానంగా మేం మట్లాడాం’ అని ట్విట్టర్‌లో తెలిపారు. భారత్–జపాన్‌ల బంధం ప్రపంచంలోనే అత్యంత బలమైనదని అబే పేర్కొన్నారు. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి జపాన్ మద్దతు తెలిపింది.
శాంతంగా పరిష్కరించుకోవాలి..
చర్చల అనంతరం ఇండియా–జపాన్ దార్శనిక ప్రకటనను ఇరువురు ప్రధానులు సంయుక్తంగా విడుదల చేశారు. ప్రపంచ దేశాలు సమస్యలను శాంతితో సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప బెదిరింపులకు, బలప్రయోగాలకు దిగకూడదని కోరారు. ఇరుదేశాల పరస్పర అభివృద్ధి కోసం అవరోధాల్లేని వాణిజ్యం, పౌరుల వలసలు, సాంకేతికతను పంచుకోవడం తదితరాలపై భారత్, జపాన్‌లు కలిసి పనిచేయాలని తాము నిర్ణయించామన్నారు. ‘అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించేందుకు, అణ్వస్త్ర వ్యాప్తి, అణు ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఇద్దరం కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు.
కూల్‌డ్రింక్ కన్నా జీబీ డేటా తక్కువ
జపాన్‌లోని భారతీయులతోనూ మోదీ సమావేశమై అక్కడ ప్రసంగించారు. జపాన్‌లో స్థిరపడిన భారతీయులు స్వదేశంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి దోహదపడాలని కోరారు. దేశంలో డిజిటల్ మౌలిక వసతులు ఎంతగానో మెరుగుపడ్డాయనీ, ఇప్పుడు చిన్న కూల్‌డ్రింక్ బాటిల్ ఖరీదు కన్నా ఒక జీబీ డేటా ధర తక్కువగా ఉందన్నారు. అనంతరం మోదీ భారత్‌కు బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment