
న్యూఢిల్లీ: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు(ఎస్‌ఈబీసీ) రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్ వేసింది. 102వ రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పుతో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే రాష్ట్రాల హక్కుకు విఘాతం కలుగుతోందని పేర్కొంది.
ఆ సవరణ ద్వారా పొందుపర్చిన రెండు నిబంధనలు దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కాదని కేంద్రం ఆ పిటిషన్‌లో పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని మే 5న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అలాగే, రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మండల్’తీర్పును విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
రివ్యూ పిటిషన్‌పై బహిరంగ కోర్టులోనే విచారణ జరగాలని, దీనిపై తీర్పు వెలువడే వరకు గత తీర్పులోని పలు అంశాలపై స్టే విధించాలని కేంద్రం కోరింది. గత తీర్పులో ఆర్టికల్ 342ఏను ధర్మాసనం సమర్ధిస్తూనే.. ఎస్‌ఈబీసీలను గుర్తించే విషయంలో రాష్ట్రాలకు ఉన్న హక్కును తప్పుగా అర్థం చేసుకుందని రివ్యూ పిటిషన్‌లో కేంద్రం పేర్కొంది. 342ఏతో పాటు రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపర్చిన ఇతర నిబంధనలపై తీర్పు వెలిబుచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కేంద్రం తన రివ్యూ పిటిషన్‌లో కోరింది.
Comments
Please login to add a commentAdd a comment