అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 10% రిజర్వేషన్ ప్రక్రియకు చట్టపరమైన అడ్డంకులు తప్పవని పలువురు ప్రముఖ న్యాయవాదులు భావిస్తున్నారు. ‘ప్రభుత్వం ఏ వర్గం ప్రజలకైనా రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. అయితే దీని వల్ల లబ్ధి పొందే వర్గం ప్రజలకు ప్రస్తుతం ఉద్యోగాలు, విద్యలో తగినంత ప్రాతినిధ్యం లేదనే విషయాన్ని సంఖ్యా వివరాలతో సహా రుజువు చేయాల్సి ఉంటుంది. ఏ వర్గానికి కోటా ఇవ్వదలిచినా జనాభాలో, ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ఆ వర్గం వాటా ఎంత ఉందనే పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని 1991 నాటి ఇందిరా సహానీ కేసు నుంచి అనేక కేసుల్లో ఇచ్చిన తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ అగ్రవర్ణ పేదలకు కోటా ఇవ్వడం సబబేనని చెప్పడానికి నరేంద్రమోదీ సర్కారు ఎలాంటి అధ్యయనమూ చేసినట్టు కనిపించడం లేదు’ అని మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ కేవీ విశ్వనాథన్ వివరించారు. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడినవర్గాల ప్రాతినిధ్యం సరిగా లేదని నిర్ధారించేందుకు ఓ కమిటీ వేస్తే బావుంటుందని సూచించారు.
హడావుడి నిర్ణయం తగదు: వికాస్
‘కొత్త కోటా కోసం రాజ్యాంగ సవరణను ఇంత హడావుడిగా చేయడం సరికాదు. ముందు విస్తృత సంప్రదింపులు, అధ్యయనం జరగాలి’ అని మరో మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ వికాస్‌సింగ్ అభిప్రాయపడ్డారు. జాట్ వర్గీయులను ఓబీసీల్లో చేర్చుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేస్తూ, ఇది కాలం చెల్లిన వివరాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమని తప్పుపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ‘14, 15 అధికరణల కింద వివక్ష లేని సమానత్వ సూత్రాల కింద లభించే హక్కులను ప్రభావితం చేసే ఇలాంటి కీలక, సున్నితమైన నిర్ణయాన్ని పాత వివరాల ఆధారంగా తీసుకోకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పట్లో తీర్పు చెప్పింది. రాజ్యాంగంలోని 16(4) అధికరణలో ప్రస్తావించిన వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటుతనం కిందకు వస్తుంది.
అయితే విద్యాపరమైన, ఆర్థిక వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటుతనానికి దారితీయొచ్చు. కానీ, సామాజిక వెనుకబాటుతనానికి ప్రత్యేక లక్షణాలు, కారణాలుంటాయని జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం అప్పట్లో తేల్చిచెప్పింది’ అని వికాస్ సింగ్ చెప్పారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం కోటా కల్పించాలన్న అప్పటి సర్కారు నిర్ణయాన్ని(1991 సెప్టెంబర్ 25) ఇందిరా సహానీ(మండల్ కేసు)కేసులో 9 మంది జడ్జీల సుప్రీంకోర్టు చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇది 16వ అధికరణ ప్రకారం రాజ్యాంగబద్ధం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఓపెన్ కేటగిరీలోని పది శాతం ఖాళీలను ఆర్థిక ప్రాతిపదికపై పేదలకు కేటాయించడం అంటే ఆపైన ఉన్నవారికి పదిశాతం సీట్లు దక్కకుండా చేయడమే అవుతుంది. ఇలాంటి చర్య ఏదైనా 16వ అధికరణలో సమానావకాశాలు ఇవ్వాలనే ఒకటో నిబంధనకు విరుద్ధమని ఆ బెంచ్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment