AP CM YS Jagan: CM Comments in Legislative Assembly debate on Women empowerment - Sakshi
Sakshi News home page

విప్లవంలా.. మహిళా సాధికారత: సీఎం వైఎస్‌ జగన్‌

Published Fri, Nov 19 2021 2:29 AM | Last Updated on Fri, Nov 19 2021 12:45 PM

CM YS Jagan Comments in Legislative Assembly debate on Women empowerment - Sakshi

గురువారం శాసనసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఎకనామికల్లీ బ్యాక్‌ వర్డ్‌ కమ్యూనిటీ (ఈబీసీ) వారికి కూడా మంచి చేయాలని వచ్చే జనవరి 9 నుంచి.. అంటే నా పాదయాత్ర ముగిసిన రోజు నుంచి ఈబీసీ నేస్తం అనే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నాం.  
–సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: మహిళా సాధికారతను రాష్ట్రంలో ఒక ఉద్యమంగా, విప్లవంగా చేపట్టినట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ దిశగా ఈ రెండున్నరేళ్లు ఒక సువర్ణాధ్యాయమని.. అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా సగర్వంగా తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు. రాజకీయాలకు తావు లేకుండా మహిళలను మహరాణులుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం తమదన్నారు. మహిళా సాధికారతపై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 44.50 లక్షల మంది తల్లులకు, వారి ద్వారా 85 లక్షల మంది పిల్లలకు కోసం జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ఇందులో ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా ఈ రెండున్నరేళ్లలో అక్కచెల్లెమ్మలకు రూ.13,023 కోట్లు ఇచ్చామన్నారు. తద్వారా పిల్లలను బడులకు పంపించే గొప్ప విప్లవానికి నాంది పలికామని వివరించారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
 
నాడు పింఛన్ల బిల్లు రూ.400 కోట్లు.. నేడు రూ.1500 కోట్లు  

► గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 44 లక్షల పింఛన్లు. నెలకు కేవలం రూ.400 కోట్లు పింఛన్‌ బిల్లు వచ్చేది. ఈ రోజు పింఛన్లు 61.73 లక్షలు. తొలి రోజు నుంచి రూ.2,250 ఇస్తున్నాం. ఈ రోజు ప్రతి నెలా పింఛన్ల బిల్లు రూ.1,500 కోట్లకు పైగా ఉంది.  
► 61.73 లక్షల మందిలో 36.70 లక్షల మంది అవ్వలు, అక్కలు ఉన్నారు. రూ.21,899 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టాం. ప్రతి నెలా ఒకటో తారీఖున వలంటీర్‌ ద్వారా వారి చేతుల్లో పెడుతున్నాం.  

 
వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీతో పొదుపు సంఘాలకు ఆక్సిజన్‌ 
► వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా 78.86 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ల కాలంలో జరిగే మేలు రూ.25,517 కోట్లు. ఈ రెండేళ్లలో రూ.12,758 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. 
► సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపుగా కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,354 కోట్లు ఇచ్చాం. ఎన్నికల వేళ గత పాలకులు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేస్తే.. పొదుపు సంఘాల గ్రూపుల ఎన్‌పీయేల శాతం 18.36కు పోయింది. ఏ గ్రేడ్‌ సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకు దిగజారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌ ఆసరా పథకం వాటికి ఆక్సిజన్‌గా నిలిచింది.  

వ్యాపారాలకు ఊతం 
► వైఎస్సార్‌ చేయూత ద్వారా రెండేళ్లుగా ఏటా రూ.18,750 చొప్పున (మొత్తం నాలుగు దఫాలు) ఇస్తున్నాం. 24.56 లక్షల మంది 45 నుంచి 60 ఏళ్ల మధ్యలోనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అందించాం. ఇప్పటికి రెండు విడతలుగా రూ.8,944 కోట్లు ఇచ్చాం.   
► బ్యాంకర్లతో, రిలయెన్స్, ఐటీసీ, అమూల్, హిందుస్తాన్‌ లీవర్, పీ అండ్‌ జీ  వంటి పెద్ద పెద్ద సంస్థలతో అనుసంధానం చేసి 1.10 లక్షల మందితో రిటైల్‌ షాపులు పెట్టించాం. ఆవులు, గేదెలు కొనుక్కుని 1,34,103 మంది లబ్ధి పొందారు. మేకలు, గొర్రెలు ద్వారా 82,556 మందికి మేలు జరిగింది.  
 
కుప్పంలో దేవుడు మొట్టికాయలు వేశారు 
► రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల పంచాయతీలు ఉంటే, 17 వేల వైఎస్సార్‌ జగనన్న కాలనీలు ఉన్నాయి. 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం. అంటే దాదాపు కోటి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించే కార్యక్రమం ఇది.  
► 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణం పూర్తయితే ప్రతి అక్క, చెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి చేతిలో పెట్టినట్లవుతుంది. మొత్తంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద వాళ్ల చేతిలో పెట్టినట్లవుతుంది. ఇలాంటి మంచి పథకాన్ని కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నందుకు దేవుడు కుప్పంలో మొట్టికాయలు వేశారు.  
 
పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే  
► జగనన్న విద్యా దీవెన ద్వారా 18.51 లక్షల మంది తల్లులకు రూ.5,573 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చాం.   
► బోర్డింగ్‌ ఇతర ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన ద్వారా 15.57 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.2,270 కోట్లు జమ చేశాం. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే అని.. మనసా, వాచా ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలికాం.   
 
గర్భిణులు, బాలింతలు, చిన్నారులపై శ్రద్ద
► వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఈ పథకాల ద్వారా 33.44 లక్షల మందికి మేలు జరుగుతుంది. రూ.2,972 కోట్లు ఖర్చు చేస్తున్నాం.  
 
వారు అన్ని విధాలా నిలదొక్కుకోవాలని.. 
► నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. కేబినెట్‌లో హోంమంత్రిగా ఒక చెల్లికి, ఉప ముఖ్యమంత్రిగా మరో ఎస్టీ మహిళకు స్థానం కల్పించాం. ఎమ్మెల్సీలుగా ఇద్దరు మైనార్టీ మహిళలను, ఒక బీసీ మహిళను తీసుకొచ్చాం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా అధికారిని నియమించాం.  
► కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు 51 శాతం పదవులిచ్చాం. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాల్టీలు, నగర పంచాయతీల చైర్మన్లు, మేయర్‌ పదవులు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో సగభాగానికి పైగా వారికే ఇచ్చాం. 2.50 లక్షల మంది వలంటీర్లలో 53 శాతం మంది నా చెల్లెమ్మలే. 13 జెడ్పీ చైర్మన్లలో ఏడుగురు అక్కచెల్లెమ్మలే. వైస్‌ ఛైర్మన్లు 26 మందిలో 15 మంది వారే.   
 
మహిళా భద్రతే ముఖ్యం 
► దిశా చట్టం చేసి, కేంద్రానికి ఆమోదం కోసం పంపాం. ఇవాళ దిశ యాప్‌ ద్వారా దాదాపు 90 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. ఈ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 6,880 మంది రక్షణ పొందారు.   
► పలు చర్యల ద్వారా మద్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసు ఉన్నారు. దోషులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నాం.  
► స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10,388 పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలల్లో టీనేజ్‌ బాలికలకు బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ను ఉచితంగా ఇస్తున్నాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 

97 శాతం ఆశీర్వాదం 
► నిన్న 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో కౌంటింగ్‌ ముగిసింది. ఇందులో ఒక్కచోట మాత్రమే టీడీపీ వచ్చింది. కొండపల్లిలో టై. మిగిలిన అన్నీ క్లీన్‌ స్వీప్‌. దాని అర్థం 97 శాతం వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించారు. (గ్రాఫ్‌ ప్రదర్శించారు) 
► మనం అధికారంలోకి వచ్చినప్పుడు 50 శాతం ఓట్‌ షేర్‌ వస్తే, ఇప్పుడు 55.77 శాతం వచ్చింది.   
 
అచ్చెన్నాయుడు బీఏసీలోకి వచ్చినప్పుడు, చంద్రబాబునాయుడు కూడా వస్తారేమోనని కాస్త ఆలస్యం చేశాం. మహిళా సాధికారత మీద చర్చ జరుగుతున్నప్పుడు తాను (చంద్రబాబు) కూడా ఉంటే బాగుంటుందని వేచి చూశాం. ఇక్కడే ఉన్నారు.. వస్తారని అన్నారు.. వేచి చూసినప్పటికీ రాలేదు. ఆయనకున్న కష్టమేమిటో తెలియదు. మా వాళ్లందరూ కుప్పం ఎఫెక్ట్‌ అంటున్నారు. ఈ సమయంలో ఇక్కడ ఉండి ఉంటే బావుండేది. ఇక్కడ లేకపోయినా టీవీలో చూస్తుంటారని, ఇకపై అయినా బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement