AP CM Jagan To Credit Jagananna Amma Vodi Scheme Money on 27th June - Sakshi
Sakshi News home page

Jagananna Amma Vodi: శ్రీకాకుళంలో ‘అమ్మఒడి’: వరుసగా మూడో ఏడాది అమలు

Published Mon, Jun 27 2022 6:11 AM | Last Updated on Mon, Jun 27 2022 8:14 AM

CM Jagan To Credit Jagananna Amma Vodi Scheme Money 27th June - Sakshi

సాక్షి, అమరావతి: పిల్లల చదువులకు పేదరికం అడ్డంకి కాకుండా, సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాది (2021–22 విద్యా సంవత్సరానికి) అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు అమ్మ ఒడితో లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శ్రీకాకుళంలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. తాజాగా ఇచ్చే సొమ్ముతో కలిపి ఇప్పటివరకు జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం మొత్తం దాదాపు రూ.19,618 కోట్లు అందించినట్లు కానుంది. 

సంపూర్ణ ప్రయోజనం చేకూరేలా..
అమ్మ ఒడి ద్వారా 2019 –20లో రాష్ట్ర ప్రభుత్వం 42,33,098 మంది తల్లులకు రూ.6,349.53 కోట్లు అందించింది. 2020– 21లో 44,48,865 మందికి రూ.6,673 కోట్లకుపై సాయంగా ఖాతాల్లో జమ చేసింది. పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మ ఒడి పథకానికి కనీసం 75 శాతం హాజరు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. 2019లో పథకం ప్రవేశపెట్టినప్పుడు జీవోలోనే ఆ నిబంధనలు ఉన్నాయి. అయితే పథకం ప్రారంభించిన తొలిఏడాది కావడంతో 2019 –20లో, కోవిడ్‌ కారణంగా 2020 –21లో కనీసం 75 శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు కల్పించింది.

గత సెప్టెంబర్‌ నుంచి విద్యాసంస్ధలు యధావిధిగా పని చేస్తున్నందున 75 శాతం హాజరు నిబంధన అమలు కానుంది. దీనివల్ల 2021–22లో 51,000 మంది అమ్మ ఒడి అందుకోలేకపోతున్నారు.

ఈ విషయం బాధాకరమైనప్పటికీ భవిష్యత్‌లో ఇలాంటి పరిస్ధితి తలెత్తకుండా పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా తల్లులే బాధ్యత తీసుకోవాలని, అప్పుడే ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన, సీబీఎస్‌ఈ విధానం, బైజూస్‌తో ఒప్పందం తదితరాలతో విద్యార్థులకు పూర్తి ప్రయోజనం చేకూరి ప్రపంచంతో పోటీ పడగలిగే పరిస్ధితి వస్తుందని మనస్పూర్తిగా విశ్వసిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

మన బడి నాడు నేడు ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు చిరకాలం విద్యార్ధులకు అందాలన్న తపనతో, చిన్న చిన్న మరమ్మతులను తక్షణమే చేపట్టే లక్ష్యంతో స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (ఎస్‌ఎంఎఫ్‌)కోసం రూ.వెయ్యి చొప్పున జమ చేస్తున్నారు.అలాగే టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌కు కూడా రూ.వెయ్యి చొప్పున జమ చేస్తారు.

నేడు సీఎం జగన్‌ పర్యటన ఇలా
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తిరిగి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement