వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌ | CM Jagan Govt financial assistance to poor womens with YSR EBC Nestham | Sakshi
Sakshi News home page

YSR EBC Nestham: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

Published Tue, Jan 25 2022 2:45 AM | Last Updated on Tue, Jan 25 2022 2:26 PM

CM Jagan Govt financial assistance to poor womens with YSR EBC Nestham - Sakshi

సాక్షి, అమరావతి: అగ్రవర్ణాల్లోని పేద మహిళలకూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పకపోయినప్పటికీ ఈ పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి మొత్తం 3,92,674 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.589 కోట్లను వారి ఖాతాల్లో ఆయన జమచేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో అక్కచెల్లెమ్మకు ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఆర్థికసాయం అందనుంది. 

మహిళా సంక్షేమంలో మరో ముందడుగు
ఇప్పటికే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ కాపు నేస్తం.. అక్కచెల్లెమ్మల పేరిట ఉచిత ఇళ్ల పట్టాలు, ఇళ్లు.. మొదలైన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారి కాళ్ల మీద వారిని నిలబెడుతూ చరిత్ర సృష్టించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు మహిళా సంక్షేమంలో మరో అడుగు ముందుకు వేస్తోంది. మేనిఫెస్టోలో చెప్పకపోయినా రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజికవర్గాల్లోని (ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలు) పేద మహిళలకు కూడా మేలుచేయాలన్న సత్సంకల్పంతో వారికి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు రూపొందించిన కానుకే ఈ ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’. 



అన్ని దశల్లోనూ మహిళలకు తోడుగా..
అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఉదా..
► గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది.
► నాడు–నేడు ద్వారా కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, స్కూల్స్‌లో ఫర్నిచర్, తాగునీరు, ప్రహారీ గోడలు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు తదితర సదుపాయాలతో వాటి రూపురేఖలు మారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం సైతం ప్రవేశపెట్టింది.
► స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్‌ను పంపిణీ చేస్తోంది.
► మహిళల భద్రత కోసం అభయం, దిశ యాప్‌లు తీసుకొచ్చింది.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించింది.
► అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారి పేరు మీదే ఇళ్ల పట్టాలు మంజూరు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తోంది.
► 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు పిల్లలను బడికి పంపే పేద తల్లులకు అమ్మఒడి ద్వారా ఏటా రూ.15,000ల ఆర్థిక సాయం అందిస్తోంది.
► మాఫీ చేస్తానని చెప్పి గత ప్రభుత్వం ఎగ్గొట్టిన పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మలను అప్పుల ఊబి నుంచి ఆదుకుంటోంది. ఇందులో భాగంగా.. దాదాపు రూ.25 వేల కోట్ల రుణ బకాయిలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే నాలుగేళ్లపాటు చెల్లించేందుకు సంకల్పించింది. వారి ఆర్థికాభివృద్ది, సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్‌ ఆసరా.. వారి రుణాలపై వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది.

► అంతేకాక.. 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లపాటు అందించడమే కాక, వారికి జీవనోపాధి అవకాశాలూ కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా వైఎస్సార్‌ చేయూత ద్వారా తోడ్పాటు అందిస్తోంది.
► కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ కాపునేస్తం ద్వారా ఏటా రూ.15,000లు ఆర్థిక సాయం అందిస్తోంది.
► 60 ఏళ్లు పైబడిన అవ్వలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ఇస్తోంది.
► నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది.
► కేబినెట్‌లో మహిళలకు కీలక శాఖల అప్పగించింది. ఒకరికి ఉప ముఖ్యమంత్రి, మరో మహిళకు హోంమంత్రిగా అవకాశం కల్పించింది.
► స్థానిక సంస్థల పదవుల్లో మహిళలకు ప్రాధాన్యతనిచ్చింది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వారికి 61 శాతం పదవులు కట్టబెట్టింది.
► ఇవికాక.. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ఆర్థిక సాయం తల్లుల ఖాతాల్లో జమచేయడం ద్వారా వారి బిడ్డల ఉజ్వల భవితకు జగన్‌ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది.
► బెల్టుషాపుల రద్దు ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో సుఖశాంతులు తీసుకొచ్చింది.
► ఇప్పుడు చెప్పకపోయినా, మేనిఫెస్టోలో పెట్టకపోయినా వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15,000 ఇవ్వాలన్న నిర్ణయంతో  రాష్ట్రంలో 45 నుండి 60 ఏళ్ల వయస్సు ఉన్న అగ్రవర్ణాల్లోని పేద అక్కచెల్లెమ్మలందరికీ  లబ్ధిచేకూరుతుంది. 
► ఇక 60 ఏళ్లు పైబడ్డ మహిళలకూ వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా పెంచి ఇస్తున్న పెన్షన్‌తో నెలకు రూ. 2,500 చొప్పున ఏటా రూ.30వేల లబ్ధి చేకూరుస్తోంది వైఎస్‌ జగన్‌ సర్కారు. వీరితోపాటు వితంతువులు, ఒంటరి మహిళలూ లబ్ధిపొందుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement