Poor womens
-
శారీ బ్యాంక్!
ఒకసారి కట్టిన చీరను మరోసారి కట్టుకోవడానికి ఇష్టపడరు చాలా మంది. దీంతో కొత్త చీరలు కొనే కొద్దీ పాత చీరలు కుప్పలు కుప్పలుగా బీరువాల్లో్ల మూలుగుతుంటాయి. వాటిని ఏళ్ల తరబడి కట్టకుండా అలాగే ఉంచెయ్యడం వల్ల ఎలుకలు కొట్టి కొన్ని, చెదలు పట్టి ఇంకొన్నీ చిరిగిపోవడం, అసలు కట్టకుండా మడతల్లోనే ఉండడం వల్ల చీకిపోయి మసి బట్టకు కూడా పనికి రాకుండా పోతాయి. ఇలా వృథాగా పోతున్న చీరలను నిరుపేదలకు అందించి ఉపయోగకరంగా మారుస్తోంది ఆర్తి శ్యామల్ జోషి. ఔరంగాబాద్‌కు చెందిన డాక్టర్ ఆర్తి శ్యామల్ జోషి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తోంది. రోజూ కట్టుకునే చీరలు కాకుండా ఇంట్లో పాడైపోకుండా ఉన్న చీరలు చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుత ట్రెండ్‌కు అవి నప్పవని కట్టుకోకుండా నెలల తరబడి అలానే ఉంచేసింది. అవి చూసిన ప్రతిసారి వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తుండేది ఆర్తి. ఒకరోజు నిరుపేద మహిళలకు ఇవి ఇస్తే వారికి ఉపయోగపడతాయి కదా! అనిపించింది ఆర్తికి. అనుకున్న వెంటనే తన దగ్గర ఉన్న చీరలను పంచడం ప్రారంభించింది. చీరలు తీసుకున్న మహిళలు ఎంతో సంతోషంగా ఆమెకు కృతజ్ఞతలు చెప్పడంతో ఆర్తికి ప్రోత్సాహం లభించినట్లయింది. దీంతో ఇంట్లో తను కట్టని చీరలు మొత్తం పేదలకు ఇచ్చేసింది. ఆర్తి పనిచేసే చోట చక్కగా ఉన్న కొన్ని బట్టలు, చీరలు చెత్త డబ్బాలో వేయడం గమనించింది. ఇవన్నీ వృథాగా పోతున్నాయి. వీటిని కట్టుకునే నిరుపేదలకు ఇస్తే వేస్ట్ కావు కదా... అనిపించింది. దీంతో 2016లో ఆస్థాజనవికాస్ అనే ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ‘శారీబ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఈ బ్యాంక్ ద్వారా ఆసక్తి ఉన్న మహిళల దగ్గర నుంచి చీరలు సేకరించి ఇప్పటి దాకా పాతికవేలకు పైగా చీరలను పంచిపెట్టింది. చీరలు పంచిపెట్టడం గురించి తెలిసి చాలామంది మహిళలు ఇంట్లో మూలుగుతోన్న మంచి మంచి చీరలను బ్యాంక్‌కు తెచ్చి ఇచ్చేవారు. ఇలా అందరూ ఇచ్చిన చీరలేగాకుండా సోషల్ మీడియాలో శారీ బ్యాంక్ గురించి ప్రచారం కల్పించి ఇతర నగరాల నుంచి కూడా చీరలను సేకరించి పేదవారికి ఇస్తోంది. నిజంగా ప్రతి మహిళా ఇలా ఆలోచిస్తే, అటు పర్యావరణానికి హానీ కలగదు. అటు నిరుపేదలను ఆదుకున్న వారూ అవుతారు. -
అందుకో ‘నేస్తం’ ఆత్మగౌరవంతో
ఇది ఎన్నికల వాగ్దానం కాదు... మేనిఫెస్టోలోనూ చెప్పలేదు. అయినప్పటికీ ఈబీసీ అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. పేదలు వారిలో కూడా ఉన్నారు. పేదవాడు ఎక్కడున్నా పేదవాడే. వారికి మేలు జరగాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నాం. ఆర్ధిక, రాజకీయ, విద్యా సాధికారతకు మద్దతు పలుకుతూ ఒక అన్నగా, తమ్ముడిగా మంచి చేయాలనే ఈ బాధ్యత తీసుకుంటున్నా. గొప్పవాళ్ల జీవిత చరిత్రలు మాత్రమే గొప్పవి కావు. ప్రతి అక్కచెల్లెమ్మ జీవిత చరిత్ర కూడా గొప్పదే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: అగ్రవర్ణ పేద మహిళల ఆర్థిక సాధికారిత, ఆత్మగౌరవం ఇనుమడించేలా ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమం‘త్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల వేళ హామీ ఇవ్వకపోయినా, పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపరచనప్పటికీ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రతి అక్కచెల్లెమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, వారి మోములో సంతోషం వెల్లివిరిస్తేనే ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తితో రెండున్నరేళ్లుగా ప్రతి అడుగు ముందుకేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి 3,92,674 మంది అర్హులైన అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా జమ చేశారు. వివిధ జిల్లాల్లో లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలివీ.. రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన రాజ్యాంగ నిర్మాతలకు నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నాం. అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. దాదాపు 3.93 లక్షల మంది మహిళలకు రూ.589 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర సామాజిక వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తున్నాం. ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు అందచేస్తాం. మహిళల ఆర్ధిక సాధికారిత, ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుందనే సంకల్పంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. వైఎస్సార్ చేయూత ద్వారా.. ఇప్పటికే వైఎస్సార్ చేయూత ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 25 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందచేస్తున్నాం. అమూల్, రిలయన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, అల్లానా, మహీంద్రా, యూనిలీవర్ లాంటి ప్రఖ్యాత కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానించి వారికి అండగా నిలిచాం. వైఎస్సార్ కాపు నేస్తం వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, ఒంటరి మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తూ 3.27 లక్షల మంది ఆర్ధిక స్వావలంబనకు తోడుగా నిలిచిన ప్రభుత్వం కూడా ఇదే. 60 ఏళ్లు పైబడిన వారికి వైఎస్సార్ పెన్షన్ కానుక అమల్లో ఉంది. దీనివల్ల ప్రతి నెలా రూ.2,500 చొప్పున ఏటా రూ.30 వేలు అందుతాయి. జగనన్న కాలనీలు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. తద్వారా ఆయా కుటుంబాల్లో 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి మేలు జరుగుతోంది. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలైంది. ఈ ఇళ్లన్నీ పూర్తయితే 32 లక్షల కుటుంబాల్లో వెలుగులు వస్తాయి. మొత్తం రూ.2 లక్షల కోట్ల పైచిలుకు ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్లవుతుంది. పొదుపు మహిళలకు సున్నా వడ్డీ పొదుపు సంఘాల మహిళలకు సున్నావడ్డీ అమలు చేస్తున్నాం. దీనికోసం రూ.2,354 కోట్లు అందచేసి వారికి తోడుగా నిలిచాం. విద్యా, వసతి దీవెన జగనన్న విద్యాదీవెన ద్వారా పిల్లల చదువుల ఫీజులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 18.81లక్షల మంది తల్లులకు ఈ రెండేళ్లలో రూ.6,258 కోట్లు అందించాం. జగనన్న వసతి దీవెన ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.20 వేలు, పాలిటెక్నిక్‌కు రూ.15 వేలు, ఐటీఐకి రూ.10 వేలు, డిగ్రీ చదివే వారికి రూ.20 వేలు చొప్పున రెండేళ్లలో రూ.2,267 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకే అందచేశాం. ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన అనంతరం తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ సంపూర్ణ పోషణ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 34.20 లక్షల మందికిపైగా బాలింతలు, గర్భిణిలు, 6 నుంచి 72 నెలలున్న చిన్నారులకు ప్రయోజనం చేకూరుతోంది. గతంలో రూ.600 కోట్లు ఇస్తే గొప్ప అనే పరిస్థితుల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లుల ఆరోగ్యాలను మనసులో పెట్టుకుని ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 77 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మరింత మేలు జరగాలని గిరిజన మహిళలకు సంపూర్ణ పోషణ ప్లస్ తీసుకొచ్చాం. రాజకీయ సాధికారిత రాజకీయంగా మహిళా సాధికారితకు కూడా అత్యంత ప్రాధాన్యం కల్పించాం. శాసన మండలి తొలి మహిళా వైస్ ఛైర్మన్‌గా సోదరి జకియా ఖానమ్, తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా పాముల పుష్ప శ్రీవాణి, మహిళా హోంమంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా సీఎస్‌గా నీలం సాహ్ని విధులు నిర్వహించారు. ఇప్పుడు ఆమె రాష్ట్ర తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇవన్నీ మన ప్రభుత్వంలో వేసిన ముందడుగులు. నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 51 శాతం ఇచ్చేందుకు ఏకంగా చట్టమే తీసుకొచ్చాం. మొత్తం నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు 202 కాగా 102 మహిళలకే ఇచ్చాం. 1,154 డైరెక్టర్ పదవులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వగా అక్కచెల్లెమ్మలకు 586 కేటాయించాం. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు కలిపి 1,356 పదవుల్లో 688 అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పాలక సంస్ధలకు సంబంధించి చైర్మన్, మేయర్ల పదవుల్లో సగానికి పైగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. మనం చేసిన చట్టం ప్రకారం 42 పదవులే ఇవ్వాల్సినా అంతకంటే ఎక్కువగా 52 చైర్మన్ల పదవులు వారికిచ్చాం. 60.47 శాతం మంది అక్కచెల్లెమ్మలే మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, నగర పంచాయతీల్లో ఉన్నారు. 202 వ్యవసాయ మార్కెట్ కమిటీ ౖచైర్మన్ పదవుల్లో 101 మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే విప్లవాత్మకంగా 13 జెడ్పీ చైర్మన్లకుగానూ ఏడుగురు అక్కచెల్లెమ్మలే ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవులకు సంబంధించి 26 పోస్టుల్లో 15 మంది మహిళలే ఉన్నారు. మహిళల రక్షణకు ‘దిశ’ దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గ్రామ స్ధాయిలోనే మహిళా పోలీసులు.. ఇలా మహిళల రక్షణలో మన రాష్ట్రం దేశంలోనే మిన్నగా ఉంది. ఈరోజు 1,01,19,642 మంది ఫోన్లలో దిశ యాప్ ఉంది. అక్కచెల్లెమ్మలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ కదిపితే చాలు నిమిషాల్లో పోలీసులు చేరుకుని తోడుగా నిలుస్తారు. అలాంటి గొప్ప వ్యవస్ధను రాష్ట్రంలో తెచ్చాం. గతంలో బెల్ట్ షాపులు గుడి పక్కన, బడి పక్కన కనిపించేవి. ఇవాళ అవి ఎక్కడా లేకుండా కట్టడి చేశాం. ఇదంతా మనసు పెట్టి చేశాం. ప్రతి అక్క, చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా ఆరాటపడుతూ చేశాం. అమ్మ ఒడితో తల్లులకు రూ.13,023 కోట్లు రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మకు మేలు చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షల మంది తల్లులు, 85 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తూ ఏటా రూ.6,500 కోట్లు అందిస్తున్నాం. ఇలా రెండేళ్లలో రెండు దఫాలుగా ఇప్పటికే రూ.13,023 కోట్లు అందజేశాం. వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 61.73 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా వారిలో 36.70 లక్షల మంది అవ్వలు, అక్కలకు మంచి జరిగేలా ప్రతినెలా రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30 వేలు ఇస్తూ తోడుగా నిలబడగలిగాం. గత సర్కారు డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను మోసగించగా, ఇప్పుడు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.25,517 కోట్లను నాలుగు దఫాలుగా అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758 కోట్లు నేరుగా అందించాం. ఫలితంగా నిరర్థక ఆస్తులు, అవుట్ స్టాండింగ్ ఖాతాలు 0.73 శాతానికి తగ్గిపోయాయి. -
వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అగ్రవర్ణాల్లోని పేద మహిళలకూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పకపోయినప్పటికీ ఈ పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి మొత్తం 3,92,674 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.589 కోట్లను వారి ఖాతాల్లో ఆయన జమచేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో అక్కచెల్లెమ్మకు ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఆర్థికసాయం అందనుంది. మహిళా సంక్షేమంలో మరో ముందడుగు ఇప్పటికే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం.. అక్కచెల్లెమ్మల పేరిట ఉచిత ఇళ్ల పట్టాలు, ఇళ్లు.. మొదలైన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారి కాళ్ల మీద వారిని నిలబెడుతూ చరిత్ర సృష్టించిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు మహిళా సంక్షేమంలో మరో అడుగు ముందుకు వేస్తోంది. మేనిఫెస్టోలో చెప్పకపోయినా రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజికవర్గాల్లోని (ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలు) పేద మహిళలకు కూడా మేలుచేయాలన్న సత్సంకల్పంతో వారికి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు రూపొందించిన కానుకే ఈ ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’. అన్ని దశల్లోనూ మహిళలకు తోడుగా.. అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఉదా.. ► గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. ► నాడు–నేడు ద్వారా కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, స్కూల్స్‌లో ఫర్నిచర్, తాగునీరు, ప్రహారీ గోడలు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు తదితర సదుపాయాలతో వాటి రూపురేఖలు మారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం సైతం ప్రవేశపెట్టింది. ► స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ను పంపిణీ చేస్తోంది. ► మహిళల భద్రత కోసం అభయం, దిశ యాప్‌లు తీసుకొచ్చింది. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించింది. ► అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారి పేరు మీదే ఇళ్ల పట్టాలు మంజూరు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తోంది. ► 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు పిల్లలను బడికి పంపే పేద తల్లులకు అమ్మఒడి ద్వారా ఏటా రూ.15,000ల ఆర్థిక సాయం అందిస్తోంది. ► మాఫీ చేస్తానని చెప్పి గత ప్రభుత్వం ఎగ్గొట్టిన పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మలను అప్పుల ఊబి నుంచి ఆదుకుంటోంది. ఇందులో భాగంగా.. దాదాపు రూ.25 వేల కోట్ల రుణ బకాయిలను వైఎస్ జగన్ ప్రభుత్వమే నాలుగేళ్లపాటు చెల్లించేందుకు సంకల్పించింది. వారి ఆర్థికాభివృద్ది, సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ ఆసరా.. వారి రుణాలపై వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది. ► అంతేకాక.. 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లపాటు అందించడమే కాక, వారికి జీవనోపాధి అవకాశాలూ కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా వైఎస్సార్ చేయూత ద్వారా తోడ్పాటు అందిస్తోంది. ► కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ కాపునేస్తం ద్వారా ఏటా రూ.15,000లు ఆర్థిక సాయం అందిస్తోంది. ► 60 ఏళ్లు పైబడిన అవ్వలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వైఎస్సార్ పెన్షన్ కానుక ఇస్తోంది. ► నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. ► కేబినెట్లో మహిళలకు కీలక శాఖల అప్పగించింది. ఒకరికి ఉప ముఖ్యమంత్రి, మరో మహిళకు హోంమంత్రిగా అవకాశం కల్పించింది. ► స్థానిక సంస్థల పదవుల్లో మహిళలకు ప్రాధాన్యతనిచ్చింది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వారికి 61 శాతం పదవులు కట్టబెట్టింది. ► ఇవికాక.. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ఆర్థిక సాయం తల్లుల ఖాతాల్లో జమచేయడం ద్వారా వారి బిడ్డల ఉజ్వల భవితకు జగన్ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ► బెల్టుషాపుల రద్దు ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో సుఖశాంతులు తీసుకొచ్చింది. ► ఇప్పుడు చెప్పకపోయినా, మేనిఫెస్టోలో పెట్టకపోయినా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15,000 ఇవ్వాలన్న నిర్ణయంతో రాష్ట్రంలో 45 నుండి 60 ఏళ్ల వయస్సు ఉన్న అగ్రవర్ణాల్లోని పేద అక్కచెల్లెమ్మలందరికీ లబ్ధిచేకూరుతుంది. ► ఇక 60 ఏళ్లు పైబడ్డ మహిళలకూ వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా పెంచి ఇస్తున్న పెన్షన్‌తో నెలకు రూ. 2,500 చొప్పున ఏటా రూ.30వేల లబ్ధి చేకూరుస్తోంది వైఎస్ జగన్ సర్కారు. వీరితోపాటు వితంతువులు, ఒంటరి మహిళలూ లబ్ధిపొందుతున్నారు. -
మాకు గూడు లేదు.. ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వండి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలమైన తమకు ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ఎటువంటి తప్పులేదని గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరికి చెందిన మహిళలు హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో ఇంటి స్థలాల పట్టాల మంజూరు విషయంలో ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని అభ్యర్థిస్తూ దాదాపు 450 మంది మహిళలు హైకోర్టులో మంగళవారం వేర్వేరుగా రెండు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేయతలపెట్టిన పేదలందరికీ ఇళ్లు పథకం వల్ల తమలాంటి లక్షల మంది నిరుపేదలు లబ్ధి పొందుతారని వారు పిటిషన్లలో పేర్కొన్నారు. తమకెవ్వరికీ శాశ్వత నివాసాలు లేవని వివరించారు. చట్ట నిబంధనలను అనుసరించే జీవో సీఆర్డీఏ చట్ట నిబంధనలను అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాల పట్టాల మంజూరు నిమిత్తం గత నెల 25న జీవో 107 జారీ చేసిందని మహిళలు కోర్టు దృష్టికి తెచ్చారు. నిడమర్రు గ్రామంలో 250.48 ఎకరాల్లో ఇంటి స్థలాల పట్టాల మంజూరు కోసం 10,247 మంది అర్హులైన లబ్ధిదారులతో అధికారులు ఓ జాబితా కూడా సిద్ధం చేశారని పేర్కొన్నారు. అలాగే తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో 11,300 మంది అర్హుల జాబితాను సిద్ధం చేశారన్నారు. వీరికి నవులూరులో 215 ఎకరాల్లో, కృష్ణాయపాలెంలో 37 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారని తెలిపారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం.. రాజధాని ప్రాంతం మొత్తం ఏరియాలో 5 శాతం భూమిని పేదల కోసం కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వారు వివరించారు. అది కూడా రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా కేటాయించవచ్చునని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, అందువల్ల తమ వాదనలు కూడా విని.. ఆ తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. లేని పక్షంలో తమకు తీరని నష్టం జరుగుతుందన్నారు. -
అరబ్‌షేక్‌కు గృహిణిని విక్రయించిన దళారీ
చాంద్రాయణగుట్ట: అరబ్ షేక్‌ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దళారీలను అడ్డుపెట్టుకుని పేద మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంబర్‌పేటకు చెందిన వివాహిత ఫాతిమా ఉన్నీసాకు బార్కాస్ కొత్తపేట నబీల్ కాలనీలో ఇల్లు ఉంది. ఆర్థిక అవసరాల నిమిత్తం ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్న ఫాతిమా ఉన్నీసా దళారీ మహ్మద్ సాబెర్ అలియాస్ వోల్టా సాబెర్‌ను చెప్పింది. ఇల్లు కొనేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని సాబెర్ ఫిబ్రవరి 25న ఫాతిమాకు ఫోన్ చేశాడు. ఇల్లు చూపించేందుకని ఆమె తన చెల్లెలు వివాహిత రఫత్ ఉన్నీసా(25)తో కలిసి వెళ్లింది. అక్కడికి వెళ్లగానే ముందస్తు పథకంలో భాగంగా అక్కడకు వచ్చిన అరబ్ షేక్ ఇబ్రహీం షుక్రుల్లా (60) ఫాతిమాను పెళ్లి చేసుకుంటా నని అడిగాడు. దానికామె అంగీకరించకపోవటంతో ఆమె చెల్లి రఫత్‌ను కూడా అడిగాడు. ఆమె కూడా తిరస్కరించి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. సాబె ర్ అనే దళారి రంగంలోకి దిగి, రఫత్‌ను విక్రయిస్తామని షేక్ దగ్గరనుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంతో సాబెర్ తన భార్య సమీనా ద్వారా రఫత్‌ను తన ఇంటికి వచ్చేలా ఒప్పించాడు. ఆమె రాగానే, నేరుగా షేక్ వద్దకు తీసుకెళ్లి ఇంట్లోకి నెట్టి బయటికి వచ్చేశారు. అప్పట్నుంచి ఆ షేక్ ఆమె పట్ల క్రూరంగా లైంగిక దాడికి దిగాడు. సిగరెట్లతో కాల్చుతూ చిత్ర హింసలకు గురి చేశాడు. తన చెల్లెలు జాడ కోసం ఫాతిమా దళారీ సాబెర్‌ను గట్టిగా అడగడంతో అసలు విషయం వెల్లడించాడు. ఆ చిరునామాకు వెళ్లేసరికి షేక్ తన పాస్‌పోర్టును వదిలి పారిపోయాడు. ఫాతిమా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాటం
పట్టణంలో పెరిగి పెళ్లి చేసుకుని పల్లెటూరికి వచ్చిన ఓ అమ్మాయి.. భర్తతో పోట్లాడి, అత్తింటి వారిని ఒప్పించి ఇంట్లో టాయిలెట్ కట్టిన ఉదంతాలు నాలుగేళ్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. అత్తింటితోపాటు ఊరిని చైతన్యవంతం చేసిన యువతుల ధీరత్వాన్ని దేశం అభినందిస్తూనే ఉంది. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరోవైపున ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, సంజామల మండలంలోని ఆకుమళ్ల గ్రామం. పాలనా యంత్రాంగం మొద్దునిద్రకు ఒక నిదర్శనం ఆ గ్రామంలోని ఈ ఉదంతం. ఆకుమళ్ల గ్రామంలో మునీరా, షాహీనా అనే తోడి కోడళ్లిద్దరు నాలుగున్నరేళ్లుగా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు. వాళ్ల పోరాటం స్వచ్ఛ్భారత్ పోరాటం. ఒకవైపు అధికారంతో బరువెక్కిన ప్రభుత్వపాలనా యంత్రాంగం, మరో వైపు ఇద్దరు పేద మహిళలు. తక్కెడకు న్యాయం చెప్పాలనే ఉంటుంది. న్యాయబద్ధంగా మహిళల వైపు మొగ్గాలనే ఉంటుంది. అయితే అధికార బరువు తక్కెడను శాసిస్తోందిక్కడ.మొదట మునీరా ప్రయత్నించింది. ఆ తర్వాత తోడికోడలు షాహీనా కూడా ఆమెకు తోడయింది. ఆ తోడికోడళ్లిద్దరూ నాలుగన్నరేళ్లుగా గ్రామకమిటీ ముందుకొచ్చి అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా సరే... మునీరా, షాహీనాలు ఇప్పటికీ ఊరు నిద్రలేవక ముందే చీకట్లో అరకిలోమీటరు దూరాన ఉన్న తుప్పల్లోకి వెళ్లి రావాలి, లేకపోతే చీకటి పడిన తర్వాత వెళ్లాలి. ‘ఇండివిడ్యువల్ సానిటరీ లెట్రిన్’ల కోసం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం నడుస్తున్నా వీళ్ల ఇంటిని అందులో భాగం చేయడానికి ముందుకు రావడంలేదు పాలనా పగ్గాలను చేతిలో పెట్టుకున్న గ్రామ కమిటీ. ప్రభుత్వానికి పట్టలేదు ‘‘మా పుట్టిల్లు చాగలమర్రి మండల కేంద్రం. మా ఇంట్లో టాయిలెట్ ఉంది. పెళ్లయిన తర్వాత అత్తగారింటికి ఆకుమళ్లకు వచ్చాను. అప్పటి నుంచి నా భర్తతో, అత్తతో చెప్తూనే ఉన్నాను. వాళ్లు అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ పథకంలో సబ్సిడీ వస్తుంది, కట్టుకుందాం అని చెప్తూ వచ్చారు. ఇంతలో మా మరిదికి పెళ్లయింది. తోడికోడలు షాహీనాది కడప. ఆమె పుట్టింట్లోనూ టాయిలెట్ ఉంది. తను కూడా ఇక్కడి పరిస్థితికి అలవాటు పడటానికి చాలా ఇబ్బంది పడింది. ఇద్దరమూ గ్రామదర్శిని, గ్రామవికాస్, జన్మభూమి సమావేశాలకు వెళ్లి అర్జీలిస్తూనే ఉన్నాం. మా గోడు పట్టించుకున్న వాళ్లే లేరు’’ అంది మునీరా. చంటి బిడ్డ లేచే లోపే ‘‘నాకు 2013 ఫిబ్రవరిలో పెళ్లయింది. ఇక్కడ ఇలా ఉంటుందని పెళ్లి చేసుకుని వచ్చే వరకు తెలియదు. బయటకు వెళ్లడానికి ఎంత బిడియంగా ఉండేదో చెప్పలేను. ఇంటి నుంచి అరకిలోమీటరు దూరం వెళ్లడం మామూలు రోజుల్లో ఎలాగో గడిచిపోయేది. కానీ గర్భిణిగా ఉన్నప్పుడు నరకం చూశాను. వేవిళ్ల సమయంలో అయితే దారిలోనే కళ్లు తిరిగి పడిపోతాననిపించేది. గర్భిణిగా ఉన్నప్పుడు ఒకసారి మందులు నా ఒంటికి పడక విరేచనాలయ్యాయి. ఇక్కడ ఉండలేక పుట్టింటికి వెళ్లిపోవాలనిపించింది. అట్లాగే ఇద్దరు పిల్లలు పుట్టారు. పాపకు మూడో నెల. ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ (ట్యూబెక్టమీ) చేయించుకున్నాను. ఈమధ్యే అత్తగారింటికి వచ్చాను. చంటిబిడ్డకు పాలిచ్చి నిద్రపుచ్చి, తను నిద్రలేచేలోపు వెళ్లి రావాలి. పచ్చి ఒంటితో అంతదూరం నడిచి వెళ్లాలని గుర్తుకు వస్తేనే భయమేస్తోంది’’ అని చెప్తున్నప్పుడు షాహీనా కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. పుట్టెడు పేదరికం వృద్ధ దంపతులు, వాళ్ల కొడుకులిద్దరు, ఇద్దరు కోడళ్లు, నలుగురు చిన్న పిల్లలు మొత్తం పదిమంది ఉన్నారా ఇంట్లో. అందరికీ ఆధార్ కార్డులున్నాయి. ఓటర్ కార్డులున్నాయి. రేషన్ కార్డులో పేర్లూ ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటినీ మించిన పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా ఇంట్లో. అయినా కనీస అవసరాలకు ప్రభుత్వం స్నేహ హస్తం ఇవ్వడం లేదా ఇంటికి. వాళ్ల అవసరాన్ని తీర్చడానికి స్వచ్ఛ్భారత్ అనే జాతీయ స్థాయి పథకం ఉంది. ఆ పథకానికి పుష్కలంగా నిధులున్నాయి. అయినా సరే... విదిలించడానికి చెయ్యి రాని పాలకులుంటే మునీరాలు, షాహీనాలకు పోరాటం తప్పదు. ‘మా పోరాటానికి మద్దతివ్వండి ప్లీజ్’ అని వీళ్లిద్దరూ ధైర్యంగా ముందుకు వచ్చారు. ‘ఆ అవసరాన్ని మంది ముందు చెప్పుకునేదెలా’ అని బిడియపడుతూ వీరిలా కుమిలిపోతున్న యువతులెందరున్నారో? పదిమందికి ఒకటే గూడు ‘‘చిన్న ఇంట్లో పదిమందిమి బతుకుతున్నాం. మా అత్తమామలు ముసలివాళ్లు. చలికాలం బయట పడుకుంటే వాళ్ల ఆరోగ్యం బాగుండదు. వాళ్లను లోపల పడుకోమంటే ‘వయసులో ఉన్న ఆడపిల్లలు మీరు బయటపడుకోకూడదు’ అని మా అత్తమామలు మమ్మల్ని గదిలో పడుకోమని వాళ్లు బయటపడుకునేవాళ్లు. ఇల్లు శాంక్షన్ చేస్తే మా మరిది వాళ్లు కట్టుకుంటారని కూడా ఎన్నిసార్లో అడిగాం. ఇల్లు ఇవ్వకపోతే పోయారు. కనీసం మరుగుదొడ్డి కూడా ఇవ్వలేదు’’ కలెక్టర్ చెప్పినా పని కాలేదు మాకు ఒక్క టాయిలెట్ శాంక్షన్ చేయండి కట్టుకుంటాం.. అని నాలుగున్నరేళ్లుగా గ్రామస్థాయి అధికారులు, నాయకుల నుంచి ఎంఆర్వో, ఎండీవో... అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాం. నాలుగు నెలల కిందట అనుకుంటాను... బనగానపల్లికి కలెక్టర్ వచ్చారు. అప్పుడు ఆ సభకు వెళ్లి మా గోడు వెళ్లబోసుకున్నాం. అప్పుడు నేను నిండు గర్భిణిని. నా కన్నీళ్లు చూసి కలెక్టర్ కదిలిపోయారు. నాకు ధైర్యం చెప్పి, ‘ఇలా ఎందుకు జరిగిందని’ అధికారులను మందలించారు. వెంటనే శాంక్షన్ చేయించి కట్టించమని ఆదేశించారు కూడా. ఆ తర్వాత మా బావగారు ఎన్నోసార్లు ఎంపీడీవో ఆఫీస్‌కెళ్లి కలెక్టర్ గారి ఆదేశాన్ని గుర్తు చేసి మరుగుదొడ్డి శాంక్షన్ చేయమని బతిమిలాడారు. ‘మీరు శాంక్షన్ చేసిన వెంటనే కట్టుకుంటాం, ఆపరేషన్ చేయించుకున్న అమ్మాయి పుట్టింటి నుంచి వచ్చేలోపు మరుగుదొడ్డి కట్టుకునే ఏర్పాటు చేయండి’ అని వాళ్లను ప్రాధేయపడ్డారాయన. అయినా కూడా శాంక్షన్ చేయలేదు. -
పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్
* రూ.8వేల కోట్లతో ఉజ్వల యోజన * మూడేళ్లలో 5 కోట్ల మందికి లబ్ధి * కేబినెట్ పచ్చజెండా న్యూఢిల్లీ: నిరుపేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్లను అందించేందుకు ఉద్దేశించిన రూ.8 వేల కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈమేరకు ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’కు పచ్చజెండా ఊపిందని ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ మీడియాకు చెప్పారు. ఈ నిధులను మూడేళ్లలో వినియోగిస్తామన్నారు. దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న మహిళలకు యుద్ధప్రాతిపదికన గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయడం దీని ఉద్దేశం. ఒక్కో కనెక్షన్‌కు రూ. 1,600 ఆర్థిక సాయం లభిస్తుంది. దీనిపై 2016-17 బడ్జెట్లో జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 1.5 కోట్ల మందికి, మూడేళ్లలో మొత్తం 5 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు గ్యాస్కనెక్షన్లు ఇస్తామన్నారు. * బంగాళా ఖాతం తీర దేశాలైన బిమ్స్టెక్ (బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్)లో నేరపరమైన అంశా ల్లో న్యాయ సహాయం ఇచ్చిపుచ్చుకునే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. * బహుళ పోషక ఫెర్టిలైజర్ అయిన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉత్పాదకతను ప్రోత్సహించేం దుకు ప్రస్తుతమున్న కనీస సామర్థ్య వినియోగం నిబంధనను కేబినెట్ ఎత్తివేసింది. దీంతో ఎస్ఎస్పీని ఉత్పత్తి చేసే చిన్న కంపెనీలూ సబ్సిడీని పొందేందుకు వీలవుతుంది. గతంలో గుర్తించిన ఉత్పత్తి సామర్థ్యంలో కనీసం 50 శాతం ఉత్పత్తి చేసే కంపెనీలకే రాయితీ పొందే అర్హత ఉండేది. దీంతోచిన్న కంపెనీలకు కష్టంగా ఉండేది. చౌక రసాయన ఎరువుల్లో ఒకటైన ఎస్ఎస్పీ.. పప్పుధాన్యాలు, ఆయిల్ సీడ్స్, కూరగాయలు, చెరకు వంటి పంటలకు అనువుగా ఉంటుంది. -
పేద మహిళల పెన్నిధిగా ‘స్త్రీ నిధి’
స్త్రీనిధి బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ * సంఘటితంగా ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టించొచ్చు * వడ్డీలేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు సాక్షి, హైదరాబాద్: పేద మహిళల కోసం ఏర్పాటైన స్త్రీనిధి బ్యాంక్ మహిళల సార థ్యంలోనే సాగుతూ నాలుగేళ్లుగా అద్భుత ప్రగతిని సాధిస్తోందని, స్వయం సహాయక గ్రూపుల ద్వారా సత్వర రుణాలను అందిస్తూ పేద మహిళల పాలిట పెన్నిధిగా మారిందని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మహిళలు సంఘటితంగా ఉంటే అద్భుతాలు సృష్టించగలరనేందుకు స్త్రీనిధి బ్యాంక్ సాధించిన ప్రగతే నిదర్శనమన్నారు. ‘తెలంగాణ స్త్రీ నిధి బ్యాంక్’ తొలి వార్షిక సర్వసభ్య సమావేశం బుధవారం జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్.. రాష్ట్రంలో 470 మండల సమాఖ్యలు, 20 వేల గ్రామ సమాఖ్యలు, 4.20 లక్షల స్వయం సహాయక గ్రూపుల ద్వారా 60 లక్షల మంది పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్న స్త్రీనిధి బ్యాంక్ యాజమాన్యాన్ని అభినందించారు. రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు.. రాష్ట్రవ్యాప్తంగా బాగా పనిచేస్తున్న స్వయం సహాయక గ్రూపులకు వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుందని, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరికీ సురక్ష బీమా యోజన ద్వారా ప్రమాదబీమా సదుపాయాన్ని త్వరలోనే కల్పించబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు. పేద మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న స్త్రీనిధి బ్యాంక్‌కు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా దళారులను నియంత్రించేందుకు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మహిళలకు రూ.1,005 కోట్లతో 25 వేల ఉత్పత్తి(పాడి పరిశ్రమ, మేకల, గొర్రెల పెంపకం తదితర) యూనిట్లను అందిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల భాగస్వామ్యం, యాజమాన్యంలోనే నడుస్తున్న స్త్రీనిధి బ్యాంక్ గతేడాది 68 శాతం వృద్ధిరేటు సాధించిందని బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. బ్యాంకులు అందుబాటులో లేని గ్రామాల్లో గ్రామ సమాఖ్యల ద్వారా బ్యాంకింగ్ సేవలను స్త్రీనిధి బ్యాంక్ అందిస్తోందన్నారు. ప్రతిన బూనిన సంఘాలు ‘‘ప్రభుత్వంతో కలసి స్థాపించిన స్త్రీనిధి బ్యాంకు చక్కగా పనిచేసేందుకు, సంస్థ నుంచి సభ్యుల జీవనోపాధులకు, ఇతర అవసరాల నిమిత్తం సత్వర అప్పు ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాం. అందరి భాగస్వామ్యంతో స్త్రీనిధి బ్యాంకును మరింత పటిష్టం చేసి నిరుపేద మహిళలకు పెన్నిధిగా తయారు చేస్తాం’’ అని సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు కేటీఆర్ బహుమతులు అందించారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం కింద వచ్చిన డివిడెండ్ రూ.2,60,58,000 చెక్కును స్త్రీనిధి బ్యాంకు డెరైక్టర్లు మంత్రికి అందజేశారు. బ్యాంకు అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదించిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిం చారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో మురళి, స్త్రీనిధి బ్యాంకు అధ్యక్షురాలు గడ్డం సరోజ, కోశాధికారి బత్తిని స్వరూప, నాబార్డు మాజీ సీజీఎం మోహనయ్య, పలువురు డెరైక్టర్లు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా సమాఖ్యలు, మండల సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మహిళలకేదీ ‘అభయం’
అనంతపురం సెంట్రల్ : నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అభయహస్తం పథకాన్ని నీరుగారుస్తున్నారు. పొమ్మనలేక పొగ పెట్టినట్లు ఈ పథకాన్ని నిబంధనల సుడిగుండంలోకి నెట్టారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం పథకం మూలాలపైనే దెబ్బ కొట్టింది. ఫలితంగా ఒకే ఏడాది 34874 మంది అభయహస్తం లబ్ధిదారులు పథకం నుంచి వైదొలగడం గమనార్హం. వివరాల్లోకి వెలితే... 2009లో ఈ పథకాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అప్పట్లో ఇది నిరుపేద మహిళల జీవితాల్లో వెలుగు నింపింది. మహానేత మరణం ఈ పథకానికి శాపంగా మారింది. క్రమేణా పథకం అమలుపై నీలినీ డలు కమ్ముకుంటూ వస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలు అభయహస్తం పథకంలోకి చేరేందుకు అర్హులు. ముఖ్యంగా అత్యంత పేదలు(పీఓపీ), ఎస్సీ, ఎస్టీ, మత్యుకారులు, చేనేత కార్మికులు, వితంతువులు, అంగవైకల్యం ఉన్న వారికి అవకాశం కల్పించారు. రూ.365 ప్రీమియం, రూ.20 సేవా రుసుముతో కలిపి మొత్తం రూ.385 చెల్లించి అభయహస్తం పథకంలోకి సభ్యురాలిగా చేరితే ఆ మొత్తానికి ప్రభుత్వం మరో రూ.365 కలిపి బీమా సౌకర్యం కల్పిస్తుంది. పథకం లబ్దిదారురాలి చదుకునే పిల్లలు ఉంటేతొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకార వేతనం మం జూరవుతుంది. 60 ఏళ్లు దాటిన మహిళలకు నెలనెలా రూ.500 (అప్పటి వృద్దాప్య, వితంతు పింఛన్ రూ. 200లకు రూ. 300 అదనంగా చెల్లించి) చొప్పున పిం ఛను చెల్లిస్తారు. సహజ మరణం అయితే రూ.30 వే లు, ప్రమాదంలో మృతి చెందితే రూ.70వేలు బీమా సౌకర్యం ఉంటుంది. ఇవి కాక లబ్ధిదారురాలు మృతి చెందిన విషయాన్ని గంటలోపు 08554-278275 సెల్‌కు తెలియజేస్తే అదేరోజే రూ.5 వేలు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం అదనంగా చెల్లిస్తారు. ఇలాం టి మంచి పథకాన్ని నీరుగార్చే నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నా యి. రూ. 200 పింఛన్ వచ్చే రోజుల్లో రూ. 300లు అదనంగా కలుపుకొని మొత్తం రూ. 500 చొప్పున అ భయహస్తం పింఛన్‌దారులకు అందించేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరికీ రూ. 1000లు మంజూరు చేస్తోంది. అభయహస్తం ల బ్ధిదారులు ప్రీమియం చెల్లించినా అదనంగా ఒరిగే ప్ర యోజనమేమీ లేకపోవడంతో మహిళల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. జిల్లాలో 63 మండలాల్లో 1.90,004 మంది లబ్ధిదారులు ఉండగా 1,36,018 మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. మిగిలిన 34974 మంది రెన్యువల్ చేసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే మహిళలకు రక్షణ కల్పించే పథకాలపై పాలకులకు ఉన్న చిత్తశుద్ది ఏపాటితో అర్థమవుతోంది. -
మంత్రుల చేతికి ‘దీపం’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేద మహిళలకు ‘దీపం’ పథకం కింద ఇచ్చే వంటగ్యాస్ కనెక్షన్లలో మళ్లీ రాజకీయ జోక్యం పెరిగిపోనుంది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా జిల్లా ఇన్చార్జి మంత్రులకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జీవో విడుదల చేసింది. అయితే గతంలోనూ ఇదే తరహాలో ‘దీపం’ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఇన్చార్జి మంత్రుల ఆధీనంలో ఉండేది. కానీ పారదర్శకత లోపించిందనే ఆరోపణల కారణంగా గత ఫిబ్రవరిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా కలెక్టర్లకు అప్పగించింది. తాజాగా తిరిగి మంత్రులకే అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అప్పట్లో ఈ విధానాన్ని తప్పుబట్టిన నేతలే ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలుగా తిరిగి దానిని అమల్లోకి తెచ్చారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇన్చార్జి మంత్రి చేతిలో.. ‘దీపం’ కనెక్షన్ కోసం లబ్ధిదారుల గుర్తింపు జరిగాక జాబితాను ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, వార్డుల్లో ప్రదర్శించి, అభ్యంతరాలు స్వీకరిస్తారు. మూడు రోజుల తర్వాత గ్రామ, వార్డు సభల్లో జాబితాను చదువుతారు. ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడికక్కడే పరిష్కరించి సర్పంచ్ సంతకం తీసుకొని జాబితాను జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. అన ంతరం కలెక్టర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఇందుకోసం ప్రతిపాదిత మహిళ గతంలో వంటగ్యాస్ కనెక్షన్ కలిగిలేరని, సిలిండర్, రెగ్యులేటర్ కొనే పరిస్థితిలో లేరని, ఈ గ్యాస్ కనెక్షన్‌ను గృహ అవసరాలకు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉందనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు తుది ఎంపిక అధికారం పూర్తిగా కలెక్టర్లకే ఉండేది. కానీ ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక తుది బాధ్యతను జిల్లా ఇన్చార్జి మంత్రికి కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల తుది ఎంపిక జాబితాకు ఇన్చార్జి మంత్రి ఆమోదం తెలపాలి. ఆయన సూచనల మేరకు మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఆ తర్వాతే కలెక్టర్లు జాబితాను సంబంధిత కంపెనీలకు పంపాలి. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఈ సవరణలు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. తమవారికి ‘దీపం’ కనెక్షన్లు ఇప్పించుకునేందుకే లబ్ధిదారుల తుది ఎంపిక బాధ్యతను మంత్రులకు కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఎంపిక ప్రక్రియ షురూ వంటగ్యాస్ కనెక్షన్ లేని స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి, వారికి ‘దీపం’ పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2014-15లో 5.95 లక్షల మందికి వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.96 కోట్లు కేటాయించగా, 2015-16లో మరో రూ.50 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.