పట్టణంలో పెరిగి పెళ్లి చేసుకుని పల్లెటూరికి వచ్చిన ఓ అమ్మాయి.. భర్తతో పోట్లాడి, అత్తింటి వారిని ఒప్పించి ఇంట్లో టాయిలెట్ కట్టిన ఉదంతాలు నాలుగేళ్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. అత్తింటితోపాటు ఊరిని చైతన్యవంతం చేసిన యువతుల ధీరత్వాన్ని దేశం అభినందిస్తూనే ఉంది. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరోవైపున ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, సంజామల మండలంలోని ఆకుమళ్ల గ్రామం. పాలనా యంత్రాంగం మొద్దునిద్రకు ఒక నిదర్శనం ఆ గ్రామంలోని ఈ ఉదంతం.
ఆకుమళ్ల గ్రామంలో మునీరా, షాహీనా అనే తోడి కోడళ్లిద్దరు నాలుగున్నరేళ్లుగా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు. వాళ్ల పోరాటం స్వచ్ఛ్‌భారత్ పోరాటం. ఒకవైపు అధికారంతో బరువెక్కిన ప్రభుత్వపాలనా యంత్రాంగం, మరో వైపు ఇద్దరు పేద మహిళలు. తక్కెడకు న్యాయం చెప్పాలనే ఉంటుంది. న్యాయబద్ధంగా మహిళల వైపు మొగ్గాలనే ఉంటుంది. అయితే అధికార బరువు తక్కెడను శాసిస్తోందిక్కడ.మొదట మునీరా ప్రయత్నించింది.
ఆ తర్వాత తోడికోడలు షాహీనా కూడా ఆమెకు తోడయింది. ఆ తోడికోడళ్లిద్దరూ నాలుగన్నరేళ్లుగా గ్రామకమిటీ ముందుకొచ్చి అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా సరే... మునీరా, షాహీనాలు ఇప్పటికీ ఊరు నిద్రలేవక ముందే చీకట్లో అరకిలోమీటరు దూరాన ఉన్న తుప్పల్లోకి వెళ్లి రావాలి, లేకపోతే చీకటి పడిన తర్వాత వెళ్లాలి. ‘ఇండివిడ్యువల్ సానిటరీ లెట్రిన్’ల కోసం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం నడుస్తున్నా వీళ్ల ఇంటిని అందులో భాగం చేయడానికి ముందుకు రావడంలేదు పాలనా పగ్గాలను చేతిలో పెట్టుకున్న గ్రామ కమిటీ.
ప్రభుత్వానికి పట్టలేదు
‘‘మా పుట్టిల్లు చాగలమర్రి మండల కేంద్రం. మా ఇంట్లో టాయిలెట్ ఉంది. పెళ్లయిన తర్వాత అత్తగారింటికి ఆకుమళ్లకు వచ్చాను. అప్పటి నుంచి నా భర్తతో, అత్తతో చెప్తూనే ఉన్నాను. వాళ్లు అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ పథకంలో సబ్సిడీ వస్తుంది, కట్టుకుందాం అని చెప్తూ వచ్చారు. ఇంతలో మా మరిదికి పెళ్లయింది. తోడికోడలు షాహీనాది కడప. ఆమె పుట్టింట్లోనూ టాయిలెట్ ఉంది. తను కూడా ఇక్కడి పరిస్థితికి అలవాటు పడటానికి చాలా ఇబ్బంది పడింది. ఇద్దరమూ గ్రామదర్శిని, గ్రామవికాస్, జన్మభూమి సమావేశాలకు వెళ్లి అర్జీలిస్తూనే ఉన్నాం. మా గోడు పట్టించుకున్న వాళ్లే లేరు’’ అంది మునీరా.
చంటి బిడ్డ లేచే లోపే
‘‘నాకు 2013 ఫిబ్రవరిలో పెళ్లయింది. ఇక్కడ ఇలా ఉంటుందని పెళ్లి చేసుకుని వచ్చే వరకు తెలియదు. బయటకు వెళ్లడానికి ఎంత బిడియంగా ఉండేదో చెప్పలేను. ఇంటి నుంచి అరకిలోమీటరు దూరం వెళ్లడం మామూలు రోజుల్లో ఎలాగో గడిచిపోయేది. కానీ గర్భిణిగా ఉన్నప్పుడు నరకం చూశాను. వేవిళ్ల సమయంలో అయితే దారిలోనే కళ్లు తిరిగి పడిపోతాననిపించేది. గర్భిణిగా ఉన్నప్పుడు ఒకసారి మందులు నా ఒంటికి పడక విరేచనాలయ్యాయి. ఇక్కడ ఉండలేక పుట్టింటికి వెళ్లిపోవాలనిపించింది. అట్లాగే ఇద్దరు పిల్లలు పుట్టారు. పాపకు మూడో నెల. ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ (ట్యూబెక్టమీ) చేయించుకున్నాను. ఈమధ్యే అత్తగారింటికి వచ్చాను. చంటిబిడ్డకు పాలిచ్చి నిద్రపుచ్చి, తను నిద్రలేచేలోపు వెళ్లి రావాలి. పచ్చి ఒంటితో అంతదూరం నడిచి వెళ్లాలని గుర్తుకు వస్తేనే భయమేస్తోంది’’ అని చెప్తున్నప్పుడు షాహీనా కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి.
పుట్టెడు పేదరికం
వృద్ధ దంపతులు, వాళ్ల కొడుకులిద్దరు, ఇద్దరు కోడళ్లు, నలుగురు చిన్న పిల్లలు మొత్తం పదిమంది ఉన్నారా ఇంట్లో. అందరికీ ఆధార్ కార్డులున్నాయి. ఓటర్ కార్డులున్నాయి. రేషన్ కార్డులో పేర్లూ ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటినీ మించిన పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా ఇంట్లో. అయినా కనీస అవసరాలకు ప్రభుత్వం స్నేహ హస్తం ఇవ్వడం లేదా ఇంటికి. వాళ్ల అవసరాన్ని తీర్చడానికి స్వచ్ఛ్‌భారత్ అనే జాతీయ స్థాయి పథకం ఉంది. ఆ పథకానికి పుష్కలంగా నిధులున్నాయి. అయినా సరే... విదిలించడానికి చెయ్యి రాని పాలకులుంటే మునీరాలు, షాహీనాలకు పోరాటం తప్పదు. ‘మా పోరాటానికి మద్దతివ్వండి ప్లీజ్’ అని వీళ్లిద్దరూ ధైర్యంగా ముందుకు వచ్చారు. ‘ఆ అవసరాన్ని మంది ముందు చెప్పుకునేదెలా’ అని బిడియపడుతూ వీరిలా కుమిలిపోతున్న యువతులెందరున్నారో?
పదిమందికి ఒకటే గూడు
‘‘చిన్న ఇంట్లో పదిమందిమి బతుకుతున్నాం. మా అత్తమామలు ముసలివాళ్లు. చలికాలం బయట పడుకుంటే వాళ్ల ఆరోగ్యం బాగుండదు. వాళ్లను లోపల పడుకోమంటే ‘వయసులో ఉన్న ఆడపిల్లలు మీరు బయటపడుకోకూడదు’ అని మా అత్తమామలు మమ్మల్ని గదిలో పడుకోమని వాళ్లు బయటపడుకునేవాళ్లు. ఇల్లు శాంక్షన్ చేస్తే మా మరిది వాళ్లు కట్టుకుంటారని కూడా ఎన్నిసార్లో అడిగాం. ఇల్లు ఇవ్వకపోతే పోయారు. కనీసం మరుగుదొడ్డి కూడా ఇవ్వలేదు’’
కలెక్టర్ చెప్పినా పని కాలేదు
మాకు ఒక్క టాయిలెట్ శాంక్షన్ చేయండి కట్టుకుంటాం.. అని నాలుగున్నరేళ్లుగా గ్రామస్థాయి అధికారులు, నాయకుల నుంచి ఎంఆర్‌వో, ఎండీవో... అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాం. నాలుగు నెలల కిందట అనుకుంటాను... బనగానపల్లికి కలెక్టర్ వచ్చారు. అప్పుడు ఆ సభకు వెళ్లి మా గోడు వెళ్లబోసుకున్నాం. అప్పుడు నేను నిండు గర్భిణిని. నా కన్నీళ్లు చూసి కలెక్టర్ కదిలిపోయారు. నాకు ధైర్యం చెప్పి, ‘ఇలా ఎందుకు జరిగిందని’ అధికారులను మందలించారు.
వెంటనే శాంక్షన్ చేయించి కట్టించమని ఆదేశించారు కూడా. ఆ తర్వాత మా బావగారు ఎన్నోసార్లు ఎంపీడీవో ఆఫీస్‌కెళ్లి కలెక్టర్ గారి ఆదేశాన్ని గుర్తు చేసి మరుగుదొడ్డి శాంక్షన్ చేయమని బతిమిలాడారు. ‘మీరు శాంక్షన్ చేసిన వెంటనే కట్టుకుంటాం, ఆపరేషన్ చేయించుకున్న అమ్మాయి పుట్టింటి నుంచి వచ్చేలోపు మరుగుదొడ్డి కట్టుకునే ఏర్పాటు చేయండి’ అని వాళ్లను ప్రాధేయపడ్డారాయన. అయినా కూడా శాంక్షన్ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment