చీరలు పంచుతున్న ఆర్తి శ్యామల్ జోషి
ఒకసారి కట్టిన చీరను మరోసారి కట్టుకోవడానికి ఇష్టపడరు చాలా మంది. దీంతో కొత్త చీరలు కొనే కొద్దీ పాత చీరలు కుప్పలు కుప్పలుగా బీరువాల్లో్ల మూలుగుతుంటాయి. వాటిని ఏళ్ల తరబడి కట్టకుండా అలాగే ఉంచెయ్యడం వల్ల ఎలుకలు కొట్టి కొన్ని, చెదలు పట్టి ఇంకొన్నీ చిరిగిపోవడం, అసలు కట్టకుండా మడతల్లోనే ఉండడం వల్ల చీకిపోయి మసి బట్టకు కూడా పనికి రాకుండా పోతాయి. ఇలా వృథాగా పోతున్న చీరలను నిరుపేదలకు అందించి ఉపయోగకరంగా మారుస్తోంది ఆర్తి శ్యామల్ జోషి.
ఔరంగాబాద్‌కు చెందిన డాక్టర్ ఆర్తి శ్యామల్ జోషి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తోంది. రోజూ కట్టుకునే చీరలు కాకుండా ఇంట్లో పాడైపోకుండా ఉన్న చీరలు చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుత ట్రెండ్‌కు అవి నప్పవని కట్టుకోకుండా నెలల తరబడి అలానే ఉంచేసింది. అవి చూసిన ప్రతిసారి వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తుండేది ఆర్తి. ఒకరోజు నిరుపేద మహిళలకు ఇవి ఇస్తే వారికి ఉపయోగపడతాయి కదా! అనిపించింది ఆర్తికి. అనుకున్న వెంటనే తన దగ్గర ఉన్న చీరలను పంచడం ప్రారంభించింది. చీరలు తీసుకున్న మహిళలు ఎంతో సంతోషంగా ఆమెకు కృతజ్ఞతలు చెప్పడంతో ఆర్తికి ప్రోత్సాహం లభించినట్లయింది. దీంతో ఇంట్లో తను కట్టని చీరలు మొత్తం పేదలకు ఇచ్చేసింది.
ఆర్తి పనిచేసే చోట చక్కగా ఉన్న కొన్ని బట్టలు, చీరలు చెత్త డబ్బాలో వేయడం గమనించింది. ఇవన్నీ వృథాగా పోతున్నాయి. వీటిని కట్టుకునే నిరుపేదలకు ఇస్తే వేస్ట్ కావు కదా... అనిపించింది. దీంతో 2016లో ఆస్థాజనవికాస్ అనే ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ‘శారీబ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఈ బ్యాంక్ ద్వారా ఆసక్తి ఉన్న మహిళల దగ్గర నుంచి చీరలు సేకరించి ఇప్పటి దాకా పాతికవేలకు పైగా చీరలను పంచిపెట్టింది. చీరలు పంచిపెట్టడం గురించి తెలిసి చాలామంది మహిళలు ఇంట్లో మూలుగుతోన్న మంచి మంచి చీరలను బ్యాంక్‌కు తెచ్చి ఇచ్చేవారు. ఇలా అందరూ ఇచ్చిన చీరలేగాకుండా సోషల్ మీడియాలో శారీ బ్యాంక్ గురించి ప్రచారం కల్పించి ఇతర నగరాల నుంచి కూడా చీరలను సేకరించి పేదవారికి ఇస్తోంది. నిజంగా ప్రతి మహిళా ఇలా ఆలోచిస్తే, అటు పర్యావరణానికి హానీ కలగదు. అటు నిరుపేదలను ఆదుకున్న వారూ అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment