అస్సాంలోని గౌహతికి చెందిన ఇతిషా సారా పుణెలోని ‘సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో చదువుకుంది. దిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీలో ‘సోషల్ డిజైన్’ కోర్సు చేసింది. ‘ఈ కోర్సు వల్ల తరగతి బయట అడుగు పెట్టడానికి, ప్రజలతో నేరుగా మాట్లాడడానికి, రోజువారీ సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడానికి నాకు అవకాశం వచ్చింది’... గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఇతిషా.
తన పరిశోధన అంశానికి ఈ–వ్యర్థాలను ఎంచుకుంది. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై పరిశోధనలు చేసిన వారు తక్కువ. ఈ–వ్యర్థాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు చదవడంతో పాటు దిల్లీ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రీసైకిలింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి పరిశీలించేది. ఈ క్షేత్రస్థాయి అధ్యయనంలో ఎన్నో విషయాల గురించి అవగాహన చేసుకుంది. ‘రీసైకిలింగ్’పై ఇతిషాకు ఉన్న అవగాహన సాంగ్టీని మార్చడానికి ఉపయోగపడింది.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని సాంగ్టీలో అద్దె ఇంట్లో ఉంటూ, హిమాలయ ప్రాంతాల్లో పర్యావరణ స్పృహను రేకెత్తించ డానికి గ్రామస్తులతో కలిసి పనిచేసింది. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉండకుండా ఒకేచోట ఉండేలా వెదురుతో ప్రత్యేక నిర్మాణాలు చేయించింది.
కమ్యూనిటీల నిర్వహణలోని ‘వేస్ట్ మేనేజ్‌మెంట్ గ్రూప్’ లతో సాంగ్టీ ప్రాంతంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ గ్రూప్‌లు స్థానిక సంస్కృతి, సాహిత్యాలను ప్రతిబింబించే మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న కాలంలో కోవిడ్ దెబ్బతో పరిసరాల పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్‌మెంట్ మూలన పడ్డాయి. లాక్‌డౌన్ తరువాత ఈ ప్రాంతానికి తిరిగి వచ్చిన ఇతిషా వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలను పునరుద్ధరించడానికి కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో కమ్యూనిటీ గ్రూప్‌లలో ఉత్సాహవంతులైన కొత్త సభ్యులను చేర్చుకున్నారు.
ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణను పర్యవేక్షించేందుకు నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు వంతుల వారీగా వ్యర్థాలను సేకరించి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ(ఎంఆర్‌ఎఫ్) సెంటర్‌లకు తరలిస్తారు. ఒకప్పుడు సాంగ్టీ పేరు వినబడగానే ‘బాబోయ్’ అనుకునేవారు. ఇప్పుడు అలాంటి గ్రామం ‘జీరో వేస్ట్ విలేజ్’గా మారి ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిని ఇస్తోంది.
వారిలో ఒకరిగా...
అప్పుడప్పుడూ వస్తూ, పోతూ పని చేయడం కంటే సాంగ్టీలోనే ఉండి పనిచేయాలనుకున్నాను. ఆ గ్రామస్థులలో ఒకరిగా కలిసి పనిచేయడం వల్ల అందరూ సహకరించారు. నన్ను వారిలో ఒకరిగా చూసుకున్నారు. ‘జీరో వస్ట్ విలేజ్’గా సాంగ్టీని నిలబెట్టే క్రమంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనకడుగు వేయలేదు. వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ప్రతి ఇంటిలో అవగాహన కలిగించడంలో విజయం సాధించాం. - ఇతిషా సారా
Comments
Please login to add a commentAdd a comment