ప్రపంచాన్ని కమ్మేస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి..
ఏటా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల
ఇందులో రీసైక్లింగ్‌కు నోచుకోని 5.21 కోట్ల టన్నులు
వీటిలో 18 శాతం భారత్ నుంచే..
ఏటా భారత్‌లో 93 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు
చైనా కంటే భారత్‌లోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి
లీడ్స్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: భారత్‌ను ప్లాస్టిక్ భూతం భయపెడు తోంది. విచ్చలవిడి వినియోగంతో కాలుష్యం కమ్మేస్తోంది. జనాభాతో పాటు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే ప్లాస్టిక్ ఉద్గారాలకు భారత్ నిలయంగా మారుతోంది. నేచర్ జర్నల్‌లో ప్రచురించిన లీడ్స్ విశ్వవిద్యాలయ (ఇంగ్లడ్) బృందం అధ్యయనం ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సౌకర్యాలు లేకపోవడంతో అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో చైనాను దాటుకుని భారత్ అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా ఉత్పత్తి అవుతున్నాయి. వీటితో 2 లక్షల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌ను నింపొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే 5.21 కోట్ల టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ కాకపోవడంతో ఎక్కువ భాగం పర్యావరణంలోకి ప్రవేశించి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నట్టు నివేదిక చెబుతోంది. ఇందులో దాదాపు ఐదో వంతు (18 శాతం) భారత్ నుంచే వస్తుండటం గమనార్హం.
ఈ క్రమంలోనే చైనాలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ అక్కడి రీసైక్లింగ్ వ్యవస్థ ద్వారా వాటిని నియంత్రిస్తున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. దక్షిణాసియా, సబ్–సహారా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. భారత్ తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనా ప్లాస్టిక్ ఉద్గారాల్లో పోటీపడుతున్నాయి. యూకే మాత్రం 4 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో 135వ ర్యాంకు పొందింది.
ఏటా వివిధ దేశాలు ఉత్పత్తి చేస్తూ నిర్వహణకు నోచుకోని ప్లాస్టిక్ వ్యర్థాలు (లక్షల టన్నుల్లో)
ఆరోగ్యానికి ముప్పు
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య కారకాలకు కారణం అవుతోంది. జనాభా పెరుగుదలకు తోడు ఆదాయ వనరులు పెరగడంతో విలాసాల జీవితం దగ్గరవుతోంది. ఫలితంగా ఎక్కువ వ్యర్థాలు బయటకొస్తున్నాయి. దీంతో దేశంలో వ్యర్థాల నిర్వహణను చేపట్టడం సవాల్‌గా మారింది. దేశంలో డంపింగ్ యార్డుల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. ఇక్కడ సగటున ప్రతి వ్యక్తి రోజుకు 0.12 కేజీల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
అయితే, దేశంలో 95 శాతం వ్యర్థాలను సేకరిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ.. వీటిలో గ్రామీణ ప్రాంతాలు, విచ్చలవిడిగా తగలబెడుతున్న వ్యర్థాలు, అనధికారికి రీసైక్లింగ్‌లోని వ్యర్థాలను లెక్కించడం లేదని అధ్యయనం పేర్కొనడం గమనార్హం. మరోవైపు ప్లాస్టిక్‌ను బహిరంగంగా కాల్చడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపూరిత రసాయనాలు విడుదల అవుతున్నాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, కేన్సర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.
20 దేశాల నుంచే 69 శాతం వ్యర్థాలు
ప్రపంచంలో 69 శాతం వ్యర్థాలు 20 దేశాల నుంచే వస్తున్నట్టు అధ్యయనం నమోదు చేసింది. ఇందులో 4 తక్కువ ఆదాయ, 9 తక్కువ మధ్య ఆదాయ, 7 ఉన్నత మధ్య ఆదాయ దేశాలున్నాయి. అధికాదాయ దేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రపంచంలో రీసైక్లింగ్ చేయని ప్లాస్టిక్‌లో దాదాపు 43 శాతం చెత్తగా మారి పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. అయితే.. అత్యంత ప్లాస్టిక్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంటే.. అక్కడ సగటున రోజులో ఒక వ్యక్తి ఉత్పత్తి చేస్తున్న వ్యవర్థాలు తక్కువగా ఉండటంతో 153వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో భారత్ 127వ స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment