
భారత్‌లో వ్యర్థాల నుంచి కీలకమైన ఖనిజాలను వేరు చేసేందుకు (రికవరీ) విధానపరమైన సంస్కరణల మద్దతుతోపాటు బహుముఖ వ్యూహం అవసరమని ఫిక్కీ–డెలాయిట్ నివేదిక సూచించింది. మైన్ టైలింగ్స్(గనుల పొరలు), ఫ్లై యాష్, ఎర్రమట్టి, మెటల్ స్లాగ్ వంటి వ్యర్థ పదార్థాల నుంచి కీలకమైన ఖనిజాలను వెలికితీయాలని తెలిపింది. టెక్నాలజీ అభివృద్ధి, ప్రాసెసింగ్ సామర్థ్యం, సరఫరా వ్యవస్థతో అనుసంధానం అనే అంశాలు వ్యర్థాల నుంచి విలువైన ఖనిజనాల వెలికితీతకు అవసరమని అభిప్రాయపడింది. శుద్ధ ఇంధన టెక్నాలజీలకు (క్లీన్ ఎనర్జీ/ పర్యావరణ అనుకూల), ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), బ్యాటరీ తయారీకి కీలక ఖనిజాలు ఎంతో ముఖ్యమైనవిగా పేర్కొంది.
ప్రపంచ దేశాలు క్లీన్ ఎనర్జీ వైపు మళ్లుతుండడంతో ఈ ఖనిజాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు నివేదిక వివరించింది. విమానాల తయారీ, క్షిపణులు, కార్వెట్స్ తదితర రక్షణ ఉత్పత్తుల తయారీకి సైతం వీటిని వినియోగిస్తున్నట్టు గుర్తు చేసింది. ఈ కీలక ఖనిజ వనరులను సమకూర్చుకునేందుకు భారత్ ఇటీవల ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో.. తక్కువ స్థాయి నిల్వలు, మైనింగ్ కార్యకలాపాలు దీర్ఘకాలం పాటు చేయాల్సి రావడం, ప్రాసెసింగ్ పరంగా ఉన్న అవరోధాలను ఈ నివేదిక ప్రస్తావించింది. కాబట్టి కీలక ఖనిజ వనరుల కోసం ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని, వ్యర్థాల నుంచి ఖనిజాల వెలికితీత మెరుగైన పరిష్కారంగా పేర్కొంది.
ఇదీ చదవండి: రిలయన్స్‌కు రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసులు
బూడిద, ఎర్రమట్టి, ఫ్లై యాష్, గనుల పైపొరలు, లోహ వ్యర్థాలు, మెటల్ స్లాగ్ నుంచి నికెల్, కోబాల్ట్, కాపర్, టైటానియం, గాలియంను రికవరీ చేసుకోవచ్చని తెలిపింది. భారత్ కీలక ఖనిజ వనరుల సుస్థిరతకు, డిమాండ్ అవసరాలను తీర్చుకునేందుకు ఈ వనరులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. చాలా దేశాలు ఇప్పుడు వ్యర్థాల నుంచి కీలక ఖనిజాల వెలికితీత ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నట్టు ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment