వేస్టేజీ నిబంధనలకు సవరణలు
జనవరి 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులకు సంబంధించి సవరించిన వేస్టేజీ (తరుగు/వృధా) నిబంధనలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆభరణాల తయారీ సమయంలో కొంత లోహం వృధా అవుతుందని తెలిసిందే. ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ఈ వేస్టేజీ పరంగా పరిమితులు ఉన్నాయి. ఈ వేస్టేజీని తగ్గిస్తూ ఈ ఏడాది మే 27న కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
వీటిపట్ల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేయడంతో 2024 డిసెంబర్ చివరి వరకు అమలును వాయిదా వేసింది. కొంత వెసులుబాటుతో సవరించిన నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ‘‘ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ప్రామాణిక ఇన్‌పుట్–అవుట్‌పుట్, అనుమతించిన వేస్టేజీ నిబంధనలను సవరించడమైనది’’అంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ప్రకటించింది.
ఆభరణాల తయారీ ప్రక్రియకు తగ్గట్టు వేస్టేజీని వాస్తవికంగా నిర్ణయించాలని ప్రరిశ్రమ కోరడం గమనార్హం. అలాగే, కొత్త నిబంధనల అమలుకు తగినంత సమయం ఇవ్వాలని కూడా కోరింది. సాధారణ బంగారం, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 2.5 శాతం నుంచి 0.5 శాతానికి, వెండి ఆభరణాలకు వేస్టేజీని 3.2 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గిస్తూ మే నెలలో ప్రకటించిన నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. అదే స్టడెడ్ జ్యుయలరీ విషయంలో బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 0.75 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 5 శాతంగా ఉండేది.
కొంత వెసులుబాటు..: తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. చేతితో తయారు చేసిన బంగారం, ప్లాటినం ఆభరణాలకు సంబంధించి గరిష్ట వేస్టేజీని 2.5% వరకు అనుమతించనున్నారు. చేతితో చేసిన వెండి ఆభరణాలకు 3.2 % వేస్టేజీ అమలు కానుంది. మెషిన్లపై చేసిన బంగారం ఆభరణాలకు 0.45% వేస్టేజీ, వెండికి 0.5% అమలు కానుంది. చేతితో చేసిన బంగారం, వెండి, ప్లాటినం స్టడెడ్ ఆభరణాలకు 4 శాతం, మెషిన్‌పై చేసిన స్టడెడ్ ఆభరణాలు అయితే 2.8% మేర వేస్టేజీని అనుమతించనున్నారు. ఆభరణాలతోపాటు విగ్రహాలు, కాయిన్లు, పతకాలు, ఇతర వస్తువులకు సైతం ఇవే వేస్టేజీ నిబంధనలు అమలవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment