
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను లీటరుకు రూపాయి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై పన్నును ఐదో వంతు తగ్గించినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్‌జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీ టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గింది. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు తమ ప్రీ–బడ్జెట్ మెమోరాండంలో ప్రభుత్వాన్ని కోరాయి.
Comments
Please login to add a commentAdd a comment