మంత్రుల చేతికి ‘దీపం’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేద మహిళలకు ‘దీపం’ పథకం కింద ఇచ్చే వంటగ్యాస్ కనెక్షన్లలో మళ్లీ రాజకీయ జోక్యం పెరిగిపోనుంది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జీవో విడుదల చేసింది. అయితే గతంలోనూ ఇదే తరహాలో ‘దీపం’ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఇన్‌చార్జి మంత్రుల ఆధీనంలో ఉండేది. కానీ పారదర్శకత లోపించిందనే ఆరోపణల కారణంగా గత ఫిబ్రవరిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా కలెక్టర్లకు అప్పగించింది.
తాజాగా తిరిగి మంత్రులకే అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అప్పట్లో ఈ విధానాన్ని తప్పుబట్టిన నేతలే ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలుగా తిరిగి దానిని అమల్లోకి తెచ్చారనే అభిప్రాయాలు వస్తున్నాయి.
ఇన్‌చార్జి మంత్రి చేతిలో..
‘దీపం’ కనెక్షన్ కోసం లబ్ధిదారుల గుర్తింపు జరిగాక జాబితాను ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, వార్డుల్లో ప్రదర్శించి, అభ్యంతరాలు స్వీకరిస్తారు. మూడు రోజుల తర్వాత గ్రామ, వార్డు సభల్లో జాబితాను చదువుతారు. ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడికక్కడే పరిష్కరించి సర్పంచ్ సంతకం తీసుకొని జాబితాను జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. అన ంతరం కలెక్టర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఇందుకోసం ప్రతిపాదిత మహిళ గతంలో వంటగ్యాస్ కనెక్షన్ కలిగిలేరని, సిలిండర్, రెగ్యులేటర్ కొనే పరిస్థితిలో లేరని, ఈ గ్యాస్ కనెక్షన్‌ను గృహ అవసరాలకు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉందనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు తుది ఎంపిక అధికారం పూర్తిగా కలెక్టర్లకే ఉండేది.
కానీ ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక తుది బాధ్యతను జిల్లా ఇన్‌చార్జి మంత్రికి కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల తుది ఎంపిక జాబితాకు ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తెలపాలి. ఆయన సూచనల మేరకు మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఆ తర్వాతే కలెక్టర్లు జాబితాను సంబంధిత కంపెనీలకు పంపాలి. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఈ సవరణలు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. తమవారికి ‘దీపం’ కనెక్షన్లు ఇప్పించుకునేందుకే లబ్ధిదారుల తుది ఎంపిక బాధ్యతను మంత్రులకు కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి.
ఎంపిక ప్రక్రియ షురూ
వంటగ్యాస్ కనెక్షన్ లేని స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి, వారికి ‘దీపం’ పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2014-15లో 5.95 లక్షల మందికి వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.96 కోట్లు కేటాయించగా, 2015-16లో మరో రూ.50 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.