Cooking gas connections
-
మంత్రుల చేతికి ‘దీపం’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేద మహిళలకు ‘దీపం’ పథకం కింద ఇచ్చే వంటగ్యాస్ కనెక్షన్లలో మళ్లీ రాజకీయ జోక్యం పెరిగిపోనుంది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా జిల్లా ఇన్చార్జి మంత్రులకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జీవో విడుదల చేసింది. అయితే గతంలోనూ ఇదే తరహాలో ‘దీపం’ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఇన్చార్జి మంత్రుల ఆధీనంలో ఉండేది. కానీ పారదర్శకత లోపించిందనే ఆరోపణల కారణంగా గత ఫిబ్రవరిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా కలెక్టర్లకు అప్పగించింది. తాజాగా తిరిగి మంత్రులకే అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అప్పట్లో ఈ విధానాన్ని తప్పుబట్టిన నేతలే ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలుగా తిరిగి దానిని అమల్లోకి తెచ్చారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇన్చార్జి మంత్రి చేతిలో.. ‘దీపం’ కనెక్షన్ కోసం లబ్ధిదారుల గుర్తింపు జరిగాక జాబితాను ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, వార్డుల్లో ప్రదర్శించి, అభ్యంతరాలు స్వీకరిస్తారు. మూడు రోజుల తర్వాత గ్రామ, వార్డు సభల్లో జాబితాను చదువుతారు. ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడికక్కడే పరిష్కరించి సర్పంచ్ సంతకం తీసుకొని జాబితాను జిల్లా కలెక్టర్కు పంపుతారు. అన ంతరం కలెక్టర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఇందుకోసం ప్రతిపాదిత మహిళ గతంలో వంటగ్యాస్ కనెక్షన్ కలిగిలేరని, సిలిండర్, రెగ్యులేటర్ కొనే పరిస్థితిలో లేరని, ఈ గ్యాస్ కనెక్షన్ను గృహ అవసరాలకు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉందనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు తుది ఎంపిక అధికారం పూర్తిగా కలెక్టర్లకే ఉండేది. కానీ ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక తుది బాధ్యతను జిల్లా ఇన్చార్జి మంత్రికి కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల తుది ఎంపిక జాబితాకు ఇన్చార్జి మంత్రి ఆమోదం తెలపాలి. ఆయన సూచనల మేరకు మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఆ తర్వాతే కలెక్టర్లు జాబితాను సంబంధిత కంపెనీలకు పంపాలి. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఈ సవరణలు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. తమవారికి ‘దీపం’ కనెక్షన్లు ఇప్పించుకునేందుకే లబ్ధిదారుల తుది ఎంపిక బాధ్యతను మంత్రులకు కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఎంపిక ప్రక్రియ షురూ వంటగ్యాస్ కనెక్షన్ లేని స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి, వారికి ‘దీపం’ పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2014-15లో 5.95 లక్షల మందికి వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.96 కోట్లు కేటాయించగా, 2015-16లో మరో రూ.50 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. -
జిల్లాకు 70వేల ‘దీపం’ కనెక్షన్లు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : పేద మహిళలకు శుభవార్త. జిల్లాకు ‘దీపం’ పథకం కింద ప్రభుత్వం 70వేల వంటగ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గానికి 5వేల కనెక్షన్లను కేటాయించిన సర్కారు.. జనాభా ప్రాతిపదికన ఎంపిక చేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఏప్రిల్ మొదటివారంలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకే ఈ పథకం వర్తించనుంది. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నవారిని పరిగణనలోకి తీసుకోరు. దీపం కింద గ్యాస్ బండ పొందే లబ్ధిదారులు అమ్మడం కానీ, బదిలీ చేయడం కానీ కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలావుండగా, గతంలో లబ్ధిదారుల ఎంపికలో జాప్యం కావడంతో గ్యాస్ కనెక్షన్లు రద్దయ్యాయి. అయితే, అప్పట్లో ఎంపిక చేసిన 22వేల మంది జాబితాను తాజాగా ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆహారభద్రత సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా లబ్ధిదారులను గుర్తించనున్నామని స్పష్టం చేశారు. -
సగం మందికి సబ్సిడీ లేదు!
సాక్షి, హైదరాబాద్: నగదు బదిలీ అమల్లో ఉన్న ఐదు జిల్లాల్లోని వంటగ్యాస్ వినియోగదారులకు ‘ఆధార్’ గుబులు పట్టుకుంది. బ్యాంకు ఖాతాలు, వంటగ్యాస్ కనెక్షన్లతో ఆధార్ విశిష్ట సంఖ్య అనుసంధానానికి గడువు ఇక రెండు రోజులే మిగిలింది. ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో.. ఇప్పటికి 47 శాతం మంది ఆధార్ నంబర్ల అనుసంధానం మాత్రమే పూర్తయింది. యంత్రాంగం నిర్లక్ష్యం, విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగా 24 లక్షలకు పైగా వినియోగదారులకు సబ్సిడీ అందకుండా పోతోంది. ఆదివారం నుంచి వీరంతా గ్యాస్ సిలిండర్ను రూ.962 చెల్లించి కొనుగోలు చేయక తప్పని స్థితి నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో వంట గ్యాస్ వినియోగదారులకు సెప్టెంబరు 1నుంచి నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ జిల్లాల్లో 48,18,279 మంది వంటగ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకూ 22,28,573 మందికి(46.25 శాతం) ఆధార్ ప్రక్రియ పూర్తయింది. శనివారం లోగా మరో 3.75 శాతం పూర్తయినా.. మిగతా 50 శాతం గ్యాస్ వినియోగదారులకు వంటగ్యాస్ సబ్సిడీ తాత్కాలికంగా రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆధార్, వంటగ్యాస్ కంపెనీలు, బ్యాంకుల మధ్య సమన్వయ లోపమే సమస్యగా మారిందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఆధార్ నంబర్ పొందలేకపోయిన వారు కొందరైతే.. ఆధార్ నంబర్ పొంది, గ్యాస్ ఏజన్సీ, బ్యాంకులకు అందజేసిన వారి విషయంలో కూడా అనుసంధానం జరగడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.