జిల్లాకు 70వేల ‘దీపం’ కనెక్షన్లు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : పేద మహిళలకు శుభవార్త. జిల్లాకు ‘దీపం’ పథకం కింద ప్రభుత్వం 70వేల వంటగ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గానికి 5వేల కనెక్షన్లను కేటాయించిన సర్కారు.. జనాభా ప్రాతిపదికన ఎంపిక చేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఏప్రిల్ మొదటివారంలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకే ఈ పథకం వర్తించనుంది.
ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నవారిని పరిగణనలోకి తీసుకోరు. దీపం కింద గ్యాస్ బండ పొందే లబ్ధిదారులు అమ్మడం కానీ, బదిలీ చేయడం కానీ కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలావుండగా, గతంలో లబ్ధిదారుల ఎంపికలో జాప్యం కావడంతో గ్యాస్ కనెక్షన్లు రద్దయ్యాయి. అయితే, అప్పట్లో ఎంపిక చేసిన 22వేల మంది జాబితాను తాజాగా ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆహారభద్రత సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా లబ్ధిదారులను గుర్తించనున్నామని స్పష్టం చేశారు.