Lamp scheme
-
వెలగని ‘దీపం’
♦ పథకానికి లబ్ధిదారులు కావలెను.. ♦ గడువు ముగిసినా పూర్తి కాని ఎంపిక ♦ అధికారుల నిర్లక్ష్యంతో ఎంపిక ఆలస్యం ♦ నియోజకవర్గానికి 5వేల గ్యాస్ కనెక్షన్లు ఖమ్మ జెడ్పీసెంటర్ : దీపం పథకం ద్వారా నిరుపేదలు గ్యాస్ స్టవ్‌పై వంట చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి.. రాయితీపై కనెక్షన్లు మంజూరు చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యమో.. లబ్ధిదారుల అవగాహనా లోపమో కనెక్షన్లు పొందేందుకు ముందుకు రావడం లేదు. జూన్ నెలాఖరులోగా గడువు ముగిసినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కనెక్షన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదనే అధికారుల వాదన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లగా.. ఆయన ఆదేశాల మేరకు జేసీ దివ్య దీపం కనెక్షన్లు పొందే వారి కోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూ.1,970లకే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేశారు. దీపం పథకం కింద జిల్లాకు 50వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. పది నియోజకవర్గాలకు.. ఒక్కో దానికి 5వేల కనెక్షన్లు జూన్ నాటికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి.. కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. 50వేల కనెక్షన్లకు.. 38,588 మందికి ఇచ్చేందుకు నిర్ణయించి.. 28,581 మంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారుల ఎంపిక నెలల తరబడి సాగుతోంది. అర్హులు వీరే.. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గతంలో గ్యాస్ కనెక్షన్ తీసుకోని వారు దీపం పథకానికి అర్హులు. గ్యాస్ కనెక్షన్లను నగదు చెల్లించి.. కొనుగోలు చేయని వారికి ప్రభుత్వం సబ్సిడీపై సిలిండర్, స్టవ్, పాస్ పుస్తకం అందిస్తోంది. లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను ప్రమాణికంగా తీసుకుంటారు. డీలర్‌కు లబ్ధిదారులు రూ.1,970 అందజేస్తే.. కనెక్షన్‌తోపాటు నిండు సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్, పైపు ఇస్తారు. ఎంపీడీఓలదే బాధ్యత మండలస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎంపీడీఓలదే. నిరుపేదలకు మాత్రమే పథకం వర్తింపజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల గుర్తింపు పూర్తయిన తరువాత ఆ జాబితాను గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. మూడు రోజులు గ్రామసభలు నిర్వహించి.. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తరువాత తుది జాబితా మండల స్థాయిలోనే ఖరారు చేస్తారు. అక్కడ ఖరారు చేసిన తుది జాబితాను ఎంపీడీఓల ద్వారా డీఆర్డీఏ పీడీకి.. అక్కడి నుంచి కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదం తరువాత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు. వెనుకబాటు జిల్లాకు మంజూరైన 50వేల గ్యాస్ కనెక్షన్లకు.. 40,837 మంది లబ్ధిదారులను గుర్తించామని.. 38,588 మందికి కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే మొత్తం 28,581 కనెక్షన్లు మంజూరు చేసినట్లు నివేదికల్లో పేర్కొంటున్నారు. ఇంకా 10వేల కనెక్షన్లకు లబ్ధిదారులను గుర్తించడం కష్టంగా మారినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కనెక్షన్లు ఇస్తామని చెబుతున్నా లబ్ధిదారులు ముందుకు రావడం లేదని అధికారుల వాదన. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉండగా.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 4,123 దీపం కనెక్షన్లకు.. 1,908 మంది లబ్ధిదారులను గుర్తించగా.. 1,058 మందికి కనెక్షన్లు మంజూరు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 987 కనెక్షన్లకు.. 770 మంజూరు చేశారు. మణుగూరు మున్సిపాలిటీలో 591 కనెక్షన్లకు.. 41 మందికి మాత్రమే పంపిణీ చేశారు. మణుగూరు మండలంలో 859 కనెక్షన్లకు.. 505 మందికి పంపిణీ చేశారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 603 కనెక్షన్లకు.. ఒక్కరికి కూడా పంపిణీ చేయలేదు. -
తగ్గిన ‘దీపం’ వెలుగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదింటి మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘దీపం’ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఈ పథకానికి రూ.37.61 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.21.61కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే 6,55,354 మందికి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, 5,43,412 మంది అర్హులను గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు రెండు లక్షల మందికి మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. భారీ లక్ష్యం ముందున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో కేటాయింపులను తగ్గించినట్లుగా తెలుస్తోంది. -
జిల్లాకు 70వేల ‘దీపం’ కనెక్షన్లు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : పేద మహిళలకు శుభవార్త. జిల్లాకు ‘దీపం’ పథకం కింద ప్రభుత్వం 70వేల వంటగ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గానికి 5వేల కనెక్షన్లను కేటాయించిన సర్కారు.. జనాభా ప్రాతిపదికన ఎంపిక చేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఏప్రిల్ మొదటివారంలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకే ఈ పథకం వర్తించనుంది. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నవారిని పరిగణనలోకి తీసుకోరు. దీపం కింద గ్యాస్ బండ పొందే లబ్ధిదారులు అమ్మడం కానీ, బదిలీ చేయడం కానీ కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలావుండగా, గతంలో లబ్ధిదారుల ఎంపికలో జాప్యం కావడంతో గ్యాస్ కనెక్షన్లు రద్దయ్యాయి. అయితే, అప్పట్లో ఎంపిక చేసిన 22వేల మంది జాబితాను తాజాగా ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆహారభద్రత సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా లబ్ధిదారులను గుర్తించనున్నామని స్పష్టం చేశారు. -
అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు
సారంగాపూర్/దిలావర్పూర్ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికీ ఆహార భద్రత కార్డులు పంపిణీ చేస్తామని దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని స్వర్ణ గ్రామంలో శుక్రవారం లబ్ధిదారులకు ఆహారభద్రతా కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి చెంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున బియ్యం చొప్పున పంపిణీ చేశారని.. ఆరు కిలోలకు పెంచిందని అన్నారు. వార్షిక ఆదాయం రూ.60 వేలలోపు ఉన్న వారికి మాత్రమే రేషన్‌కార్డులు ఇచ్చారని, ప్రస్తుతం లక్ష, 50 వేలలోపు ఉన్నవారికి కూడా ఆహార భద్రతా కార్డులు జారీ చేస్తున్నామని చెప్పారు. పింఛన్లు పెంచామని పేర్కొన్నారు. వంటగ్యాస్ లేనివారికి త్వరలో దీపం పథకం కింద సిలిండర్లు మంజూరు చేసే యోచనలో ఉన్నామని అన్నారు. అలాగే రైతుల వ్యవసాయ ఇబ్బందులు తీర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం 40 వేల మోటార్లకు సోలార్ విద్యుత్ అందించేలా ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో వ్యవసాయానికి ఎలాంటి విద్యుత్ కొరత లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడి బొగ్గు, నీళ్లతో ఆంద్రోళ్లు తమ ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారన్నారు. రాష్ట్రం విడిపోయాక మనకు విద్యుత్ సమస్యలు వచ్చిపడ్డాయని అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ కొరత తీర్చాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని అన్నారు. కాకతీయ మిషన్ద్వారా చెరువుల్లో పూడికతీత, మరమ్మతు చేపడుతున్నామని చెప్పారు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు ఆకనట్ట వెడల్పు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే రూ.3 కోట్లతో గేట్ల మరమ్మతులు చేయిస్తున్నామని అన్నారు. సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) నుంచి వెంగ్వాపేట్ రోడ్డుకు రూ.3 కోట్ల 80 లక్షలు, బీరవెల్లి నుంచి దిలావర్పూర్ రోడ్డుకు రూ.2.44 లక్షలు, పెండల్దరి రోడ్డుకు రూ.కోటి 50 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పవార్ శెవంతాబాయి, ఆర్డీవో శివలింగయ్య, సర్పంచులు లక్ష్మి, గంగారెడ్డి, ఎల్లయ్య, రవి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్‌గౌడ్, ఎంపీడీవో శేఖర్, తహశీల్దార్ గంగాధర్, నిర్మల్ రూరల్ సీఐ పురుషోత్తం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి కృషి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమానికి తనవంతు కృషిచేస్తానని మంత్రి ఐకే రెడ్డి పేర్కొన్నారు. స్వర్ణ ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్‌ఫైన్ బియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో కూర్చోవడానికి బెంచీలు లేవని విద్యార్థులు చెప్పడంతో.. వెంటనే 50 బెంచీలు తయారు చేయించి ఇవ్వాలని డీఆర్వో జైపాల్‌రెడ్డిని ఆదేశించారు. పాఠశాల భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా తమకు కాంట్రాక్టర్ అప్పగించలేదని ఉపాధ్యాయులు చెప్పడంతో.. మంత్రి వెంటనే ఐటీడీఏ అధికారులతో మాట్లాడారు. వెంటనే భవనాన్ని అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పాఠశాలలలలో సీఆర్టీలు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి దిలావర్పూర్ : ఆహార భద్రత పథకంలో భాగంగా మండంలోని నర్సాపూర్(జి) గ్రామంలోనూ లబ్ధిదారులకు బియ్యం అందించే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య, నిర్మల్ ఎఫ్ఎస్సీఎస్ ైచె ర్మన్ రాంకిషన్రె డ్డి, బోథ్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తుల శ్రీనివాస్, సర్పంచ్ కోండ్రురేఖ రమేశ్, ఎంపీపీ పాల్దె లక్ష్మీశ్రీనివాస్, జెడ్పీటీసీ ఆమ్గోత్ సుజాత మెర్వాన్, ఎంపీటీసీలు లక్ష్మి, కవిత, తదితరులు పాల్గొన్నారు. -
వెలగని దీపం
- ఉన్నవారికే మళ్లీ మంజూరు - ఎన్నికల ముందు ప్రతిపాదనలు రద్దు ? - ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపు నల్లగొండ : దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరై ఏడాది కావస్తున్నా పంపిణీకి నోచుకోలేదు. మంజూరైన గ్యాస్కనెక్షన్లకు సరిపడా లబ్ధిదారులను సైతం అధికారులు ఎంపిక చేయలేదు. ఎన్నికల ముందు ప్రజాప్రతినిధుల వత్తిడిమేరకు హడావుడిగా కొన్ని గ్యాస్కనెక్షన్లను మాత్రమే పంపిణీ చేశారు. అయితే ఇప్పటికే కనెక్షన్ ఉన్నవారికే తిరిగి మంజూరయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కూడా గత అధికార పార్టీకి చెందిన పార్టీ కార్యకర్తలకే ఇప్పించారని ప్రస్తుత ప్రభుత్వం భావి స్తోంది. అందుకే లబ్ధిదారుల జాబితాను మరోసారి పరిశీలించడంతో పాటు అవసరమైతే రద్దు చేయాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం అన్ని గ్యాస్ కంపెనీలకు కలుపుకుని 4,46,547 కనెక్షన్లు ఉన్నాయి. అయితే జిల్లాలో 2013-14 సంవత్సరానికి గాను దీపం పథకం కింద 76, 064 గ్యాస్ కనెక్షన్లు మంజూరు కాగా 45,400 మంది లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. అయితే ఎన్నికల ముందే ప్రజాప్రతినిధుల వత్తిడి మేరకు వీటిలో 18,547 కనెక్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంకా 26,853 కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇంకా 30,664 గ్యాస్ కనెక్షన్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికే తిరిగి మంజూరైనట్లు సమాచారం. నాయకులకు, కార్యకర్తలకు కనెక్షన్లు ఇప్పించారని.. సార్వత్రిక ఎన్నికలకు ముందు దీపం గ్యాస్ కనెక్షన్లు గతంలో ఉన్న పాలకులు రాజకీయావసరాలకు వినియోగించుకున్నట్లు సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు అప్పటి అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు చోటా నాయకులు వారి పార్టీ కార్యకర్తలకే ఇప్పించారని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తోంది. దాంతో గతంలో దీపం గ్యాస్ కనెక్షన్లకుఎంపికైన లబ్ధిదారుల జాబితాలను మరో సారి పరిశీలించాలని అవసరమైతే రద్దు చేయాలని కూడా సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే దీపం గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక ఎన్నికలకు ముందే కొంతవరకు పూర్తయినా పంపిణీకి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదు. లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు - నాగేశ్వర్రావు, డీఎస్ఓ నల్లగొండ దీపం పథకం గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. జిల్లాకు మంజూరైన కోటాలో కొంతమందిని లబ్ధిదారులను ఎంపిక చేశాం. ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గత ంలో ఎన్నికలకు ముందు కొన్ని గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారు ల ఎంపిక, గ్యాస్ కనెక్షన్ల పంపిణీ విషయాలపై నూతన ప్రభుత్వం ఆదేశా లు జారీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. -
మూడున్నర లక్షల దీపం కనెక్షన్లు రద్దు
* రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం * రాయలసీమ జిల్లాల్లోనే 1,63,981 మంది తొలగింపు * కొత్త లబ్ధిదారుల ఎంపికకు ఆదేశాలు * రేషన్ డీలర్ పోస్టుల భర్తీపై పాత మార్గదర్శకాలు రద్దు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో దీపం పథకం కింద మంజూరైన వాటిలో 3.50 లక్షల గ్యాస్ కనెక్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ మేరకు వెంటనే జాబితాను తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధ్దిదారుల ఎంపికలో అవకతవకల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల దీపం కనెక్షన్లు రద్దు చేస్తుండగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనే 1,63,981 మంది లబ్ధిదారులను ఆ పథకం నుంచి తొలగించనున్నారు. మంత్రి ఇటీవల రాయలసీమ జిల్లాల్లో నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితి, గతంలో దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్లు తదితర వాటిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీపం పథకం కింద చిత్తూరు జిల్లాకు 1,39,646 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా వాటిలో 88,882 కనెక్షన్లను రద్దు చేయనున్నారు. కర్నూలు జిల్లాకు మంజూరైన 57,667 కనెక్షన్లలో 35,137, అనంతపురం జిల్లాకు మంజూరైన 72,270 కనెక్షన్లలో 26,679, కడప జిల్లాకు మంజూరైన 53,333 కనెక్షన్లలో 13,283 కనెక్షన్లు రద్దు చేసి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించినట్లు సమాచారం. మిగతా కనెక్షన్లకు సంబంధించి కూడా ప్రాంతాల వారీగా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించి అక్కడికక్కడే రద్దు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. వంద రోజుల ప్రణాళికలో భాగంగా దీపం పథకం కింద కొత్తగా మంజూరు చేసిన లక్ష దీపం కనెక్షన్లకు సంబంధించిన లబ్ధ్దిదారుల జాబితా కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించా రు. రాష్ట్రంలో 1999 నుంచి ప్రభుత్వం దీపం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద కనెక్షన్ పొందే లబ్ధిదారులు రూ. 1600 డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. అందుకే వీటికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఇలావుండగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరులో 277, కడపలో 360, అనంతపురంలో 589, కర్నూలులో 187 చౌక దుకాణాల డీలర్ పోస్టులు అధికారికంగా ఖాళీగా ఉన్నాయి. వీరి నియామకానికి సంబంధించి ప్రస్తుతం వున్న మార్గదర్శకాలను రద్దు చేసి కొత్త మార్గదర్శకాలు తయారు చేసి వెంటనే నియామకాలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు ఆశించిన స్థాయిలో స్పందించని అధికారులను బదిలీ చేసే విషయమై మంత్రి సునీత.. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
పొయ్యిలు సరే.. సిలెండర్లేవి?
మంత్రి పర్యటనలో భాగంగా ‘దీపం’ మంజూరు వెంటనే కనెక్షన్లు స్వాధీనం గిరిజనుల ఆందోళనతో స్టౌలు పంపిణీ ఇప్పటికీ అందని గ్యాస్ సిలిండర్లు చింతపల్లి, న్యూస్‌లైన్ : దీపం పథకంలో భాగంగా గ్యాస్ పొయ్యిలు పంపిణీ చేసిన అధికారులు సిలిండర్లు ఇవ్వడం మరిచిపోయారు. దీనిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11న మంత్రి బాలరాజు చింతపల్లి, జీకే వీధి మండలాల్లో పర్యటనలో భాగంగా గిరిజన సహకార సంస్థ అధికారులు సబ్సిడీతో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జీకే వీధి, చింతపల్లి మండలాల్లో సుమారు 200 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నామని ప్రకటించారు. మంత్రి బాలరాజు చేతుల మీదుగా చాలా మంది గిరిజనులకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. మంత్రి పర్యటన ముగిసిన మరుక్షణమే లబ్ధిదారుల నుంచి అధికారులు గ్యాస్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇదేమని అడిగితే తెల్ల రేషన్‌కార్డుతో పాటు ఆధార్ కార్డు, దరఖాస్తు ఫారాలు, రూ.2,700 చెల్లిస్తే వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని, కనెక్షన్ మంజూరైన తర్వాత ఈ పథకం కింద గ్యాస్ పంపిణీ చేస్తామని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఈ నెల 14న పలువురు మహిళలు చింతపల్లి జీసీసీ బ్రాంచి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇదంతా ‘మంత్రి మెప్పు కోసమేనా’ శీర్షికతో ఈ నెల 15న సాక్షి దినపత్రికలో కథనం కూడా ప్రచురితమైంది. ఈ మేరకు దిగివచ్చిన అధికారులు గ్యాస్ పొయ్యిలను హుటాహుటిన అందజేసి చేతులు దులుపేసుకున్నారు. గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయకపోవడంతో గిరిజనులు మరోసారి ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. సిలిండర్లు లేకుండా పొయ్యిలు పంపిణీ చేయడం వల్ల ప్రయోజనమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పథకాన్ని పూర్తి స్థాయిలో వర్తింపజేయాలని కోరుతున్నారు.