మూడున్నర లక్షల దీపం కనెక్షన్లు రద్దు
* రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
* రాయలసీమ జిల్లాల్లోనే 1,63,981 మంది తొలగింపు
* కొత్త లబ్ధిదారుల ఎంపికకు ఆదేశాలు
* రేషన్ డీలర్ పోస్టుల భర్తీపై పాత మార్గదర్శకాలు రద్దు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో దీపం పథకం కింద మంజూరైన వాటిలో 3.50 లక్షల గ్యాస్ కనెక్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ మేరకు వెంటనే జాబితాను తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధ్దిదారుల ఎంపికలో అవకతవకల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల దీపం కనెక్షన్లు రద్దు చేస్తుండగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనే 1,63,981 మంది లబ్ధిదారులను ఆ పథకం నుంచి తొలగించనున్నారు.
మంత్రి ఇటీవల రాయలసీమ జిల్లాల్లో నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితి, గతంలో దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్లు తదితర వాటిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీపం పథకం కింద చిత్తూరు జిల్లాకు 1,39,646 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా వాటిలో 88,882 కనెక్షన్లను రద్దు చేయనున్నారు. కర్నూలు జిల్లాకు మంజూరైన 57,667 కనెక్షన్లలో 35,137, అనంతపురం జిల్లాకు మంజూరైన 72,270 కనెక్షన్లలో 26,679, కడప జిల్లాకు మంజూరైన 53,333 కనెక్షన్లలో 13,283 కనెక్షన్లు రద్దు చేసి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించినట్లు సమాచారం.
మిగతా కనెక్షన్లకు సంబంధించి కూడా ప్రాంతాల వారీగా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించి అక్కడికక్కడే రద్దు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. వంద రోజుల ప్రణాళికలో భాగంగా దీపం పథకం కింద కొత్తగా మంజూరు చేసిన లక్ష దీపం కనెక్షన్లకు సంబంధించిన లబ్ధ్దిదారుల జాబితా కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించా రు. రాష్ట్రంలో 1999 నుంచి ప్రభుత్వం దీపం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద కనెక్షన్ పొందే లబ్ధిదారులు రూ. 1600 డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. అందుకే వీటికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఇలావుండగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరులో 277, కడపలో 360, అనంతపురంలో 589, కర్నూలులో 187 చౌక దుకాణాల డీలర్ పోస్టులు అధికారికంగా ఖాళీగా ఉన్నాయి. వీరి నియామకానికి సంబంధించి ప్రస్తుతం వున్న మార్గదర్శకాలను రద్దు చేసి కొత్త మార్గదర్శకాలు తయారు చేసి వెంటనే నియామకాలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు ఆశించిన స్థాయిలో స్పందించని అధికారులను బదిలీ చేసే విషయమై మంత్రి సునీత.. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.