వెలగని దీపం
- ఉన్నవారికే మళ్లీ మంజూరు
- ఎన్నికల ముందు ప్రతిపాదనలు రద్దు ?
- ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపు
నల్లగొండ : దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరై ఏడాది కావస్తున్నా పంపిణీకి నోచుకోలేదు. మంజూరైన గ్యాస్‌కనెక్షన్లకు సరిపడా లబ్ధిదారులను సైతం అధికారులు ఎంపిక చేయలేదు. ఎన్నికల ముందు ప్రజాప్రతినిధుల వత్తిడిమేరకు హడావుడిగా కొన్ని గ్యాస్‌కనెక్షన్లను మాత్రమే పంపిణీ చేశారు. అయితే ఇప్పటికే కనెక్షన్ ఉన్నవారికే తిరిగి మంజూరయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కూడా గత అధికార పార్టీకి చెందిన పార్టీ కార్యకర్తలకే ఇప్పించారని ప్రస్తుత ప్రభుత్వం భావి స్తోంది. అందుకే లబ్ధిదారుల జాబితాను మరోసారి పరిశీలించడంతో పాటు అవసరమైతే రద్దు చేయాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం అన్ని గ్యాస్ కంపెనీలకు కలుపుకుని 4,46,547 కనెక్షన్లు ఉన్నాయి.
అయితే జిల్లాలో 2013-14 సంవత్సరానికి గాను దీపం పథకం కింద 76, 064 గ్యాస్ కనెక్షన్‌లు మంజూరు కాగా 45,400 మంది లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. అయితే ఎన్నికల ముందే ప్రజాప్రతినిధుల వత్తిడి మేరకు వీటిలో 18,547 కనెక్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంకా 26,853 కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇంకా 30,664 గ్యాస్ కనెక్షన్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికే తిరిగి మంజూరైనట్లు సమాచారం.
నాయకులకు, కార్యకర్తలకు కనెక్షన్లు ఇప్పించారని..
సార్వత్రిక ఎన్నికలకు ముందు దీపం గ్యాస్ కనెక్షన్లు గతంలో ఉన్న పాలకులు రాజకీయావసరాలకు వినియోగించుకున్నట్లు సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు అప్పటి అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు చోటా నాయకులు వారి పార్టీ కార్యకర్తలకే ఇప్పించారని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తోంది. దాంతో గతంలో దీపం గ్యాస్ కనెక్షన్లకుఎంపికైన లబ్ధిదారుల జాబితాలను మరో సారి పరిశీలించాలని అవసరమైతే రద్దు చేయాలని కూడా సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే దీపం గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక ఎన్నికలకు ముందే కొంతవరకు పూర్తయినా పంపిణీకి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదు.
లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు
- నాగేశ్వర్‌రావు, డీఎస్‌ఓ నల్లగొండ
దీపం పథకం గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. జిల్లాకు మంజూరైన కోటాలో కొంతమందిని లబ్ధిదారులను ఎంపిక చేశాం. ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గత ంలో ఎన్నికలకు ముందు కొన్ని గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారు ల ఎంపిక, గ్యాస్ కనెక్షన్ల పంపిణీ విషయాలపై నూతన ప్రభుత్వం ఆదేశా లు జారీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం.