అందుకో ‘నేస్తం’ ఆత్మగౌరవంతో  | CM YS Jagan started YSR EBC Nestham scheme Poor Womens | Sakshi
Sakshi News home page

అందుకో ‘నేస్తం’ ఆత్మగౌరవంతో 

Published Wed, Jan 26 2022 3:19 AM | Last Updated on Wed, Jan 26 2022 4:00 PM

CM YS Jagan started YSR EBC Nestham scheme Poor Womens - Sakshi

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం చెక్కును మహిళలకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అధికారులు

ఇది ఎన్నికల వాగ్దానం కాదు... మేనిఫెస్టోలోనూ చెప్పలేదు. అయినప్పటికీ ఈబీసీ అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. పేదలు వారిలో కూడా ఉన్నారు. పేదవాడు ఎక్కడున్నా పేదవాడే. వారికి మేలు జరగాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నాం. ఆర్ధిక, రాజకీయ, విద్యా సాధికారతకు మద్దతు పలుకుతూ ఒక అన్నగా, తమ్ముడిగా మంచి చేయాలనే ఈ బాధ్యత తీసుకుంటున్నా. గొప్పవాళ్ల జీవిత చరిత్రలు మాత్రమే గొప్పవి కావు. ప్రతి అక్కచెల్లెమ్మ జీవిత చరిత్ర కూడా గొప్పదే. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

సాక్షి, అమరావతి: అగ్రవర్ణ పేద మహిళల ఆర్థిక సాధికారిత, ఆత్మగౌరవం ఇనుమడించేలా ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమం‘త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల వేళ హామీ ఇవ్వకపోయినా, పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపరచనప్పటికీ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రతి అక్కచెల్లెమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, వారి మోములో సంతోషం వెల్లివిరిస్తేనే ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్‌ కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తితో రెండున్నరేళ్లుగా ప్రతి అడుగు ముందుకేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి 3,92,674 మంది అర్హులైన అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా జమ చేశారు. వివిధ జిల్లాల్లో లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలివీ..

రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు 
గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన రాజ్యాంగ నిర్మాతలకు నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నాం. అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. దాదాపు 3.93 లక్షల మంది మహిళలకు రూ.589 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర సామాజిక వర్గాలకు చెందిన  అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తున్నాం. ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు  అందచేస్తాం. మహిళల ఆర్ధిక సాధికారిత, ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుందనే సంకల్పంతో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 

వైఎస్సార్‌ చేయూత ద్వారా.. 
ఇప్పటికే  వైఎస్సార్‌ చేయూత ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 25 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందచేస్తున్నాం. అమూల్, రిలయన్స్, ఐటీసీ, పీ అండ్‌ జీ, అల్లానా, మహీంద్రా, యూనిలీవర్‌ లాంటి ప్రఖ్యాత కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానించి వారికి అండగా నిలిచాం. 

వైఎస్సార్‌ కాపు నేస్తం
వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, ఒంటరి మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తూ 3.27 లక్షల మంది ఆర్ధిక స్వావలంబనకు తోడుగా నిలిచిన ప్రభుత్వం కూడా ఇదే. 60 ఏళ్లు పైబడిన వారికి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక అమల్లో ఉంది. దీనివల్ల ప్రతి నెలా రూ.2,500 చొప్పున ఏటా రూ.30 వేలు అందుతాయి. 

జగనన్న కాలనీలు 
వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. తద్వారా ఆయా కుటుంబాల్లో 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి మేలు జరుగుతోంది. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలైంది. ఈ ఇళ్లన్నీ పూర్తయితే 32 లక్షల కుటుంబాల్లో వెలుగులు వస్తాయి. మొత్తం రూ.2 లక్షల కోట్ల పైచిలుకు ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్లవుతుంది.  

పొదుపు మహిళలకు సున్నా వడ్డీ 
పొదుపు సంఘాల మహిళలకు సున్నావడ్డీ అమలు చేస్తున్నాం. దీనికోసం రూ.2,354 కోట్లు అందచేసి వారికి తోడుగా నిలిచాం. 

విద్యా, వసతి దీవెన 
జగనన్న విద్యాదీవెన ద్వారా పిల్లల చదువుల ఫీజులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 18.81లక్షల మంది తల్లులకు ఈ రెండేళ్లలో రూ.6,258 కోట్లు అందించాం. జగనన్న వసతి దీవెన ద్వారా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రూ.20 వేలు, పాలిటెక్నిక్‌కు రూ.15 వేలు, ఐటీఐకి రూ.10 వేలు, డిగ్రీ చదివే వారికి రూ.20 వేలు చొప్పున రెండేళ్లలో రూ.2,267 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకే అందచేశాం. 
ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన అనంతరం తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌   

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ 
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా 34.20 లక్షల మందికిపైగా బాలింతలు, గర్భిణిలు, 6 నుంచి 72 నెలలున్న చిన్నారులకు ప్రయోజనం చేకూరుతోంది. గతంలో రూ.600 కోట్లు ఇస్తే గొప్ప అనే పరిస్థితుల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లుల ఆరోగ్యాలను మనసులో పెట్టుకుని ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 77 షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో  మరింత మేలు జరగాలని గిరిజన మహిళలకు సంపూర్ణ పోషణ ప్లస్‌ తీసుకొచ్చాం.  

రాజకీయ సాధికారిత 
రాజకీయంగా మహిళా సాధికారితకు కూడా అత్యంత ప్రాధాన్యం కల్పించాం. శాసన మండలి తొలి మహిళా వైస్‌ ఛైర్మన్‌గా సోదరి జకియా ఖానమ్,  తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా పాముల పుష్ప శ్రీవాణి, మహిళా హోంమంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా సీఎస్‌గా నీలం సాహ్ని విధులు నిర్వహించారు. ఇప్పుడు ఆమె రాష్ట్ర తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇవన్నీ మన ప్రభుత్వంలో వేసిన ముందడుగులు. 

నామినేటెడ్‌ పోస్టుల్లోనూ 
నామినేటెడ్‌ పోస్టుల్లో మహిళలకు 51 శాతం ఇచ్చేందుకు ఏకంగా చట్టమే తీసుకొచ్చాం. మొత్తం నియామకాలు జరిగిన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు 202 కాగా 102 మహిళలకే ఇచ్చాం. 1,154 డైరెక్టర్‌ పదవులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వగా అక్కచెల్లెమ్మలకు 586 కేటాయించాం. కార్పొరేషన్‌ చైర్మన్, డైరెక్టర్లు కలిపి 1,356 పదవుల్లో 688 అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పాలక సంస్ధలకు సంబంధించి చైర్మన్, మేయర్ల పదవుల్లో సగానికి పైగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. మనం చేసిన చట్టం ప్రకారం 42 పదవులే ఇవ్వాల్సినా అంతకంటే ఎక్కువగా 52 చైర్మన్ల పదవులు వారికిచ్చాం. 60.47 శాతం మంది అక్కచెల్లెమ్మలే మేయర్లు, కార్పొరేషన్‌ చైర్మన్లు, నగర పంచాయతీల్లో ఉన్నారు. 202 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ౖచైర్మన్‌ పదవుల్లో 101 మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే విప్లవాత్మకంగా 13 జెడ్పీ చైర్మన్లకుగానూ ఏడుగురు అక్కచెల్లెమ్మలే ఎన్నికయ్యారు.  జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించి 26 పోస్టుల్లో 15 మంది మహిళలే ఉన్నారు.  

మహిళల రక్షణకు ‘దిశ’ 
దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, గ్రామ స్ధాయిలోనే మహిళా పోలీసులు.. ఇలా మహిళల రక్షణలో మన రాష్ట్రం దేశంలోనే మిన్నగా ఉంది. ఈరోజు 1,01,19,642 మంది ఫోన్లలో దిశ యాప్‌ ఉంది. అక్కచెల్లెమ్మలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ కదిపితే చాలు నిమిషాల్లో పోలీసులు చేరుకుని తోడుగా నిలుస్తారు. అలాంటి గొప్ప వ్యవస్ధను రాష్ట్రంలో తెచ్చాం. గతంలో బెల్ట్‌ షాపులు గుడి పక్కన, బడి పక్కన కనిపించేవి. ఇవాళ అవి ఎక్కడా లేకుండా కట్టడి చేశాం. ఇదంతా మనసు పెట్టి చేశాం. ప్రతి అక్క, చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా ఆరాటపడుతూ చేశాం.  

అమ్మ ఒడితో తల్లులకు రూ.13,023 కోట్లు 
రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మకు మేలు చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షల మంది తల్లులు, 85 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తూ ఏటా రూ.6,500 కోట్లు అందిస్తున్నాం. ఇలా రెండేళ్లలో రెండు దఫాలుగా ఇప్పటికే రూ.13,023 కోట్లు అందజేశాం. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా 61.73 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా వారిలో 36.70 లక్షల మంది అవ్వలు, అక్కలకు మంచి జరిగేలా ప్రతినెలా రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30 వేలు ఇస్తూ తోడుగా నిలబడగలిగాం. గత సర్కారు డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను మోసగించగా, ఇప్పుడు  వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.25,517 కోట్లను నాలుగు దఫాలుగా అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758 కోట్లు నేరుగా అందించాం. ఫలితంగా నిరర్థక ఆస్తులు, అవుట్‌ స్టాండింగ్‌ ఖాతాలు 0.73 శాతానికి తగ్గిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement