నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం, 2014లో టీడీపీ కూటమి ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజలకు చూపిస్తున్న సీఎం జగన్
బనగానపల్లె సభలో సీఎం జగన్ ధ్వజం
ప్రజలను మోసగించేందుకే మరోసారి జత కలిశాయి
మళ్లీ రంగురంగుల హామీలిచ్చేందుకు తయారయ్యాయి
2014 హామీలను అమలు చేయకుండా వంచించిన చరిత్ర వారిది
చెప్పిన ప్రతి మాటను నెరవేర్చిన విశ్వసనీయత మీ బిడ్డది
అక్కచెల్లెమ్మల నుంచి అవ్వాతాతల దాకా అందరికీ మంచి చేశాం
మీ బిడ్డ మీకు మంచి చేసి ఉంటే మీరే సైనికుడిలా నిలబడండి
‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మూడేళ్లలో 4,95,269 మంది అగ్రవర్ణ పేద మహిళలకు రూ.1,877 కోట్ల మేర లబ్ధి
మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. 2014లో మాదిరిగానే చంద్రబాబు, దత్తపుత్రుడు మళ్లీ బీజేపీతో కలిశారు. నాడు మేనిఫెస్టో హామీలను విస్మరించినట్లుగానే ఇప్పుడు రంగురంగుల హామీలు గుప్పిస్తున్నారు. వారి మోసాలు, దగాను గమనించాలని కోరుతున్నా.చంద్రబాబు పేరు చెబితే వంచన, దత్తపుత్రుడి పేరు చెబితే ఐదేళ్లకోసారి కారును మార్చినట్టుగా భార్యను మార్చే ఓ మోసగాడు, వంచకుడు గుర్తుకొస్తాడు! ఒకరికి విశ్వసనీయత లేదు.. ఇంకొకరికి విలువలు లేవు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రోజు పేదవాడి భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నాయి. పొరపాటు చేయవద్దని, అందరూ బాగా ఆలోచన చేయాలని కోరుతున్నా.
– ముఖ్యమంత్రి జగన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పేదరికానికి కులం ఉండదని, పేదవాడు ఎక్కడున్నా వారికి తోడుగా నిలిచే మనసు ప్రభుత్వ పెద్దలకు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలను ఆదుకునే గుణం, వారికి తోడుగా ఉండాలనే ఆరాటం పాలకులకు ఉండాలన్నారు. ‘నిజానికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలు మన మేనిఫెస్టోలో లేవు. అయినప్పటికీ అగ్రవర్ణ పేదలకు సైతం అండగా ఉండాలని, వారు పేదరికంతో ఇబ్బంది పడే పరిస్థితులు రాకూడదని అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డదే’ అని చెప్పారు.
అగ్రవర్ణ పేదలను ఆర్థికంగా ఆదుకుంటూ ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం కింద 45 – 60 ఏళ్ల మధ్య వయసున్న 4.19 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.629 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్ నొక్కి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మూడేళ్లలో మూడు దఫాల్లో 4,95,269 మందికి రూ.1,877 కోట్ల మేర లబ్ధిని చేకూర్చారు. బనగానపల్లెలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని సభా ప్రాంగణం నుంచే శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. సీఎం జగన్ ఏమన్నారంటే..
42.74 లక్షల మందికి మంచి చేశాం
‘చేయూత’ ద్వారా 33.15 లక్షల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి చేస్తూ 58 నెలలుగా అడుగులు వేశాం. కాపు నేస్తం ద్వారా 4.64 లక్షల మందికి మేలు చేశాం. ఈబీసీ నేస్తం ద్వారా 4.95 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. ఇలా మొత్తంగా 45–60 ఏళ్ల మధ్య వయసున్న 42.74 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేశామని చెప్పేందుకు గర్వపడుతున్నా.
అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ
అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తంతో పాటు చివరకు ఇళ్ల పట్టాలను కూడా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి వారికి ఇళ్లు సైతం కట్టిస్తున్నాం.పిల్లలు పెద్ద చదువులు చదవాలనే ఆకాంక్షతో అమలు చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల డబ్బులు కూడా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోనే వేస్తున్నాం.
అక్క చెల్లెమ్మలు బాగుంటే వారి కుటుంబాలూ బాగుంటాయి, పిల్లల భవిష్యత్తూ బాగుంటుందని ధృఢంగా విశ్వసించాం. ఎక్కడా కులమతాలు, ప్రాంతాలు, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారనేది కూడా చూడలేదు. అర్హత ఉంటే చాలు వారికి తోడు ఉంటూ పారదర్శకంగా మేలు చేస్తూ అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇది. అవ్వాతాతలు, రైతన్నలతో పాటు అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ప్రతి ఒక్కరికీ గుమ్మం వద్దకే పథకాలను, సంక్షేమాన్ని చేరవేస్తున్నాం.
మీ బ్యాంకు ఖాతాలే నిదర్శనం..
గత 58 నెలలుగా మన ప్రభుత్వం చేకూర్చిన లబ్ధికి మీ బ్యాంకు ఖాతాలే నిదర్శనం. మీరంతా ఒక్కసారి బ్యాంకులకు వెళ్లి గత పదేళ్లుగా మీ ఖాతాల స్టేట్‌మెంట్ ఇవ్వమని మేనేజర్లను కోరండి. చంద్రబాబు హయాంలో ఐదేళ్లు, మీ బిడ్డ ప్రభుత్వంలో ఐదేళ్ల డేటాను పరిశీలించండి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయైనా మీ ఖాతాకు పంపించారా? అని అడుగుతున్నా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో ఎన్ని లక్షల రూపాయలు మీ చేతికి వచ్చాయో మీకే కనిపిస్తుంది.
గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు జరుగుతోంది. నాడు ఏ పథకం ఎప్పుడిస్తారో? అసలు ఇస్తారో లేదో తెలియని దుస్థితి. ఇప్పుడు మన గ్రామంలోనే ఓ సచివాలయ వ్యవస్థ వచ్చింది. అందులో మన ఊరి పిల్లలే వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. అది ఆదివారమైనా, సెలవు రోజైనా వలంటీర్ మీ ఇంటి వద్దకే వచ్చి మీ మనవడిగా, మనవరాలిగా తోడుగా ఉంటూ లంచాలు, వివక్ష లేకుండా సేవలు అందిస్తున్నాడు. ప్రతి అక్కచెల్లెమ్మ ఇవన్నీ గమనించాలని కోరుతున్నా.
మీరే చూడండంటూ గడప గడపకూ..
గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2.70 లక్షల కోట్లను మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి జమ చేశారు. ఇందులో రూ.1.89 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలను మీ బిడ్డ అమలు చేశాడు. మీ ఇంటికి వచ్చి మేనిఫెస్టో చూపించి గత ఎన్నికలప్పుడు జగనన్న ఏం చెప్పాడు? ఈ 58 నెలల్లో ఎన్ని చేశాడు? మీరే టిక్ పెట్టండి అని ధైర్యంగా గడప తొక్కే పరిస్థితి ఏ పార్టీకైనా ఉందా? అది ఒక్క వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉంది.
మ్యారేజ్ స్టార్, మోసగాడు, వంచకుడు..
ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం, ఆ తర్వాత చెత్తబుట్టలో పడేసి మోసం చేయడం అనే సంప్రదాయాన్ని మార్చి విశ్వసనీయత అనే పదానికి అర్థం తేవడం కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే వంచన గుర్తుకొస్తుంది. పొదుపు మహిళలకు ఆయన చేసిన దగా గుర్తుకొస్తుంది.
చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి పనిగానీ పథకంగానీ గుర్తురాదు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక మోసగాడు, ఐదేళ్లకోసారి కారును మార్చినట్టు భార్యను మార్చే మ్యారేజ్ స్టార్, మోసగాడు, వంచకుడు గుర్తుకొస్తాడు. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రోజు మీ బిడ్డ మీదకు కాదు.. పేదవాడి భవిష్యత్‌పై యుద్ధానికి వస్తున్నాయి.
మోసగాళ్లకు బుద్ధి చెప్పండి..
మీ బిడ్డకు, చంద్రబాబు ప్రభుత్వానికి తేడాను గమనించాలని అందరినీ కోరుతున్నా. 99 శాతం హామీలను నెరవేర్చి మరోసారి మీ ఆశీస్సులు కోరుతున్న మీబిడ్డ ఒకవైపున ఉంటే మరోవైపున దగాకోర్లు, పచ్చి మోసగాళ్లు, మాయ మాంత్రికులున్నారు. ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేతకాదు. మీ బిడ్డ మిమ్మల్ని కోరేది ఒక్కటే! మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అనేది మాత్రమే ఆలోచించండి. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీరే సైనికుల్లా, స్టార్ క్యాంపెయినర్లుగా మీ బిడ్డకు అండగా నిలవండి. మోసగాళ్లకు ఓటు అనే దివ్యాస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పండి.
2014 హామీలను బాబు నెరవేర్చారా?
ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి 2014లో కూడా ఇప్పటి మాదిరిగానే మోసపూరిత హామీలిచ్చారు. ముగ్గురూ ఒక్కటై వేదికపై కూర్చున్నారు. కూటమిగా ఏర్పడ్డారు. ఇదే పెద్దమనిషి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోపై సంతకం పెట్టి మరీ ప్రతీ ఇంటికి పంపించారు. రైతులకు రుణమాఫీపై తొలి సంతకం చేస్తామన్నారు. రూ.85,612 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టారు.
పొదుపు సంఘాల మహిళలకు రూ.14,205 కోట్లు పూర్తిగా మాఫీ చేస్తామని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని నమ్మించి విజయవాడ నడిబొడ్డున కాల్‌మనీ సెక్స్ రాకెట్ నడిపారు. ఆడపిల్ల పుడితే ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నారు. మరి ఒక్కరికైనా ఖాతాల్లో డిపాజిట్ చేశారా? ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
మరి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఒక్కరికైనా ఇచ్చారా? కరపత్రాలు చూపించి రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్‌సిటీ నిర్మిస్తానన్నారు. 2014 మేనిఫెస్టో పేజీ నెంబర్ 16, 17లో అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల్లో మచ్చుకు 9 మాత్రమే మీతో పంచుకుంటున్నా. వాటిల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా? ఇంత దారుణంగా మోసం చేస్తున్న వ్యక్తులు మరోసారి రంగు రంగుల హామీలతో వంచనకు సిద్ధమయ్యారు.
కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, కలెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మీ అందరికీ ఒక విన్నపం..
‘మీ అందరికీ ఒక విన్నపం! ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది. అందువల్ల బటన్ నొక్కటం పూర్తి చేస్తున్నాం. డబ్బులు వచ్చే కార్యక్రమం కాస్త అటూ ఇటుగా జరుగుతుంది. ఎవరూ ఆందోళన పడొద్దు. త్వరలోనే డబ్బులు పడతాయి. ఈ రెండు వారాల పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దు. ఏబీఎన్, టీవీ–5 చూడొద్దు. చెడిపోయిన మీడియా వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. మంచి జరిగితే దాన్ని కూడా వక్రీకరించే చెడిపోయిన, కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఏటా రూ.15 వేలు చొప్పున మూడు దఫాలుగా..
ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు మంచి చేసేలా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నాం. దీని ద్వారా 45–60 ఏళ్ల మధ్య వయసున్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణ పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ ఏటా రూ.15 వేల చొప్పున ఖాతాల్లో జమ చేసి తోడుగా ఉంటున్నాం.
ఈ ఏడాది కొత్తగా ఆర్థిక సాయం పొందుతున్నవారు 65,618 మంది కాగా రెండు దఫాలు తీసుకున్న వారు 1,07,824 మంది ఉన్నారు. మూడో విడతలో 3,21,827 మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూరింది. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి బటన్ నొక్కడం ఈ విడతతో ఆపేస్తున్నాం. మళ్లీ మీకు మరింత మంచి చేసేలా దేవుడు, మీరు ఆశీర్వదించాలని కోరుతున్నా.
అదనపు ఆదాయం సమకూరేలా..
చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు మంచి చేశాం. కాపు నేస్తం ద్వారా కాపులకు అండగా నిలిచి ఆర్థిక సహకారం అందిస్తున్నాం. అలాగే ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కులాల్లోని అక్క చెల్లెమ్మలకు కూడా అండగా నిలుస్తున్నామని సంతోషంగా చెబుతున్నా. ఈ డబ్బులతో వారు వివిధ వ్యాపారాలు నిర్వహించుకోవడం ద్వారా ప్రతి నెలా రూ.6 వేల నుంచి రూ.10 వేలు అదనంగా ఆదాయం సమకూరుతుందనే ఉద్దేశంతో అడుగులు వేగంగా ముందుకు వేశాం.
2014లో చంద్రబాబు ‘నవ’ మోసాలివీ..
► మద్యం బెల్ట్‌షాపులు రద్దు చేస్తూ రెండో సంతకం
► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ
► పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం ద్వారా బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్
► పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీలకు రూ.10 వేలు ఆర్థిక సాయం
► పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు
► ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 వంట గ్యాస్ సిలిండర్లపై రూ.1,200 సబ్సిడీ. ఐదేళ్లలో మొత్తం రూ.6 వేలు సబ్సిడీ
► బడికి వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ
► కుటీరలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వావలంబన
► మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు.
Comments
Please login to add a commentAdd a comment