సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలమైన తమకు ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ఎటువంటి తప్పులేదని గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరికి చెందిన మహిళలు హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో ఇంటి స్థలాల పట్టాల మంజూరు విషయంలో ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని అభ్యర్థిస్తూ దాదాపు 450 మంది మహిళలు హైకోర్టులో మంగళవారం వేర్వేరుగా రెండు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయతలపెట్టిన పేదలందరికీ ఇళ్లు పథకం వల్ల తమలాంటి లక్షల మంది నిరుపేదలు లబ్ధి పొందుతారని వారు పిటిషన్‌లలో పేర్కొన్నారు. తమకెవ్వరికీ శాశ్వత నివాసాలు లేవని వివరించారు.
చట్ట నిబంధనలను అనుసరించే జీవో
సీఆర్‌డీఏ చట్ట నిబంధనలను అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాల పట్టాల మంజూరు నిమిత్తం గత నెల 25న జీవో 107 జారీ చేసిందని మహిళలు కోర్టు దృష్టికి తెచ్చారు. నిడమర్రు గ్రామంలో 250.48 ఎకరాల్లో ఇంటి స్థలాల పట్టాల మంజూరు కోసం 10,247 మంది అర్హులైన లబ్ధిదారులతో అధికారులు ఓ జాబితా కూడా సిద్ధం చేశారని పేర్కొన్నారు. అలాగే తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో 11,300 మంది అర్హుల జాబితాను సిద్ధం చేశారన్నారు. వీరికి నవులూరులో 215 ఎకరాల్లో, కృష్ణాయపాలెంలో 37 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారని తెలిపారు.
సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం.. రాజధాని ప్రాంతం మొత్తం ఏరియాలో 5 శాతం భూమిని పేదల కోసం కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వారు వివరించారు. అది కూడా రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా కేటాయించవచ్చునని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, అందువల్ల తమ వాదనలు కూడా విని.. ఆ తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. లేని పక్షంలో తమకు తీరని నష్టం జరుగుతుందన్నారు.
మాకు గూడు లేదు.. ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వండి
Published Wed, Mar 4 2020 4:34 AM | Last Updated on Wed, Mar 4 2020 4:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment