
సాక్షి, న్యూఢిల్లీ: రైతు ప్రయోజనాల పరిరక్షణ, సంక్షేమం కోసం జాతీయ రైతు కమిషన్ ఏర్పాటుకు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రతిపాదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. రైతు ప్రతినిధులతో ఏర్పాటు చేసే ఈ కమిషన్ రైతాంగ సంక్షేమం, సంరక్షణ కోసం చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేసేలా పర్యవేక్షించే అధికారం కమిషన్‌కు ఉంటుందన్నారు. దీంతో పాటు ప్రాక్టీసు చేసే న్యాయవాదుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తగిన పథకాలకు రూపకల్పన చేయడం, న్యాయవాదుల సామాజిక భద్రత ఫండ్‌ను నెలకొల్పేందుకు వీలు కల్పించేలా 1961 నాటి అడ్వొకేట్స్ చట్టాన్ని సవరించాలని కోరుతూ రెండో బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే మహిళల నుంచి గొలుసులు, ఆభరణాలు, పర్సులు ఇతర విలువైన వస్తువులను దొంగిలించే చర్యను భారతీయ శిక్షా స్మృతిలో విస్పష్టమైన నేరంగా నిర్వచిస్తూ ఈ నేరానికి పాల్పడిన వారికి 5 నుంచి 10 ఏళ్లపాటు కఠిన జైలు శిక్ష విధించేలా 1960 నాటి భారతీయ శిక్షా స్మృతిని సవరించాలని ప్రతిపాదిస్తూ మూడో బిల్లును ఆయన ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment