
కొలంబో: శ్రీలంకలో చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి కారకులైన రాజపక్స కుటుంబ పాలనపై ఆగ్రహంతో వెల్లువెత్తిన దేశవ్యాప్త నిరసనలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. రాజధానితో పాటు పలుచోట్ల ఏర్పాటైన నిరసన శిబిరాలను ఆందోళనకారులు మంగళవారం నాటికి పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో 123 రోజుల ఆందోళనలకు తాత్కాలికంగా తెర పడ్డట్టయింది.
మరోవైపు, నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధశారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే స్వతంత్ర ఎన్నికల సంఘం సభ్యులు, అవినీతి విచారణ అధికారులు, పోలీస్ తదితర ఉన్నతోద్యోగుల నియామకాధికారం అధ్యక్షుడి నుంచి రాజ్యాంగ మండలికి దఖలు పడుతుంది.