Rajapaksa
-
SL vs WI: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లపై వేటు!
వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు లంక స్టార్ ప్లేయర్లు దాసున్ షనక, దుష్మంత చమీరా దూరమయ్యారు. ఈ ఏడాది జూలైలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వీరిద్దరూ భాగమయ్యారు. గత సిరీస్‌లో ఈ సీనియర్ ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలోనే వారిని సెలక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏడాది తర్వాత మిడిలార్డర్ బ్యాటర్ భనుక రాజపాక్సకు లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు.ఈ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ అసలంక సారథ్యం వహించనున్నాడు. ఆక్టోబర్ 13 నుంచి దంబుల్లా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం విండీస్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.శ్రీలంక టీ20 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండిమాల్, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, జెఫ్రీ వాండర్స్, చైమీ వాండర్సే మతీషా పతిరానా, బినూర ఫెర్నాండో, అసిత ఫెర్నాండో. -
Rajiv Gandhi Case: ఆ ఫొటోగ్రాఫర్ ఇంట్లో దొరికిన రసీదే.. హంతకులను తెరపైకి తెచ్చిందా?!
లంక పరిణామాలు మన దేశంలో భారీ మార్పులు తీసుకువచ్చాయి. ప్రభాకరన్‌ను లంక సైన్యం మట్టుపెట్టడం, ఎల్టీటీఈ తన శ్రేణులన్నీ కోల్పోవడంతో జాఫ్నాతో పాటు ఉత్తర ప్రాంతమంతా లంక సైన్యం ఆధీనంలోకి వచ్చింది. అంతర్యుద్ధం ముగిసిందని అప్పటి అధ్యక్షుడు రాజపక్సే ప్రకటించారు. లంకలో తమిళుల ప్రాభవం వేగంగా కోల్పోవడంతో ఇక్కడ ఖైదీల మీద వీపరీతంగా సానుభూతి పెరిగింది. ఈలోగా జైల్లో ఉన్న ఏడుగురు ఖైదీలు తమను క్షమించమంటూ అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతిభా పాటిల్ దీన్ని నిర్దంద్వంగా తోసిపుచ్చారు. ఈ లోగా మరో పిటిషన్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కింది. వాదోపవాదాలు, అప్పటి పరిస్థితుల దృష్ట్యా మద్రాస్ హైకోర్టు ఉరి శిక్షపై స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎల్టీటీఈ ఖైదీలకు పెద్ద ఊరట. ఉరిశిక్ష స్థానంలో యావజ్జీవ శిక్షను సూచించింది సుప్రీంకోర్టు. ఈలోగా రాజీవ్ గాంధీ కుటుంబానికి తమిళుల వినతులు వెల్లువెత్తాయి. నేరుగా రాజీవ్ కూతురు ప్రియాంక, కొడుకు రాహుల్ గాంధీ నేరస్థులను జైల్లో కలిశారు. పరిస్థితి ఎందాక వెళ్లిందంటే మొత్తం సమాజం నేరస్థులను క్షమించారా అన్నంత చర్చకు దారి తీసింది. ఈలోగా తమిళనాడు సీఎం జయలలిత ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. 23ఏళ్లకు పైగా జైల్లో ఉన్న అందరూ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఢిల్లీలో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దేశానికి అత్యున్నత పదవుల్లో ఒకటయిన ప్రధానిగా పని చేసిన రాజీవ్‌గాంధీ హత్యకు గురయితే, దానికి కారకులను ఓ రాష్ట్రం ఎలా విడిచిపెడతారన్న చర్చ జరిగింది. ఇదే విషయం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత తమిళనాడు నిర్ణయంపై స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. జయ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాజీవ్ హంతకుల విడుదలపై నిర్ణయం తీసుకునే హక్కు తమిళనాడు ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ముగ్గురు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. జైల్లో నుంచి బయటపడతామని కోటి ఆశలు పెట్టుకున్న ఎల్టీటీఈ ఖైదీలు సుప్రీం తీర్పుతో నిరాశకు గురయ్యారు. అయితే వారిలో ఆశ మాత్రం చావలేదు. దానికి కారణం తమిళులు, వారి రాజకీయాలు. చదవండి: (రాజీవ్ హత్య.. సినిమాను మించే ట్విస్ట్‌లు.. అసలు ఆనాడేం జరిగింది?) నాడు రాజీవ్ హంతకులను పట్టుకోవడానికి కార్తికేయన్ సారధ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచిత్ర పరిస్థితుల మధ్య పలు రకాల అవాంతరాల నడుమ సిట్ పట్టువదలకుండా దర్యాప్తు కొనసాగించింది. విమర్శలు వచ్చినా, సమస్యలు ఎదురైనా ఢీలా పడకుండా విచారణ సాగించిన సిట్ ఈ దారుణానికి పాల్పడింది ఎల్టీటీఈ అని తేల్చింది. ఫోటోగ్రాఫర్ హరిబాబు ఇంట్లో దొరికిన రసీదును ఆధారంగా చేసుకొని తీగ లాగిన సిట్.. హంతకుల పేర్లను తెరపైకి తెచ్చింది. 1991.. దేశమంతటా అస్థిర వాతావరణం నెలకొన్న సమయం. కేంద్రంలో ప్రభుత్వాలు ఒకదాని వెంట ఒకటి కూలిపోయిన తరుణం. అలాంటి సమయంలో లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రచార భారం రాజీవ్‌గాంధీపై పడింది. అప్పటికే దేశమంతా తిరుగుతున్న ఆయన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారంపై దృష్టి పెట్టిన ఆయన అందుకు తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 1991, మే 20 నుంచి 22 వరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారం ముగించుకొని 22 సాయంత్రం వరకైనా రాజీవ్ ఢిల్లీకి చేరుకోవాలి. ఇదీ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ పర్యటన వరకు అన్నీ అనుకున్న ప్రకారం జరిగాయి. కానీ 21న పరిస్థితి మొత్తం మారిపోయింది. -
లంకలో నిరసనలకు తెర
కొలంబో: శ్రీలంకలో చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి కారకులైన రాజపక్స కుటుంబ పాలనపై ఆగ్రహంతో వెల్లువెత్తిన దేశవ్యాప్త నిరసనలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. రాజధానితో పాటు పలుచోట్ల ఏర్పాటైన నిరసన శిబిరాలను ఆందోళనకారులు మంగళవారం నాటికి పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో 123 రోజుల ఆందోళనలకు తాత్కాలికంగా తెర పడ్డట్టయింది. మరోవైపు, నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధశారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే స్వతంత్ర ఎన్నికల సంఘం సభ్యులు, అవినీతి విచారణ అధికారులు, పోలీస్ తదితర ఉన్నతోద్యోగుల నియామకాధికారం అధ్యక్షుడి నుంచి రాజ్యాంగ మండలికి దఖలు పడుతుంది. -
Gotabaya Rajapaksa: సింగపూర్‌లో ‘గొటబయ’కు ఊహించని షాక్..!
సింగపూర్: శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రజాగ్రహంతో దేశం విడిచిన గొటబయ రాజపక్స ప్రస్తుతం సింగపూర్‌లో తలదాచుకుంటున్నారు. అయితే.. అక్కడా ఊహించని షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రజాహక్కుల గ్రూప్ గొటబయపై క్రిమినల్ కేసు పెట్టింది. యుద్ధ నేరాల ఆరోపణలతో గొటబయను అరెస్ట్ చేయాలంటూ.. సింగపూర్ అటార్నీ జెనరల్‌కు 63 పేజీల ఫిర్యాదును అందజేశారు ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్(ఐటీజేపీ) న్యాయవాదులు. 2009లో జరిగిన అంతర్యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న రాజపక్సే.. జెనీవా ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. అవి అంతర్జాతీయ న్యాయపరిధిలో భాగంగా సింగపూర్ దేశీయ ప్రాసిక్యూషన్‌కు లోబడిన నేరాలుగా పేర్కొన్నారు. పిటిషన్ ప్రకారం.. అంతర్యుద్ధం సమయంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టం, అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలను గొటబయ ఉల్లంఘించారు.‘అందులో హత్య, ఉరి తీయించటం, వేధించటం, అమానవీయంగా కొట్టటం, అత్యాచంర, ఇతర లైంగిక వేధింపులు, స్వేచ్ఛను హరించటం, మానసికంగా క్షోభకు గురిచేయంట వంటివి ఉన్నాయి. ఆర్థిక మాంద్యంతో ప్రభుత్వం పతనాన్ని చూసింది, అయితే శ్రీలంకలో సంక్షోభం నిజంగా మూడు దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్రితం జరిగిన తీవ్రమైన అంతర్జాతీయ నేరాలతో ముడిపడి ఉంది. ఈ ఫిర్యాదు కేవలం అవినీతి, ఆర్థిక అవకతవకల గురించే కాదు.. తీవ్ర నేరాలకు బాధ్యత వహించాలని నమోదు చేశాం.’ అని ఐటీజేపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోస్మిన్ సూకా పేర్కొన్నారు. గొటబయ రాజపక్సను అరెస్ట్ చేసి యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని కోరింది ఐటీజేపీ. 1989లో ఆయన ఆర్మీ కమాండర్‌గా ఉన్నప్పుడు.. సుమారు 700 మంది కనిపించకుండా పోయారని ఆరోపించింది. ముఖ్యంగా రక్షణ శాఖ సెక్రెటెరీగా ఉన్నప్పుడు ఆ నేరాలు మరింత పెరిగాయని తెలిపింది. తన కింది అధికారులకు టెలిఫోన్ ద్వారా నేరుగా ఆదేశాలు ఇచ్చి ప్రజలపై దాడి చేయించే వారని ఆరోపించింది. ఇదీ చదవండి: కారుతో ఢీకొట్టి చోరీకి పాల్పడిన దుండగులు.. వీడియో వైరల్! -
శ్రీలంక: రాజపక్స కుటుంబానికి బిగ్ షాక్
కోలంబో: ఆర్థికంగా లంకను దిగజార్చి తీవ్ర సంక్షోభంతో.. ఆపై రాజకీయ సంక్షోభంతో ప్రజానిరసనలతో అట్టుడికిపోయేలా చేసిన రాజపక్స కుటుంబానికి భారీ షాక్ తగిలింది. మాజీ ప్రధాని మహీంద రాజపక్స, సోదరుడు బాసిల్ రాజపక్సలను, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులను దేశం విడచి వెళ్లరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పటికే రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ‘రాజీనామా’ భయంతో దేశం విడిచిపారిపోయాడు. ఆపై సింగపూర్ చేరుకున్నాక అక్కడి నుంచి స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. దీంతో ఇవాళ లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే.. తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చీఫ్ జస్టిస్ జయనాథ జయసూర్య దగ్గరుండి మరీ ప్రమాణం చేయించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు గనుక రాజీనామా చేస్తే ప్రధాని పదవిలో ఉన్నవాళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. #WATCH | Ranil Wickremesinghe sworn in as Acting-President a short while ago by Sri Lankan Chief Justice Jayantha Jayasuriya#SriLanka pic.twitter.com/odjNmfd4cf — ANI (@ANI) July 15, 2022 ఇప్పటికే గోటబయ దేశం విడిచి వెళ్లారని, కాబట్టి మహీంద బాసిల్లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని, ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిగ్గా తీవ్ర నిరసనల నడుమే ప్రధాని హోదాలో కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నించిన మహీంద రాజపక్స.. చివరకు రాజీనామా చేసి అక్కడే అజ్ఞాతంలో ఉండిపోయారు. కొత్త కేబినెట్ గనుక కొలువుదీరితే మాత్రం.. అవినీతి, ఇతరత్ర ఆరోపణలపై రాజపక్స కుటుంబం విచారణ.. రుజువైతే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. Sri Lanka's Supreme Court today issued an interim order preventing former Prime Minister Mahinda Rajapaksa and former Minister Basil Rajapaksa from leaving the country without the court's permission until July 28th: Sri Lanka's DailyMirror (File photos) pic.twitter.com/xg290lfmLX — ANI (@ANI) July 15, 2022 కుటుంబ పాలనతో ద్వీప దేశాన్ని సర్వనాశనం చేశారని రాజపక్స కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు లంక ప్రజలు. గోటబయ రాజపక్స(72) శ్రీలంకకు అధ్యక్షుడిగా, అతని అన్న మహీంద రాజపక్సా ప్రధానిగా, మరో సోదరుడు బసిల్ రాజపక్సా ఆర్థిక శాఖను, పెద్దన్న చామల్ రాజపక్సా వ్యవసాయ శాఖ మంత్రిగా, మరో బంధువు నమల్ రాజపక్సా క్రీడాశాఖ మంత్రిగా కీలక పదవులను నిర్వహించారు. -
మాల్దీవుల్లో ‘గొటబయ’కు నిరసనల సెగ.. మళ్లీ ఏ దేశం వెళ్తారో?
మాలే: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజాగ్రహంతో అట్టుడుకుతోంది శ్రీలంక. ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజామునే దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. అయితే.. అక్కడ కూడా గొటబయకు నిరసనల సెగ తగిలింది. పదుల సంఖ్యలో అక్కడి శ్రీలంక పౌరులు ఆందోళన చేపట్టారు. గొటబయకు మాలే ఒక సురక్షితమైన ప్రాంతం కాకూడదని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపాలని అక్కడి ప్రజలను కోరారు. శ్రీలంక జాతీయ జెండాలు, ప్లకార్డులతో రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. ' ప్రియమైన మాల్దీవుల స్నేహితులారా.. క్రిమినల్స్‌కు ఈ ప్రాంతం సురక్షితమైనదిగా మారకుండా మీ ప్రభుత్వానికి తెలియజేయండి' అని బ్యానర్ ప్రదర్శించారు. మరోవైపు.. మిలిటరీ విమానంలో వెలనా అంతర్జాతీయ విమానంలో దిగిన రాజపక్సకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేస్తున్న వీడియోలను మాల్దీవులకు చెందిన మీడియాలు ప్రసారం చేశాయి. అలాగే.. మాలేలోని కృత్రిమ బీచ్ ప్రాంతంలో పలువురు శ్రీలంక పౌరులు నిరసనలు చేపట్టగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. సింగపూర్‌కు గొటబయ..! శ్రీలంక నుంచి పరారై మాల్దీవులకు చేరిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో తలదాచుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. అక్కడి నుంచి యూఏఈ లేదా సింగపూర్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. 'ఆయన రెండు దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. ఆ దేశాల్లోనూ శ్రీలంక పౌరులు ఉన్నందున భద్రతాపరమైన సమస్యలు తలెత్తనున్నాయి.' అని శ్రీలంకకు చెందిన భద్రతా విభాగం అధికారి ఒకరు తెలిపారు. గొటబయ రాజపక్సను దేశంలోకి అనుమతించటాన్ని వ్యతిరేకించింది మాల్దీవులకు చెందిన ప్రతిపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ. రాజపక్సను అనుమతించటం ద్వారా శ్రీలంకలోని తమ స్నేహితులకు ద్రోహం చేస్తున్నామని పీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు. మరోవైపు.. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక పౌరులు మాల్దీవుల్లోని విద్య, ఆరోగ్య, ఆతిథ్య రంగాల్లో పని చేస్తుండగా.. మాల్దీవుల పౌరులు సైతం పెద్ద సంఖ్యలోనే శ్రీలంకలో ఉన్నారు. ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: దేశం విడిచిన లంకాధ్యక్షుడు.. అంతా ఇండియానే చేసిందని వదంతులు.. హైకమిషన్ రియాక్షన్ ఏంటంటే? -
చరిత్ర వింతల్లో ఇదొకటి!
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ‘బాంగ్‌బాంగ్’ మార్కోస్ ఎన్నికవడం మామూలుగానైతే పెద్ద విశేషం కాదు. కానీ ఆయన ఆ దేశపు నియంత, అత్యంత క్రూరమైన పాలకుడిగా పేరుమోసిన ఫెర్డినాండ్ మార్కోస్ కుమారుడు కావడం వల్ల అది పెద్ద విశేషం అయికూర్చుంది. మూడున్నర దశాబ్దాల క్రితం ఫిలిప్పీన్స్ ప్రజలను ఎన్నో రకాలుగా హింసించి, వేలాది మందిని జైళ్లలో పెట్టి, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫెర్డినాండ్ మార్కోస్ చివరకు ఎంతో సంపదతో దేశం వదిలి పారిపోయారు. సహజంగానే మార్కోస్ కుటుంబం పట్ల ఫిలిప్పీన్స్ ప్రజల్లో ద్వేషం, అనంగీకారం ఉంటుంది. కానీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన కుమారుడు అధ్యక్షుడిగా గెలవడం అనేది దిగ్భ్రమ కలిగించే వాస్తవం. ఏడాది క్రితం వరకూ మార్కోస్ పునఃపాలన ఊహించలేనిదీ, బహుశా ఊహకే అందనిదీ! అయితే ‘బాంగ్‌బాంగ్’ అనే ముద్దుపేరుతో ప్రసిద్ధులైన జూనియర్ మార్కోస్ దాదాపుగా అసాధ్యం అనుకున్న దానిని కళ్లెదుట సాక్షాత్కరింపజేశారు. ఆయన రాజకీయంగా ప్రజలకు ప్రియమైనవాడు కావడం అనేది ఒక ప్రత్యేకమైన అధ్యయనాంశం. ముప్పై ఆరేళ్లన్నది సుదీర్ఘమైన కాలం అని నాకు తెలుసు. ఫిలిప్పీన్స్ ప్రస్తుత జనాభాలో 70 శాతం మంది ప్రజలు 1986లో పుట్టే ఉండరు. ఆ ఏడాదికి ముందరి వరకు ఫిలిప్పీన్స్‌కి రెండు దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా ఉన్న ఫెర్డినాండ్ మార్కోస్ అవినీతికీ, దోపిడీకీ, క్రూర త్వానికీ పేరు మోసిన పాలక నియంత. తన హయాంలోని ఇరవై ఏళ్లలో 14 ఏళ్లు సైనిక పాలనతోనే దేశాన్ని దడ పుట్టించేలా నడిపించాడు. ఇంత సుదీర్ఘకాలం తర్వాతే అయినప్పటికీ మళ్లీ ఇప్పుడు ఆ తండ్రి కుమారుడే భారీ మెజారిటీతో ఫిలిప్పీన్స్ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ ద్వీప సమూహానికి కొత్త అధ్యక్షుడవడం చూసి నేను ఒక గొప్ప దిగ్భ్రమతో నిర్ఘాంతపోతున్నాను. చరిత్ర వింతల్లో ఇదొకటి అనుకోవాలి. ఏడాది క్రితం వరకూ మార్కోస్ పునఃపాలన ఊహించ లేనిదీ, బహుశా ఊహకే అందనిదీ. అయితే ‘బాంగ్‌బాంగ్’ అనే ముద్దు పేరుతో ప్రసిద్ధులైన జూనియర్ మార్కోస్ దాదాపుగా అసాధ్యం అనుకున్న దానిని కళ్లెదుట సాక్షాత్కరింపజేశారు. మొదట నేను 1986కి తిరిగి వెళ్లి, అక్కడి నుంచి ముందు కొస్తాను. నాలుగోసారి పదవిలో కొనసాగేందుకు మార్కోస్, అతడి ప్రత్యర్థిగా బరిలోకి దిగిన కొరజాన్ అక్వినో ఒకరితో ఒకరు తలపడుతున్న అధ్యక్ష ఎన్నికల సమయం అది. కొరజాన్ ప్రియనామం ‘కోరీ’. అప్పటికి మూడేళ్ల క్రితం కోరీ భర్త బెనిగ్నో... మార్కోస్‌ను ఎదుర్కొనేందుకు ప్రవాసం నుంచి ఫిలిప్పీన్స్‌లో దిగీ దిగగానే మనీలా విమానాశ్రయంలో రన్‌వే మీదే హత్యకు గురయ్యారు. భర్త వదిలిపెట్టి వెళ్లిన సవాలును కోరీ స్వీకరించి ఎన్నికల్లో నిలబడ్డారు. కోరీకి ప్రజాదరణ ఉన్నప్పటికీ భారీగా రిగ్గింగ్ జరిగి, మార్కోస్‌కు అనుకూలంగా మోసపూరితమైన ఫలితాలు వచ్చాయి. కొన్ని గంటల్లోనే ఫిలిప్పీన్స్ బద్దలైంది. మార్కోస్‌కు వ్యతిరేకంగా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. ‘కార్డినల్ సిన్’గా ప్రసిద్ధులైన జైమ్ సిన్ ఆ ప్రజా నిరసనలకు నాయకత్వం వహించారు. మార్కోస్ రక్షణ మంత్రి, సైన్యాధినేత కూడా మార్కోస్ని విడిచి పెట్టారు. నాటి ప్రజా విప్లవం ‘పీపుల్స్ పవర్’గా గుర్తింపు పొందింది. ఉరుములా ఉరిమి, పిడుగులా దేశాన్ని దద్దరిల్లించిన తిరుగుబాటు అది. ఫిలిప్పీన్స్‌లో ఏం జరగబోతున్నదోనని ప్రపంచం మూడు రోజుల పాటు ఊపిరి తీసుకోవడం కూడా మాని ఆతురుతతో ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఫిబ్రవరి 26న మార్కోస్ దేశం విడిచి, హవాయి పారిపోయి అక్కడ తల దాచుకున్నారు. ఆ కుటుంబం హవాయికి ఏమేం తీసుకెళ్లిందో, ఫిలిప్పీన్స్‌లో ఏమేం వదిలి వెళ్లిందో చూడండి. 22 చెక్క పెట్టెలు, 12 సూట్‌కేసులు, లెక్కలేనన్ని భోషాణాలతో వారు హవాయి వెళ్లినట్లు 23 పేజీల యు.ఎస్. కస్టమ్స్ రికార్డుల్లో నమోదై ఉంది. దుస్తులతో నిండిన 67 అరలు, 413 రకాల బంగారు ఆభరణాలు, అమూల్యమైన రాళ్లను పొదిగిన 70 జతల చెవి దద్దులు ఆ పెట్టెల్లో ఉన్నాయి. ఇంకా.. ‘మా 24వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నా భర్తకు..’ అని రాసి ఉన్న 24 బంగారు ఇటుకలు, 717 మిలియన్ డాలర్ల నగదు, ప్యాంపర్స్ డైపర్ ప్యాకెట్లలో దాచిన 4 మిలియన్ల డాలర్ల విలువైన రత్నాలు, 65 సీకో, కార్టియర్ వాచీలు; యు.ఎస్., స్విట్జర్లాండ్, కేమాన్ దీవులలోని బ్యాంకు ఖాతాలలో జమ చేసిన 124 మిలియన్ డాలర్ల నగదు తాలూకు రసీదులు ఉన్నాయి. ఇక వదిలేసి వెళ్లినవి... భార్య ఇమెల్డా మార్కోస్‌కు చెందిన 3,000 జతల బూట్లు, మింక్ జంతువు చర్మంతో అల్లిన 15 ఖరీదైన కోట్లు, అత్యాధునికమైన 508 గౌన్లు.. ఒక్కసారైనా తీసి వాడని ఇవన్నీ కూడా మలాకాన్యాంగ్ ప్యాలెస్‌లో ‘బెర్గ్‌డోర్ఫ్ గుడ్‌మ్యాన్’ డిపార్ట్మెంట్ స్టోర్ లేబుళ్లతో సహా ఉండిపోయాయి. 1965 నుండి 1986 వరకు మార్కోస్ అధ్యక్షుడిగా ఉన్న 20 ఏళ్ల కాలంలో 70,000 మంది జైలు పాలయ్యారనీ, 34,000 మంది చిత్రహింసలకు గురయ్యారనీ, 3,240 మంది హతులయ్యారనీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఫిలిప్పీన్స్‌లోని పరిశోధనాత్మక వార్తాపత్రిక ‘బులాత్లాట్’ వార్తాపత్రిక 1,20,000 మందిని నిర్బం ధించారని పేర్కొంది. మార్కోస్ 1989లో మరణించారు. ఇమెల్డా (92) ప్రస్తుతం జీవించి ఉన్నారు. మొత్తం 10 బిలియన్ డాలర్ల అక్రమ సంపాదనకు సంబంధించిన పలు నేరారోపణలు ఆమెపై ఉన్నాయని బి.బి.సి. నివేదించింది. మార్కోస్ వెనుక ఇంత చరిత్ర ఉన్నప్పుడు 1980లు, 90ల కాలంలో ఆయనపై, ఆయన కుటుంబంపై ఫిలిప్పీన్స్ ప్రజల్లో ద్వేషం, అనంగీకారం ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అయితే ఈ రోజున ఆయన పేరున్న ఆయన తనయుడు రాజకీయంగా ప్రజలకు ప్రియమైనవాడు అయ్యారు. అదెలా జరిగింది? చాలామంది అడిగే ప్రశ్న, చాలాకాలంగా చర్చనీయాంశమైన ప్రశ్న. ఇందుకు నేను... తొందరపాటు, సంకోచం, అసంపూర్ణతలతో కూడిన మూడు సమాధానాలను సూచిస్తాను. మొదటిది – మార్కోస్ దశాబ్దాల నిరంకుశత్వ పాలనలో సైతం ఆయనకు వెన్నుగా ఉన్న ఇలోకోస్ నార్టే ప్రావిన్సు నేటికీ ఆ కుటుంబానికి పెట్టని కోటలా ఉంది. కాబట్టి ఆయన తనయుడు బాంగ్‌బాంగ్ మార్కోస్‌కు కూడా ఆ ప్రావిన్స్ ఎల్లప్పుడూ ఒక స్థావరంలా ఉంటుంది. అక్కడి నుంచి పని మొదలుపెట్టడం ఆయనకు సులభమైంది. రెండవది.. సోషల్ మీడియా, పూర్తి తప్పుడు సమాచారం గతాన్ని అక్షరాలా రూపు మాపేశాయి. ‘స్టాటిస్టా’ సర్వే ప్రకారం రోజూ కేవలం రెండు గంటలు మాత్రమే సోషల్ నెట్‌వర్క్‌లో ఉంటున్న బ్రిటన్ ప్రజానీకంతో పోలిస్తే ఫిలిప్పీన్ ప్రజలు అంతకు రెండింతలుగా నాలుగు గంటల పాటు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. తత్ఫలితంగా మార్కోస్ నిరంకుశత్వం, దౌర్జన్యం, అవినీతి – అన్నీ నకిలీ కథనాలుగా పరి గణన పొందడానికి వీలైంది. అంతేనా, ఆయన నియంతృత్వానికి ‘స్వర్ణయుగం’ అనే పేరు కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. ఈ పునర్లిఖిత చరిత్రలో మార్కోస్ క్రూరపాలన వర్ణమయమైన ఆకర్షణగా కూడా మారింది. మూడవది – బాంగ్బాంగ్తో ఈ ఎన్నికల్లో కలిసి ఉపాధ్య క్షురాలిగా పోటీచేసిన అభ్యర్థి.. గద్దె దిగి వెళుతున్న అధ్యక్షుడు డ్యూటర్టే కుమార్తె సారా డ్యూటెర్టే కార్పియో. ఆమె వెనుక ఆమె తండ్రి ప్రజాదరణ ఉంది. అంటే పారంపర్యం పనిచేస్తోందని! ఇండియాతో ఫిలిప్పీన్స్‌కి ఏమైనా కాస్త పోలికను వెదకితే అది.. 1977–1979 మధ్యకాలంలో ఇందిరాగాంధీ ఉత్థాన పతనాల దశ కావచ్చు. బ్రిటన్ లోనూ ఇలాంటిదే జరిగింది. అయితే ఇందుకు విరుద్ధంగా జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచిన తర్వాత జరిగిన ఎన్నికల్లో చర్చిల్ ఓడిపోయారు. కానీ మార్కోస్ వీరోచిత, విస్మయగాథ ప్రత్యేకమైనది. దీన్నుంచి మనం గ్రహించగలిగింది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేయడానికి వీల్లేదని! చెప్పలేం.. మరొక గాంధీ ప్రధాని అవొచ్చు. శ్రీలంకలో రాజపక్సేలు ఎప్పటికైనా మళ్లీ పుంజుకోవచ్చు! వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
రణిల్‌తో లంక చక్కబడేనా?
నెల రోజులకుపైగా ఎడతెరిపిలేని నిరసనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ఏలుబడి మొదలైంది. తమ కుటుంబ పాలన నిర్వాకానికి, దానివల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి ఆగ్రహోదగ్రులైన జనం వీధుల్లో విరుచుకుపడినా అధ్యక్షుడు గొటబయ రాజపక్స ధోరణిలో ఆవగింజంతైనా మార్పు రాలేదని రణిల్ నియామకంతో రుజువైంది. గత నెల 9న ప్రారంభమైన ఉద్యమం ప్రభుత్వం ముందుంచిన ఏకైక డిమాండ్ రాజపక్స కుటుంబీకులు గద్దె దిగాలన్నదే. కానీ రణిల్ ఆగమనం ఆ స్ఫూర్తికి విరుద్ధమైంది. రాజపక్స కుటుంబీకులతో ఆయన వర్తమాన సంబంధబాంధవ్యాలు ఎటువంటివో ప్రజలకు తెలుసు. దేశాన్ని తాజా సంక్షోభంనుంచి కాపాడాలన్న చిత్తశుద్ధే గొటబయకు ఉంటే రణిల్ జోలికి పోకుండా విపక్ష ఎస్‌జేబీ నేత సజిత్ ప్రేమదాసను ఒప్పించే ప్రయత్నం చేసేవారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందినప్పుడు సజిత్ షరతు విధించిన మాట వాస్తవం. గొటబయ ఈనెల 15 లోగా అధ్యక్ష పదవినుంచి వైదొలగుతా నంటేనే అందుకు అంగీకరిస్తానన్నారు. ఆ విషయంలో ఆయనకు నచ్చజెప్పవలసి ఉండగా, ఈ సాకుతో రణిల్‌ను ఎంచుకోవడం గొటబయ కుయుక్తికి అద్దం పడుతుంది. లంక చల్లబడుతుందనీ, మళ్లీ తమ పరివారానికి గత వైభవం దక్కుతుందనీ ఆయన కలలు కంటున్నట్టు కనిపిస్తోంది. తెరవెనక ఎత్తుగడల్లో రణిల్ ఆరితేరి ఉండొచ్చు. కానీ జనంలో విశ్వసనీయత శూన్యం. రెండేళ్ల నాడు జరిగిన పార్లమెంటు ఎన్నికలే ఇందుకు సాక్ష్యం. రణిల్ పోకడలను సహించలేని నేతలంతా ఆ ఎన్నికలకు ముందు పార్టీని విడిచి కొత్త పార్టీ సామగి జన బలవేగయ(ఎస్‌జేబీ) స్థాపించడంతో ఆయన పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రణిల్ సైతం ఓటమి పాలు కాగా, పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రాతిపదికన ఎంపీలను నామినేట్ చేసే ‘నేషనల్ లిస్టు’ పుణ్యమా అని ఆయన ఒక్కడూ ఎంపీ కాగలిగారు. 225 మంది ఎంపీలుండే పార్లమెంటులో యూఎన్‌పీ తరఫున ఆయన ‘ఏక్ నిరంజన్’. అందుకే ప్రధాని పదవి ఇవ్వజూపితే తీసుకోబోనని పక్షం క్రితం ఆయన గంభీరంగా చెప్పారు. ఇంతలోనే వ్రతభంగానికి పాల్పడ్డారు. గతంలో ఆయన అయిదుసార్లు ప్రధానిగా చేశారు. కానీ ఎప్పుడూ పూర్తికాలం ఉండలేకపోయారు. లంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఎవరినైనా ప్రధాని పదవిలో కూర్చోబెట్టవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనైతికమన్న ఆలోచనే గొటబయకు లేకుండా పోయింది. లంక ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన జాతీయ ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడు మాత్రమే దానికి ఇంటా బయటా అంతో ఇంతో విశ్వసనీయత కలుగుతుంది. రుణాలు లభిస్తాయి. ఇంధనం, నిత్యావసర సరుకుల దిగుమతులు పుంజుకుంటాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడితే లంకకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగం పట్టాలెక్కుతుంది. శ్రీలంక రూపాయి కొద్దో గొప్పో కోలుకుంటుంది. దేశ క్షేమాన్ని కాంక్షించే రాజనీతిజ్ఞతే ఉంటే గొటబయ ఆ పని చేసేవారు. కానీ అందుకు భిన్నంగా తన చెప్పుచేతల్లో ఉండే నేతను ప్రధానిగా నియమించి భవిష్యత్తులో తనకూ, తన పరివారానికీ ముప్పు కలగకుండా ముందుజాగ్రత్త పడ్డారు. గొటబయ ఎత్తులు ఫలిస్తాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగడం కల్ల. ప్రస్తుత ఉద్యమం ఎప్పుడో సంప్రదాయ రాజకీయ నేతల చేతులు దాటిపోయింది. అందుకే ఉద్యమకారులపై లాఠీచార్జిలతో మొదలుపెట్టి కాల్పుల వరకూ పోయినా... కరడుగట్టిన నేరగాళ్లను జైళ్లనుంచి విడుదల చేయించి వారితో ఉద్యమ నేతలను హతమార్చాలని చూసినా జనం ఎక్కడా బెదరలేదు. సరిగదా అప్పటివరకూ ఎంతో శాంతియుతంగా సాగిన ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. నేర గాళ్లను ఉద్యమకారులు దొరకబుచ్చుకుని దేహశుద్ధి చేసి, వారిని చెత్త తీసుకెళ్లే బళ్లలో ఊరేగించారు. అధికారిక నివాసాలకు నిప్పు పెట్టారు. రివాల్వర్‌తో కాల్పులు జరిపి తప్పించుకోవాలని చూసిన అధికార పార్టీ ఎంపీని తరిమి తరిమికొట్టారు. చివరకు ఆయన ప్రాణాలు తీసుకున్నాడని మొదట వార్తలు రాగా, అది హత్య అని తాజాగా పోలీసులంటున్నారు. గొటబయ కుటుంబీకులను ఏమాత్రం జనం సహించడంలేదు. అందుకే వారు ఒక్కొక్కరే పదవులనుంచి వైదొలగక తప్పలేదు. చివరకు గత సోమవారం గొటబయ సోదరుడు, ప్రధాని మహిందా రాజపక్స సైతం రాజీనామా చేయవలసి వచ్చింది. కళ్లముందు సాగుతున్న ఈ పరిణామాలు గొటబయకు తెలియవనుకోలేం. అయినా ఆయనలో ఏదో దింపుడు కళ్లం ఆశ ఉన్నట్టు కనబడుతోంది. దేశం దివాలా తీసి, ప్రజానీకమంతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో గొటబయ తప్పుకోవడం, తమ పాలనలో జరిగిన అక్రమాలపై, కుంభకోణాలపై విచారణకు సిద్ధపడటం ఒక్కటే మార్గం. మెజారిటీ వర్గ ప్రజలను కృత్రిమ ఆధిక్యతా భావనలో ముంచి, వాస్తవ స్థితిగతులనుంచి వారి దృష్టి మరల్చి పౌరుల్లో పరస్పర విద్వేషాలను పెంచి పోషించిన ఘనులు రాజపక్స సోదరులు. ఆ రాజకీయపుటెత్తుగడలే వర్తమాన పెను సంక్షోభానికి మూల కారణం. ఇలాంటి నేతలు ఇంకా పదవుల్లో కొనసాగడం లేదా వారికి అధికారిక అండదండలు లభించడం దేశ భవిష్యత్తుకు మరింత చేటు కలిగిస్తుంది. రాజకీయ సుస్థిరత ఏర్పడి, సాధారణ స్థితిగతులు సాధ్యపడాలంటే రాజపక్సేల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంలేని ప్రభుత్వం ఏర్పడటం అత్యవసరం. ఆ దిశగా అడుగులు పడటమే వర్తమాన సంక్షోభానికి విరుగుడు. -
ఇదేం పిచ్చిరా నాయన! తగలెట్టేసి మరీ సెల్ఫీలా!
New selfie points near burnt buses and cars submerged: రాజికీయ, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అల్లర్లు చెలరేగుతున్నసంగతి తెలిసిందే. తొలుత శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రాజపక్స కుటుంబాల ఇళ్లను, కార్యాలయాలను ధ్యంసం చేశారు కూడా. నేవీ స్థావరంలో తలదాచుకుంటున్న మహిందా రాజపక్స కుటుంబం పై దాడి చేయాలని నిరసనకారలు ఆ ప్రాంతాలను కూడా ముట్టడించారు. ఈ క్రమంలో ఒకవైపు ఆందోళలనకారులు నిరసనలు చేస్తుంటే మరోవైపు కొంతమంది ఆ ధ్వంసమైన కార్లు, చెరువుల్లో మునిగిపోయిన బస్సుల వద్ద సెల్ఫీలు తీసకుంటున్నారు. ఈ హింసాత్మక అల్లర్లుక కారణంగా శ్రీలంక రక్షణ శాఖ కర్ఫ్యూ విధించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులన తగలబెట్టేవారిని నిర్థాక్షిణ్యంగా కాల్చేయండి అంటూ అదేశాలు జారీ చేసింది కూడా. ఐతే ఇక్కడ ప్రజలు ధ్వంసం చేసిన ప్రభుత్వ ఆస్తులను సెల్ఫీ పాయింట్లుగా చేసుకుని సెల్ఫీలు దిగేందుకు ఎగబడటం విశేషం. అంతేకాదు ఈ కర్ఫ్యూ కారణంగా తాము స్కూల్‌కి వెళ్లలేకపోవడంతో తాము తమ కుటుంబంతో బయటకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నమని విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసస్థలాల వద్ద బస్సలు, కార్లు దగ్ధం కాగా.. ప్రజలు తమ కుటుంబాలతో సహా వాటి వద్దకు వచ్చి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. Sri Lanka | Burnt buses and sunken cars become a new selfie point in Colombo "People are taking selfies here as they want to take it as memory, many people could not join protests, they are taking selfies to show solidarity with the protesters," said Clifford, a local resident pic.twitter.com/UpTKzwRLXF — ANI (@ANI) May 12, 2022 (చదవండి: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం) -
శ్రీలంక అధ్యక్షుడు గొటబయా కీలక ప్రకటన
కొలంబో/న్యూయార్క్: శ్రీలంకకు ఈ వారంలోనే కొత్త ప్రధాని వస్తారని అధ్యక్షుడు గొటబయా రాజపక్స చెప్పారు. రాజ్యాంగ సంస్కరణలూ తెస్తామన్నారు. రాజపక్సలు లేకుండా యువ మంత్రివర్గాన్ని నియమిస్తామన్నారు. తాజా మాజీ ప్రధాని మహిందా రాజపక్స ట్రింకోమలీలోని నావల్ బేస్‌లోనే తలదాచుకున్నారు. భారత ప్రభుత్వం లంకకు సైన్యాన్ని తరలించనుందన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. చదవండి: లంక కల్లోలం: కొంప ముంచిన మహీంద రాజపక్స మీటింగ్! -
శ్రీలంకలో ఆగని అల్లర్లు.. ప్రధాని ఇంటికి నిప్పు
ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో మొదలైన ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు హంబన్‌టోట నగరంలోని మెదములానాలో ప్రధాని మహింద రాజపక్సే, అతని తమ్ముడు అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఇంటికి నిప్పు పెట్టారు. అంతేకాక కొందరు మహీంద తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన డీఏ రాజపక్స విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో పాటు అధికార కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యుల పలు ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో శ్రీలంక అధ్యక్షుడి నివాసాన్ని ఆర్మీ ఆధీనంలో తెచ్చుకుంది. రాజపక్స నివాసం వద్ద భారీ సంఖ్యలో ఆందోళనకారులు రావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజపక్స అధికారిక నివాసం వద్ద వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. -
Sri Lanka: అప్పుల కుప్ప శ్రీలంక.. అంతా రాజపక్సల మాయ!
శ్రీలంకలో సంక్షోభం మొదలై నెల దాటుతోంది. ప్రజాగ్రహం నానాటికీ పెరుగుతోందే తప్ప చల్లారడం లేదు. రాజపక్స కుటుంబమంతా రాజీనామా చేయాలని నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆ ఒక్క డిమాండ్‌తోనే నిరసనకారులు రోజుల తరబడి అధ్యక్ష భవనం ఎదుట బైఠాయిస్తున్నారు. అరెస్టులకు, లాఠీ దెబ్బలకు వెరవకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా రాజపక్స వంశాన్ని ఆరాధించిన జనం ఇప్పడు ఆ పేరు చెబితేనే ఎందుకు మండిపడుతున్నారు? అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అని దశాబ్దాల కిందట మహాకవి శ్రీశ్రీ రాసిన మాటలు ఇప్పటికీ అక్షర సత్యమని శ్రీలంక రాజకీయాలు నిరూపిస్తున్నాయి. రాజపక్స కుటుంబీకుల బంధుప్రీతి, అవినీతి దేశాన్ని ఆర్థికంగా దిగజార్చడమే గాక ప్రజల్లో ఆ కుటుంబంపై ఏహ్యభావం ఏర్పడింది. రాజపక్సలు దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారాన్ని గుప్పిట పట్టి ఉంటూ చక్రం తిప్పుతున్నారు. వారి పార్టీ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) 1948 ఫిబ్రవరిలో శ్రీలంకకు స్వాతంత్య్రం రావడానికి ముందే పుట్టింది. దాని వ్యవస్థాపకుడు డాన్ అల్విన్ రాజపక్స పార్లమెంటుకు ఎన్నికైనప్పటి నుంచి రాజకీయాల్లో ఆ కుటుంబ ప్రస్థానం మొదలైంది. అల్విన్ కుమారులైన ప్రధాని మహింద, అధ్యక్షుడు గొటబయ, చమిల్, బాసిల్ సోదరులు అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. శ్రీలంక ప్రస్తుత దుస్థితికి ఈ నలుగురు అన్నదమ్ములే కారణమన్న విమర్శలున్నాయి. భావి తరం నేతలుగా చక్రం తిప్పడానికి వారి కుమారులు నమల్, యోషిత, శశీంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు. మహింద రెండోసారి అధ్యక్షుడిగా చేసిన 2010–15 మధ్య ఆ కుటుంబం నుంచి ఏకంగా 40 మందికి పైగా ప్రభుత్వ పదవుల్లో కొనసాగారు! వారిలో అత్యధికులు ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేశ అప్పుల్లో 78% రాజపక్సల హయాంలో చేసినవే! బాసిల్ రాజపక్స (70) మాజీ ఆర్థిక మంత్రి అన్నదమ్ముల్లో చిన్నవాడు. ఆర్థికమంత్రిగా అవకతవక నిర్ణయాలతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారు. కాంట్రాక్ట్ ఏదైనా 10 శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందే. అందుకే బాసిల్‌ను మిస్టర్ 10% అని పిలుస్తారు. మహింద రాజపక్స (76) ప్రధాని అత్యంత ప్రజాదరణ ఉన్న నేత. 2005 నుంచి పదేళ్లు దేశాధ్యక్షుడు. ప్రత్యేక తమిళ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. దశాబ్దాల తరబడి సాగిన అంతర్యుద్ధాన్ని మే 2009లో మిలటరీ ఆపరేషన్‌తో నామరూపాల్లేకుండా చేసి సింహళ–బుద్ధిస్టులకు ఆరాధ్యునిగా మారారు. మహింద హయాంలోనే శ్రీలంక చైనాకు దగ్గరైంది. మౌలిక సదుపాయాల కల్పనకంటూ 700 కోట్ల డాలర్లు అప్పుగా తెచ్చారు. ఆ ప్రాజెక్టుల్లో భారీ అవినీతితో ఆ రుణ భారం కొండంతైంది. ఆయన ఏకంగా 1,900 కోట్ల డాలర్లు పోగేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. గొటబయ రాజపక్స (72) అధ్యక్షుడు అన్న మహిందకు కుడిభుజం. ఆయన అధ్యక్షుడిగా ఉండగా ఎన్నో పెద్ద పదవుల్లో ఉన్నారు. 2005లో రక్షణ శాఖకు శాశ్వత కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతర్యుద్ధ సమయంలో తమిళ రెబెల్స్‌పై మూకుమ్మడి అత్యాచారాలు, హింస, హత్యల వెనుక గొటబయ హస్తముందంటారు. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న ఈయనను కుటుంబీకులే టెర్మినేటర్ అని పిలుస్తూంటారు. 2019లో అధ్యక్షుడయ్యాక రక్షణ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. 2020 అక్టోబర్‌లో అధ్యక్షుడికి అపరిమిత కార్యనిర్వాహక అధికారాలు కల్పించుకోవడం వివాదాస్పదమైంది. చమల్ రాజపక్స (79) నీటిపారుదల మంత్రి మహింద అధ్యక్షుడిగా ఉండగా స్పీకర్‌గా చేశారు. ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని సిరిమావో బండారు నాయకేకు వ్యక్తిగత అంగరక్షకుడిగా చేయడంతో బాడీగార్డ్ అనే పేరు స్థిరపడిపోయింది. ప్రస్తుతం నీటిపారుదల మంత్రి. అన్నదమ్ముల్లో అంతగా వివాదాలు లేనిది ఈయనొక్కడే. నమల్ రాజపక్స (35) క్రీడలు, యువజన మంత్రి మహింద కుమారుడు. 2010లో 24 ఏళ్ల వయసులోనే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎప్పటికైనా అధ్యక్షుడు కావాలని కలలు గంటున్నారు. మహింద అధ్యక్షుడిగా ఉండగా ఏ పదవీ లేకుండానే చక్రం తిప్పడంతో పాటు ఈయనపై మరెన్నో అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లంక ప్రధానితో చర్చలకు నో!
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడి భవనం ముందు నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులను ఆ దేశ ప్రధాని మహింద రాజపక్సే చర్చలకు ఆహ్వానించారు. అయితే అధ్యక్షుడు గొటబయ రాజపక్సే రాజీనామా చేయాలని, ఇతర రాజపక్సే కుటుంబ సభ్యులు అధికారం నుంచి వైదొలగాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అంతవరకు చర్చలకు రామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆందోళనకారులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలిపారు. ‘‘మేం ఇక్కడకు చర్చలకు రాలేదు. నువ్వు, నీ ప్రభుత్వం రాజీనామా డిమాండ్ చేయడానికి వచ్చాం’’ అని నిరసనకారుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. వీరు నిరసన తెలియజేసే స్థలానికి గాట్గోగామా అని పేరు పెట్టుకున్నారు. బుధవారానికి ఈ ఆందోళనలు ఐదో రోజుకు చేరాయి. ఎక్కువగా యువత ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. దేశంలోని అవినీతి రాజకీయ సంస్కృతిని మార్చేవరకు వెనుదిరగమంటున్నారు. బుధవారం ఆందోళనల్లో పలువురు సంగీతకారులు, సెలబ్రిటీలు, ఆర్టిస్టులు పాలుపంచుకున్నారు. వీరిలో మాజీ క్రికెటర్ రోషన్ మహానామా కూడా ఉన్నారు. ప్రజలకు నిత్యావసరాలు కూడా దొరకడం లేదని, ఇంతవరకు సంక్షోభానికి పరిష్కారమార్గాలు రాజకీయనాయకుల నుంచి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు నిరసనకారులతో చర్చలకు రావాలంటూ ప్రధాని కార్యాలయం యువతను కోరుతూ ప్రకటన చేసింది. ఒకవేళ వారు చర్చలు అంగీకరిస్తే వారి బృందంలో మరింత మంది పాల్గొనే అవకాశం ఇస్తానని మహింద చెప్పారు. దేశమంతా అదే డిమాండ్ రాజపక్సే కుటుంబం పదవులను వీడాలంటూ లంకలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక సంక్షోభానికి ఈ ప్రభుత్వమే కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దేశంలో పెట్రోల్ బంకుల వద్ద, దుకాణాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకునే వీలు లేకపోవడంతో వరుసల్లో నిలబడ్డ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. విదేశీ నిల్వలు భారీగా దిగజారడంతో బహిర్గత రుణ చెల్లింపులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే! ప్రభుత్వంలో పలు మంత్రులు రాజీనామాలు చేసిన అనంతరం కొత్త కేబినెట్ ఏర్పాటు చేయడంలో గొటబయ ఇప్పటకీ సఫలం కాలేదు. పార్లమెంట్లో ప్రభుత్వంపై అవిశ్వాసం, అధ్యక్షుడి అభిశంసన, అధ్యక్షుడికి అధిక అధికారాలు కల్పించే 20 సవరణల తొలగింపును కోరుతూ తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. ప్రభుత్వంలో భాగస్వామైన ఎస్ఎల్పీపీ నేత సిరిసేన ఇకపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలకు హాజరుకానని తేల్చిచెప్పారు. అయితే సంక్షోభానికి కరోనా, ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలే కారణమని ప్రభుత్వం చెబుతోంది. -
‘గో హోం గొటా’.. శ్రీలంకలో నిరసనల హోరు..
కొలంబో/రామేశ్వరం: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ జనం వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కొలంబోలో ఆదివారం వేలాదిమంది ఓ పార్కులో గుమికూడారు. రాజపక్సకు వ్యతిరేకంగా ‘గో హోం గొటా’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఆహారం, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఔషధాలు లేకుండా ఎలా బతకాలని జనం మండిపడుతున్నారు. రాజపక్స రాజీనామా చేసే దాకా ఉద్యమం విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలకు మద్దతిస్తామని తమిళ్ నేషనల్ అలయెన్స్(టీఎన్ఏ) పార్టీ ఆదివారం ప్రకటించింది. గొటబయపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని సమాగీ జన బలవెగయా(ఎస్‌జేబీ) పార్టీ శుక్రవారం వెల్లడించింది. శ్రీలంకలో సంక్షోభాన్ని తట్టుకోలేక జనం ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లంక నుంచి 19 మంది తమిళులు పడవలో ఆదివారం భారత్‌లోని ధనుష్కోటి తీరానికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. -
గొటబయ ప్రభుత్వంపై అవిశ్వాసం
కొలంబో: దేశంలో నెలకొన్న సంక్షోభాలను తక్షణం పరిష్కరించే చర్యలు చేపట్టకుంటే గొటబయ రాజపక్సే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని లంక ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ పార్టీ ప్రకటించింది. దేశంలో అధ్యక్ష పాలన పోవాలని పార్టీ నేత సజిత్ ప్రేమదాస అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పంపిణీ జరగాలన్నారు. గొటబయ తొలగాలన్న ప్రజా డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. లేదంటే తామే అవిశ్వాసం తెస్తామని హెచ్చరించారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతుగా ఎంపీల సంతకాల సేకరణను ఎస్‌జేబీ ఆరంభించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని గతంలో గొటబయ ఎస్‌జేపీని ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానాన్ని పార్టీ తిరస్కరించింది. దేశంలో రాజపక్సేల ఆధిపత్యం పోవాలని ఎస్‌జేబీ కోరుతోంది. గొటబయ రాజీనామా చేయకపోతే అవిశ్వాసం తెస్తామని మరో విపక్షం జేవీపీ నేత విజేత హెరాత్ చెప్పారు. అయితే రాజీనామా డిమాండ్‌ను గొటబయ తోసిపుచ్చారు. పరిష్కారం దొరకలేదు దేశం ఎదుర్కొంటోన్న ఆర్థిక సంక్షోభపై చర్చ పార్లమెంట్లో మూడు రోజులు చర్చించినా తగిన పరిష్కారం లభించలేదు. పలువురు మంత్రులు రాజీనామా నేపథ్యంలో తక్షణం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ నివారణా మర్గాలు అన్వేషించాలని అధికార కూటమి సభ్యులు కూడా కోరుతున్నారు. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్, చైనా, ఇండియాతో సాయంపై చర్చలు జరుపుతోందని గొటబయ చెబుతున్నారు. ప్రజలు పొదుపుగా వ్యవహరించాలని సూచించారు. దేశంలోని విదేశీ దౌత్యవేత్తలతో విదేశాంగమంత్రి పెరిస్ చర్చలు జరిపారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో పబ్లిక్ రంగ ఉద్యోగులు శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేశారు. మరోవైపు దేశంలో ఔషధాలు, వైద్య పరికరాల కొరత తీవ్రస్థాయికి చేరింది. -
చైనాతో దోస్తీ వల్లే ఇలా జరిగింది..
కొలంబో: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తినేందుకు తిండి లేక లంకేయులు పస్తులు ఉండాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో రాజపక్సే ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు తిరుగుబాటుకు దిగారు. లంకేయుల ఆందోళనల నేపథ్యంలో శ్రీలంకలో ఎమర్జెన్సీ, కర్ఫ్యూ సైతం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా లంక ప్రభుత్వంపై ఆ దేశ వ్యాపారులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్రభుత్వం.. చైనాకు అన్నింటినీ అమ్ముతోందని ఆరోపించారు. ప్రతీ దానిని చైనాకు అమ్ముతున్న కారణంగానే శ్రీలంక వద్ద డబ్బు లేదు. ఇది ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసే వాటిపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రతీ వస్తువు వేరే దేశాల నుంచి కొనడం కష్టంగా మారింది. ఇదే ప్రధాన సమస్య అని పేర్కొన్నారు. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయని, తమ వద్ద నగదు కూడా మిగలడం లేదని అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పండ్ల విక్రయదారుడు ఫరూఖ్ మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం కిలో ఆపిల్స్ రూ. 500 గా ఉంది. ఇప్పడు ఆపిల్స్ ధర రూ. 1000-1500లకు చేరుకుంది. ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో ఎవరూ కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస కార్యనిర్వాహక అధ్యక్ష వ్యవస్థను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు అధికార పార్టీకి చెందిన, కొత్తగా నియమితులైన ఆర్థిక మంత్రి అలీ సబ్రీ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వంపై నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనకారులు బారికేడ్లు ధ్వంసం చేసి నిరసనలు కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #SriLanka: Clashes broke out between protesters and police today in Colombo during protests against Sri Lanka’s worsening financial crisis. Protesters have been expressing discontent with the ruling family for weeks, intensifying in the past few days.https://t.co/tjKYE8p4KC pic.twitter.com/MeuozfruTA — POPULAR FRONT (@PopularFront_) April 5, 2022 ఇది చదవండి: శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. మైనార్టీలో గొటబాయ సర్కార్ -
శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. మైనార్టీలో గొటబాయ సర్కార్
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరనసలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పటికీ నిరసనలు మాత్రం తగ్గడం లేదు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కీలక అధికారులు, మంత్రులు రాజీనామా బాట పడుతున్నారు. ఆహార, ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న శ్రీలంకలో.. రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. 41 మంది ఎంపీలు అధికార కూటమికి మద్ధతు ఉపసంహరించుకోవడంతో అధ్యక్షుడు గొటబయా రాజపక్స నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. శ్రీలంక ప్రజా ఫ్రంట్ నుంచి బయటకు వచ్చేశామని, తాము స్వతంత్ర సభ్యులుగా ఉంటామని ఫ్రీడమ్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు. వీరిలో సొంత పార్టీకి చెందిన 12 మందితో పాటు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన 14 మంది, ఇతర మిత్ర పక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. దీంతో గొటబాయ సర్కార్ మెజార్టీ కోల్పోయింది. చదవండి: శ్రీలంకలో ముదరుతున్న సంక్షోభం.. నూతన ఆర్థిక మంత్రి రాజీనామా ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత తొలిసారి మంగళవారం పార్లమెంట్ సమావేశం కాగా.. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ రంజిత్ సియంబలపితియా తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, బసిల్ రాజపక్స స్థానంలో ఆర్థికమంత్రిగా నియమితులైన అలి సబ్రి 24 గంటల్లోనే రాజీనామా చేసి వెళ్లిపోయారు. అదే విధంగా ఆర్థిక అవకతవకల ఆరోపణలతో సెంట్రల్ బ్యాంక్ ఉన్నతాధికారి సోమవారం రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధాని రాజపక్స సారథ్యంలోని కేంద్ర కేబినెట్లోని మొత్తం 26 మంది మంత్రులు ఆదివారం అర్థరాత్రి సమయంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ సంక్షోభం నుంచి గట్టేందుకు కేబినెట్లో చేరి పదవులు చేపట్టాలని అధ్యక్షుడు గోటబయ రాజపక్స.. ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. కానీ ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించాయి. అయితే కేబినెట్ మొత్తం రాజీనామా చేసినా.. గొటబాయ, మహింద రాజపక్సలు మాత్రం తమ పదవుల్లో కొనసాగుతున్నారు. చదవండి: శ్రీలంక సంక్షోభంపై జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పందన.. ఎమోషనల్ పోస్ట్ -
శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. నూతన ఆర్థిక మంత్రి రాజీనామా
Sri Lanka finance minister Ali Sabry resigned: శ్రీలంక అప్పుల ఊబిలో చిక్కుకుంది. నివేదికల ప్రకారం శ్రీలంకకి సుమారు రూ. 3 లక్షల కోట్ల విదేశీ అప్పు ఉంది. అందులో సుమారు 400 కోట్లు ఈ ఏడాది చెల్లించవలసి ఉంది. శ్రీలంక తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కుంటున్న తరుణంలో ఆర్థిక మంత్రి అలీ సబ్రీ ప్రమాణస్వీకారం చేసిన తదుపరి రోజే రాజీనామ చేశారు. ఆయన తన సోదరుడు బాసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రిగా తొలగించి న్యాయ మంత్రిగా ఉన్న అలీ సబ్రీని ఆర్థిక మంత్రిగా శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్సే నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సబ్రీ మాట్లాడుతూ...నేను ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పనిచేశానని నమ్ముతున్నాను. దేశ సమస్యలను పరిష్కరించడానికి సత్వర చర్యలు అవసరం అని ఆయన అన్నారు. నిజానికి సబ్రీ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో శ్రీలంక ఆర్థిక పరిస్థితిని చర్చించేందుకు ఈ నెలాఖరులో అమెరికాను సందర్శించాల్సి ఉంది. అయితే అధ్యక్షుడు గోటబయట రాజపక్సే పిలుపునిచ్చిన ఐక్యత ప్రభుత్వాన్ని ప్రతిపక్షం తిరస్కరించడంతో పాలక సంకీర్ణం మెజారిటీని కోల్పోయింది. దీంతో సబ్రీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఫ్రీడమ్ పార్టీ అధినేత మైత్రిపాల సిరిసేన మాట్లాడుతూ..‘మా పార్టీ ప్రజల పక్షాన ఉంది. స్వతంత్ర చట్టసభ సభ్యుల సహాయంతో శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికీ పనిచేయగలదు. కానీ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దాని సామర్థ్యం మరింత బలహీనపడింది.అని అన్నారు. అంతేగాక ప్రధాన మంత్రి మహింద్ర రాజపక్స క్యాబినెట్‌లోని మొత్తం 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. అదీగాక శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న రాజపక్స కుటుంబంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. ఈ క్రమంలో గత వారం శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్స ఇంటిని ముట్టడించేందుకు వందలాది మంది ప్రయత్నించారు కూడా. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన హింస కారణంగా డజనుకు పైగా జనాలు గాయపడ్డారు. తప్పనిసరై రాజపక్స జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే కాకుండా సైన్యానికి అరెస్టు చేసే అధికారాన్ని ఆదేశించారు. వారాంతంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కూడా విధించారు. ఇప్పటికే భారత్ సుమారు రూ. 200 కోట్ల క్రెడిట్ లైన్లు, దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ఇంధన సాయాన్ని అందించింది. (చదవండి: లంకలో కల్లోలం) -
లంకలో కల్లోలం
కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్ ప్రేమదాస, మనో గణేసన్ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు. గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్‌తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్ చర్యలపై లంక అధికార పక్షం ఎస్ఎల్పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్‌ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు. కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా లంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కబ్రాల్ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్‌గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్‌ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్‌ను సాయం ఆర్థించింది. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. -
శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు రాజపక్సే
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న దృష్యా ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. Sri Lanka: లంక ఘోర ఆర్థికసంక్షోభం.. అర్ధరాత్రి అధ్యక్ష భవనం ముందు హింస! -
పగ తీర్చుకున్న కేకేఆర్ బౌలర్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మయాంక్ అగర్వాల్ రూపంలో ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ తర్వాత వచ్చిన బానుక రాజపక్స ఉన్న కాసేపు కేకేఆర్ బౌలర్లను హడలెత్తించాడు. 9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేసిన రాజపక్స చివరికి శివమ్ మావి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఔటైన రాజపక్స అదే ఓవర్లోనే శివమ్ మావికి చుక్కలు చూపించాడు. ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన మావి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు సంధించాడు. దీంతో మావి షార్ట్ పిచ్ బంతి వేయగా.. రాజపక్స మరో సిక్సర్ సంధించే యత్నంలో మిడాఫ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలా తన బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన రాజపక్సను ఔట్ చేసి మావి పగ తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా గెట్ అవుట్ ఆఫ్ మై వే అంటూ మావి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివమ్ మావి- బానుక రాజపక్స్ వీడియో కోసం క్లిక్ చేయండి -
శ్రీలంకకు 3,230 కోట్ల సాయం
న్యూఢిల్లీ: శ్రీలంక నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్సతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం, దౌత్య సంబంధాలను బలపరుచుకోవాల్సిన ఆవశ్యకతపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశం అనంతరం లంక ప్రభుత్వానికి సుమారు రూ.3,230 కోట్ల రుణ సహాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. గోతబయ రాజపక్స మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్‌కి వచ్చారు. శ్రీలంకలోని మైనారిటీ తమిళుల ఆకాంక్షలూ, భద్రతాంశాలూ, వ్యాపార ఒప్పందాలూ, మత్స్యకారుల సమస్యలపై ఈ సమావేశం దృష్టిసారించింది. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడుతూ... శ్రీలంక సత్వరాభివృద్ధి పథంలో పయనించేందుకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు. శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు రూ.3,230 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు శ్రీలంక పోలీసు అధికారులు భారత్‌లో శిక్షణ పొందుతున్నట్టు ప్రధాని వెల్లడించారు. లంక అధ్యక్షుడు గోతబయ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతమయ్యాయనీ, ఆర్థిక సహకారం అంశాన్ని కూడా భారత ప్రధానితో చర్చించానని చెప్పారు. రాజపక్సకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భవన్‌లో ఘనంగా స్వాగతం పలికారు. -
శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల సాయం
న్యూఢిల్లీ : శ్రీలంక అభివృద్ధికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధికి, ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మోదీ ప్రకటించారు. ఇటీవల శ్రీలంక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన గొటబాయా రాజపక్స.. తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా గురువారం ఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో రాజపక్స భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అభివృద్ధి, ఉగ్రవాదం నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏప్రిల్ 21 ఈస్టర్ రోజున శ్రీలంకలో జరిగిన దాడులను ఖండించిన మోదీ.. ఉగ్రవాదం పోరులో భాగంగా శ్రీలంకకు 50 మిలియన్ డాలర్లు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే శ్రీలంక ఆర్థిక వృద్ధి కోసం 400 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించారు. ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్టు కింద శ్రీలకంలో ఇప్పటికే 46,000 గృహాలు నిర్మించామని.. భవిష్యత్తులో మరో 14,000 గృహాలు నిర్మిస్తామని తెలిపారు. శ్రీలంక ఎన్నికల్లో విజయం సాధించిన రాజపక్సకు అభినందనలు తెలిపారు. రాజపక్స మాట్లాడుతూ.. శ్రీలంక అభివృద్ధికి భారత్ ముందుకు వచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నిఘా వర్గాలను మరింత శక్తివంతం చేసేందుకు ప్రధాని మోదీ 50 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. కాగా, శుక్రవారం ఉదయం రాజపక్సకు రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌ను రాజపక్స కలిసి చర్చలు జరిపారు. -
లంక అధ్యక్షుడి అడుగులు ఎటువైపు?
కొలంబో: చైనాతో సన్నిహితంగా ఉండే రాజపక్స వంశీయులకు చెందిన గొటబాయ రాజపక్స శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలవడంతో భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంకలో ఉన్న మైనార్టీలైన తమిళులు, ముస్లింలు అధికంగా ఉండే శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో రాజపక్సకు పెద్దగా ఓట్లు రాలేదు. దేశంలోని మెజార్టీగా ఉన్న సింహళ బౌద్ధుల ఓట్లతో గెలవడంతో భారత్‌తో బంధంపై అనుమానాలైతే ఉన్నాయి. అవినీతి, బంధుప్రీతి 2005–15 మధ్య గొటబాయ సోదరుడు మహేంద్ర రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుటుంబ అధిపత్య పాలనలో దేశం విలవిలలాడింది. అన్ని ముఖ్య పదవుల్ని కుటుంబ సభ్యులకే కట్టబెట్టారు. గొటబాయ రక్షణ శాఖ కార్యదర్శిగా ఉంటే, మరో ఇద్దరు సోదరులు కీలక పదవుల్లో ఉన్నారు. వీరి నలుగురిపై అవినీతి, ప్రజాస్వామ్య విలువల్ని హరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎల్టీటీఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం, భారత్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండానే చైనాకు చెందిన జలాంతర్గాముల్ని హిందూ సముద్ర జలాల్లోకి అనుమతినివ్వడం వంటివి అప్పట్లోనే కలకలం రేపాయి. మహేంద్ర రాజపక్స నలుగురు సోదరుల కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు 2015 ఎన్నికల్లో మహేంద్ర రాజపక్సను గద్దె దింపారు. రాజపక్స హయాంలో శ్రీలంక, భారత్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండేవి. మరోవైపు, గొటబాయతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కొలంబోలో సమావేశమయ్యారు. 29న గొటబాయా భారత్‌కు రానున్నారు. చైనా రుణాలు భారీగా.. మహేంద్ర రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, రేవులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం 700 కోట్ల డాలర్లకు పైగా రుణాలను తీసుకోవడంతో ఇప్పుడు చైనాతో సత్సంబంధాలు కొనసాగించక తప్పని పరిస్థితి. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో రుణాలు ఇచ్చి, వాటిని చెల్లించకపోతే విమానాశ్రయాలు, ఓడరేవుల్ని చైనా లీజుకి తీసుకోవడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన పుట్టిస్తోంది. యూరప్, ఆసియా మధ్య వాణిజ్య బంధాలకు ప్రతీకగా నిలిచిన దక్షిణ శ్రీలంకలో హమ్‌బటన్‌టోటా పోర్ట్ నిర్మాణానికి రుణాలు చెల్లించలేక 2017లో లంక ప్రభుత్వం 99 ఏళ్ల పాటు చైనాకు లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా శ్రీలంకకి ఉన్న అరుదైన పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చైనా చేస్తోంది. -
లంకలో మళ్లీ ‘రాజపక్స’
అయిదేళ్లక్రితం జరిగిన అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపాలైన రాజపక్స కుటుంబానికే ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధికార పీఠం దక్కింది. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స సోద రుడు, రక్షణశాఖ మాజీ మంత్రి గోతబయ రాజపక్స విపక్ష శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ఎల్ పీపీ) అభ్యర్థిగా రంగంలోకి దిగి 52.25 శాతం మద్దతు చేజిక్కించుకుని సోమవారం ఆ దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అధికార యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) 41.99 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. మహోద్రిక్తంగా, నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ ఎన్నికల్లో రాజపక్స కుటుంబ పునరాగమనం ఊహించని పరిణామమేమీ కాదు. నిజానికి నిరుడు ఏప్రిల్‌లో ఈస్టర్ పర్వదినాన రాజధాని కొలంబోలోని పలుచోట్లా, ఉత్తర ప్రాంత నగరం బట్టికలోవలోని చర్చిలో ఉగ్రవాదులు దారుణ మారణహోమాన్ని సృష్టించి 300మందికి పైగా పౌరులను పొట్టనబెట్టు కున్నప్పుడే ఈ పునరాగమనానికి బీజం పడింది. మన దేశం ముందస్తుగా హెచ్చరించినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిన లంక ప్రభుత్వం... అటు తర్వాత పెరిగిన విద్వేషాలను అదుపు చేయడంలో కూడా విఫలమైంది. ఉగ్రవాదులు జన్మతః ముస్లింలు గనుక ఆ వర్గానికి చెందినవారిపైనా, వారి వ్యాపార సంస్థలపైనా దుండగులు దాడులు చేశారు. బాధిత క్రైస్తవ వర్గాల ప్రజానీకం ముస్లింలపై దాడులు చేస్తారని ఆశించిన సింహళ తీవ్రవాద శక్తులు అలాంటిదేమీ జరగకపోవడంతో తామే స్వయంగా రంగంలోకి దిగాయి. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ సింహళ తీవ్రవాద సంస్థలు పదే పదే ఆరోపణలు చేయడంతో తొమ్మిదిమంది మంత్రులు, ఇద్దరు గవర్నర్లు రాజీనామాలు చేశారు. ఈ పరిణామాల పర్యవసానంగా తలెత్తిన అశాంతి అంతిమంగా రాజపక్స కుటుం బానికే తోడ్పడుతుందని రాజకీయ పరిశీలకులు అంటూ వచ్చారు. చివరకు అదే నిజమైంది. తరచు విధ్వంసాలకు దిగే తమిళ టైగర్లను కూకటి వేళ్లతో పెకలించివేసిన తాము కావాలో...భారీ పేలుళ్లు జరుగుతున్నాయని తెలిసినా చేతగానితనాన్ని ప్రదర్శించిన ప్రస్తుత అధినేతలు కావాలో తేల్చుకోవాలని రాజపక్స సోదరులు చేసిన ప్రచారం ఓటర్లను బాగా ఆకట్టుకుంది. సింహళ–బౌద్ధ జాతీయవాదాన్ని తలకెత్తుకుని ఎన్నికల ప్రచార పర్వాన్ని దేశ భద్రత చుట్టూ తిప్పడంలో రాజపక్స సోదరులు విజయం సాధించారు. అయితే వారు కేవలం దేశ భద్రత గురించి మాత్రమే చెప్పి ఊరుకోలేదు. దిగజారిన దేశ ఆర్థికవ్యవస్థను మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కిస్తామని, రైతులకు సబ్సిడీ లివ్వడం ద్వారా వ్యవసాయాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పన్నుల్ని గణనీయంగా తగ్గిస్తా మని చెప్పారు. ద్రవ్యోల్బణం, ఉపాధి లేమి, అధిక పన్నులు వగైరాలతో ఇబ్బందులు ఎదుర్కొం టున్న ప్రజానీకం ఆఖరికి శాంతిభద్రతలు కూడా కరువయ్యాయని ఆందోళనలో పడ్డారు. ఈ పరిస్థితి రాజపక్సకు కలిసొచ్చింది. దేశ జనాభాలో సింహళులు, క్రైస్తవులు 70శాతం ఉంటారు. ఈ రెండు వర్గాలనూ తనకు అనుకూలంగా మలచుకోవడంలో రాజపక్స విజయం సాధించారు. దానికితోడు యూఎన్‌పీ అభ్యర్థిగా సజిత్ ప్రేమదాస రాజకీయంగా అనామకుడు. ఆ పార్టీకి డిప్యూటీ నాయ కుడిగా ఉన్నా విధాన రూపకల్పనలో ఆయన పాత్ర దాదాపు శూన్యం. ఆ పనంతా ప్రధాని రణిల్ విక్రమసింఘే, ఆయనకు సన్నిహితంగా ఉండే అరడజనుమంది నేతలు చూసుకున్నారు. కనుకనే ఆ విధానాలపై వెల్లువెత్తిన విమర్శలకు ప్రేమదాస సమర్థవంతంగా జవాబు ఇవ్వలేకపోయారు. పర్య వసానంగా యూఎన్పీకి కంచుకోటలుగా ఉండే కొలంబో, కాండీ వంటిచోట్ల సైతం గోతబయ రాజపక్స పాగా వేయగలిగారు. మొత్తంగా లంకలో సింహళ పౌరుల జనాభా అధికంగా ఉండే దక్షిణ, పశ్చిమ, మధ్య శ్రీలంక ప్రాంతాల్లో గోతబయ రాజపక్సకు అత్యధిక ఓట్లు లభించగా...తమిళ జనాభా, ముస్లింలు ఎక్కువుండే ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో సజిత్‌కు 80 శాతం ఓట్లు వచ్చాయి. అయితే మహిందా రాజపక్స పాలనలో అమలైన అణచివేత విధానాలను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. వాటి అమలులో సోదరుడికి గొతబయ రాజపక్స రక్షణమంత్రిగా చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ పదేళ్లకాలంలో అనేమంది తమిళ రాజకీయ నాయకులు హత్యలకు గురికాగా, వేలాది మంది పౌరులు, పలువురు పాత్రికేయులు అదృశ్యమయ్యారు. వారిలో అనేకమంది ఆచూకీ ఇప్పటికీ తెలియడంలేదు. టైగర్ల అణచివేత మాటున తమిళులపై సాగించిన హత్యలు, అకృత్యాలపై ఐక్య రాజ్యసమితి పర్యవేక్షణలో విచారణ జరిగింది. ప్రత్యేకించి గోతబయ రాజపక్సపై పలు అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తమిళులపై సాగించిన హింసాకాండకు సంబంధించి అమెరికా న్యాయస్థానాల్లో సివిల్ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. 2009లో కొలంబో నగరంలో ఒక పత్రిక సంపాదకుడిని కాల్చిచంపిన కేసులో ఆయన ప్రమేయమున్నదని ఆరోపణలొచ్చాయి. మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో జవాబుదారీతనాన్ని నిర్ధారించి బాధ్యులపై చర్యలు తీసు కుంటామని నాలుగేళ్లక్రితం లంక ప్రభుత్వం హామీ ఇచ్చింది. సహజంగానే అలాంటి హామీలన్నీ ఇప్పుడు అటకెక్కుతాయి. పైకి ఏం చెప్పినా రాజపక్స సోదరుల మొగ్గు మొదటినుంచీ చైనావైపే ఉంటున్నది. టైగర్లను పూర్తిగా అణచివేశాక దేశవ్యాప్తంగా ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అత్యధిక భాగం కాంట్రాక్టులు చైనా సంస్థలకే లభించాయి. అప్పట్లో దక్షిణ హంబన్‌టోటాలో నిర్మించిన ఓడరేవుకు అయిన వ్యయాన్ని భరించలేక చివరకు దాన్ని నిర్మించిన చైనా సంస్థకే శ్రీలంక 99 ఏళ్ల లీజుకిచ్చింది. రాజపక్స పాలనాకాలంలో చైనా జలాంతర్గాముల్ని కొలంబో రేవులో లంగరేయడానికి అనుమ తించినందుకు మన దేశం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు మున్ముందు ఎలా ఉంటాయోనన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. తాను ప్రజానీకానికంతకూ ప్రాతినిధ్యం వహించే సమర్థపాలన అందిస్తానని గోతబయ అంటున్నారు. దాన్ని ఏమేరకు నిల బెట్టుకోగలరో చూడవలసి ఉంది.