సాక్షి, చెన్నై : దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ వేడుకకు హాజరయ్యేందుకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే సిద్ధమయ్యారు. రాజపక్సేకు ఆహ్వానం పంపడంపై రాష్ట్రంలో వ్యతిరేకత బయలు దేరింది. ఎండీఎంకే, నామ్ తమిళర్ కట్చి, ఈలం తమిళుల మద్దతు సంఘాలు, శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ, తమిళాభిమాన సంఘాలు నిరసనలకు దిగారు.నిరసనల హోరు: ఆదివారం పలు చోట్ల నిరసనలు చోటు చేసుకున్నాయి. రాజపక్సే గో బ్యాక్ అన్న నినాదాలు మిన్నంటాయి. బీజేపీ తీరును నిరసిస్తూ నాయకులు విమర్శలు గుప్పించారు. మే -17 సంస్థ నేతృత్వంలో వళ్లువర్‌కోట్టం వద్ద భారీ నిరసన కార్యక్రమం జరిగింది. యుద్ధం పేరుతో తమిళులపై నరమేధం సాగించిన రాజపక్సేకు రెడ్ కార్పెట్ ఆహ్వానం ఏర్పాట్లను నిరసనకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. యూపీఏ బాటలోనే బీజేపీ నడుస్తున్నదని, తమిళుల ఆగ్రహానికి బీజేపీ సర్కారుకు గురికాక తప్పదని హె చ్చరించారు.
న్యాయ కళాశాలల విద్యార్థుల నేతృత్వంలో రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు జరిగా యి. జాలర్ల సంఘాలు నేతృత్వంలో సముద్ర తీర జిల్లాలో నల్ల జెండాల ప్రదర్శన జరిగింది. నామ్ తమిళర్ ఇయక్కం నేతృత్వంలో పలు చోట్ల నిరసన సభలు జరగ్గా, తమిళర్ ఇలంజర్ పేరవై నేతృత్వంలో ఢిల్లీలో ఆందోళన జరిగింది. మనిదనేయ మక్కల్ కట్చి సైతం నిరసనకు దిగింది. ఇక, సినీ దర్శకులు భారతీరాజా, గౌతమ్ మీనన్‌లు తమ గళాన్ని విప్పారు. రాజపక్సేకు ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఢిల్లీ బాట: రాష్ట్రంలో ఈలం మద్దతు పార్టీలు, సంఘాలు నిరసనలు తెలియజేస్తుంటే, పలు పార్టీల నాయకులు ఢిల్లీ వెళ్లే పనిలో పడ్డారు. బీజేపీ కూటమిలోని డీఎండీకే, పీఎంకే నేతలు ఢిల్లీ బాట పట్టారు. ప్రమాణ స్వీకారానికి డీఎండీకే అధినేత విజయకాంత్‌తోపాటుగా మరొకరు, పీఎంకే నేత రాందాసు, అన్భుమణి ఢిల్లీకి వెళ్లినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలు తమ నేత ప్రమాణ స్వీకారోత్సవం నిమిత్తం ఢిల్లీకి బయలు దేరారు.
ఎండీఎంకే నేత వైగో ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. నల్ల జెండాల ప్రదర్శన లక్ష్యంగా ఆయన ఢిల్లీ బయలుదేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణ స్వీకారానికి దూరం కానున్నారు. తన దూతను కూడా పంపించే అవకాశాలు లేవంటూ సీఎంవో వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్, ఇళయ దళపతి విజయ్‌లకు ఆహ్వానం రావడంతో ఆ ఇద్దరు సోమవారం ఉదయాన్నే ఢిల్లీ వెళతారని సమాచారం.జాలర్ల విడుదలకు ఆదేశం: భారత్‌లో అడుగు పెట్టనున్న రాజపక్సే తమిళ జాలర్లను విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. శ్రీలంక చెరలో వందలాది మంది తమిళ జాలర్లు మగ్గుతున్న విషయం తెలిసిందే. అధికారిక లెక్కల మేరకు వస్తున్న సమాచారాలతో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి వారిని విడిపించుకుంటూ వస్తున్నారు. అయితే, అనధికారికంగా ఆ దేశ చెరల్లో మగ్గుతున్న వారెందరో ఉన్నారు. వీరి వివరాలు, పూర్తి లెక్కలు మాత్రం ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు.
ఈ పరిస్థితుల్లో మోడీ ప్రమాణ స్వీకారానికి బయలు దేరిన రాజపక్సే పనిలో పనిగా తమ దేశ జైళ్లల్లో ఉన్న తమిళులందరినీ విడుదల చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. అందర్నీ తమిళనాడుకు పంపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో ఆ దేశ జైళ్లలో ఉన్న జాలర్లకు సంబంధించిన బంధువులు, కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. భారత్‌తో సత్సంబంధాల మెరుగు లక్ష్యంగా రాజపక్సే ఉన్నారని, అందు వల్లే తమిళ జాలర్లను విడుదల చేయాలని ఆదేశించినట్టుగా ఆ దేశ మత్స్యశాఖ ప్రకటించింది. అయితే, శ్రీలంక చెరలో తమిళ జాలర్ల ఎందరు ఉన్నారో, ఎందరిని విడుదల చేయనున్నారో అన్న వివరాలను ప్రకటించక పోవడం గమనార్హం.
నిరసనల హోరు
Published Sun, May 25 2014 11:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement