జైట్లీ వరాలు
సాక్షి, చెన్నై:కేంద్రంలో కొత్తగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో తమిళనాడుకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశాభావం పెరిగింది. తమకు ఉన్న ఎంపీల సంఖ్యా బలం మేరకు కేంద్రంతో సానుకూలంగా మెలిగే పనిలో సీఎం జయలలిత పడటంతో ఇక నిధుల వరద పారుతుందన్న ధీమా పెరిగింది. అయితే, రైల్వే బడ్జెట్‌లో సదానంద ప్రకటన ఆశల్ని ఆవిరి చేసేంది. తమిళనాడుకు సదానంద హ్యాండివ్వడంతో ఆర్థిక బడ్జెట్‌లోను అదే పరంపర సాగొచ్చన్న నిరుత్సాహం ఆవహించింది.
అయితే, పెద్దల్ని మరింత అందలం ఎక్కించడంతో పాటుగా పేద, మధ్య తరగతి వర్గాల మీద, రాష్ట్రాలు దృష్టి పెట్టేవిధంగా బడ్జెట్‌ను గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించేశారు. సదానంద బాటలో: తమిళనాడు విషయంలో కొన్ని అంశాల్లో రైల్వే మంత్రి సదానంద బాట లోనే జైట్లీ నడిచారని చెప్పవచ్చు. చెన్నై నుంచి ఇతర రాష్ట్రాల్ని అనుసంధానించే విధంగా కొత్త రైళ్లను సదానంద ప్రకటిస్తే, పారిశ్రామిక కారిడార్ల విషయంలో అదే బాణిని అరుణ్ జైట్లీ అనుకరించారు. చెన్నై టూ విశాఖ, చెన్నై టూ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రస్తావన తెచ్చిన ఆయన, మదురై - తూత్తుకుడి పారిశ్రామిక కారిడార్ ప్రస్తావనను మరిచారు. ఈ కారిడార్ ప్రస్తావనను తన బడ్జెట్‌లో తెచ్చి ఉంటే, దక్షిణాది జిల్లాల ప్రజల మన్ననలు అందుకుని ఉండేవారు. పారిశ్రామికంగా వెనుకబడి ఉన్న ఈ ప్రాంతాలు అభివృద్ధికి ఊతం ఇచ్చినట్లు ఉండేది.
అయితే, దక్షిణ తమిళనాడు విషయంలో సదానందను అనుకరించడంతో అక్కడి ప్రజలనుంచి జైట్లీకి వ్యతిరేకత తప్పదు. విశాఖ - చెన్నై కారిడార్‌ను ఈస్ట్ కోస్ట్ కారిడార్‌గా మార్చి మదురై -తూత్తుకుడి వరకు పొడిగించాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. మెరుగు: చెన్నై వరకు కారిడార్లను తీసుకొచ్చి వదలి పెట్టిన జైట్లీ, మరి కొన్ని ప్రకటనలతో తమిళుల్ని ఆకర్షించారు. చెన్నై మహానగరానికి కూత వేటు దూరంలో, తమిళనాడు - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులో గుమ్మిడి పూండి సమీపంలో ఉన్న పొన్నేరిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే జాబితాలోకి చేర్చడం విశేషం. అత్యధికంగా జనాభా కలిగి, రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ పొన్నేరిని ఆధునీకరించడం ద్వారా అక్కడి ప్రజల జీవన స్థితి మరింత మెరుగు పడే అవకాశాలు అధికం. మద్రాసు మెడికల్ కళాశాలలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏజెన్సీ ఏర్పాటుతో పరిశోధనలను మరింత ప్రోత్సహించేం దుకు నిర్ణయించారు.
తద్వారా రాష్ట్రంలో ఆధునిక వైద్య సేవలు, పేదలకు మరింత చేరువయ్యే అవకాశాలు ఉంటారుు. ఆధునిక వైద్య ఆస్పత్రులకు నిధుల ప్రకటించిన దృష్ట్యా, చెన్నైలో ఎయిమ్స్ తరహా ఆస్పత్రి రూపు దిద్దుకోవడం ఖాయం. ఇక, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తరచూ తెర మీదకు రావడం, అధికారుల శ్రమతో సమసి పోవడం జరుగుతూ వస్తున్న తరుణంలో సౌరశక్తి విద్యుత్ ప్లాంట్ ప్రకటన ప్రత్యేక ఆకర్షణగా మారింది. హార్బర్లకు నిధుల కేటాయింపుల ప్రస్తావనతో తూత్తుకుడి హార్బర్ మీద పెట్టుబడులు అధికంగా పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. సాంస్కృతిక పట్టణాలు: కాంచీపురం, వేలాంక న్ని, శ్రీరంగం పట్టణాలు ఆధ్యాత్మికంగా, పర్యాటకంగాను బాసిల్లుతున్నాయి. వీటికి మరింత వన్నె తెచ్చే రీతిలో సాంస్కృతిక (హెరిటేజ్) పట్టణాల జాబితాలో చేర్చడం ప్రశంసనీయం. మెగా క్లస్టర్‌కు తమిళనాడు వేదిక కానుండడం మరో విశేషం. దీని కోసం గిరిజన, వెనుకబడిన వర్గాల తండాల్లో ప్రగతి లక్ష్యంగా కేటాయిం పులు, గ్రామ సడక్ యోజన పథకాలు జాతీయ స్థాయిలో ప్రకటించారు. వీటి ద్వారా తమిళనాడులో లబ్ధి పొందే గ్రామాలు అనేకం ఉన్నాయి. ఇక, కేంద్ర బడ్జెట్ మేరకు రాష్ట్ర అన్నదాతలకు ఆర్థికంగా భరోసా దక్కడం ఖాయం.
ప్రశంసలు, విమర్శలు
డీఎండీకే అధినేత విజయకాంత్ పేర్కొంటూ, అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారని ప్రశంసించారు. పీఎంకే నేత రాందాసు పేర్కొంటూ, జాతీయ స్థాయి అభివృద్ధి నినాదంతో ఈ బడ్జెట్ ఉందని కితాబు ఇచ్చారు. సీపీఐ నేత టీ పాండియన్ పేర్కొంటూ, ప్రభుత్వ రంగ సంస్థలకు పెను ప్రమాదం సృష్టించే అంశాలు కొన్ని బడ్జెట్‌లో ఉన్నాయని విమర్శించారు. యాజమాన్యాలకు పెద్ద పీట వేస్తున్నట్టుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐజేకే నేత పచ్చముత్తు పారివేందన్ పేర్కొంటూ, ఉచితాల్ని పక్కన పెట్టి, దేశ భవిష్యత్తు, గ్రామాల అభ్యున్నతికి పెద్ద పీట వేయడం అభినందనీయమన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొంటూ, నదుల అనుసంధానం మీద దృష్టి పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే, పెద్దగా మార్పులు లేవని, తమిళనాడుకు పెట్టుబడులు, పరిశ్రమలు లేవంటూ విమర్శించారు.