సీఎం అభ్యర్థి నేనే
బీజేపీ కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. తనను ఆ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెచ్చే పనిలో పడ్డారు. విజయకాంత్ నిర్ణయాన్ని కమలనాథుల దృష్టికి తీసుకెళ్లేందుకు డీఎండీకే వర్గాలు సిద్ధమయ్యాయి.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో విజయకాంత్‌కు కమలనాథులు ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. నరేంద్ర మోదీ ప్రచారానికి వచ్చినప్పుడు విజయకాంత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. విజయకాంత్ భుజం మీద చేతులు వేస్తూ, ఆయన్ను ఆహ్వానించే రీతిలో వ్యవహరించి డీఎండీకే ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టారు. అయితే, ఎన్నికల అనంతరం విజయకాంత్‌కు అడుగడుగున అవమానాలే ఎదురయ్యూరుు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు పలు మార్లు యత్నించినా అనుమతి కరువైంది. కాశ్మీర్ నివారణ నిధి ఇద్దామన్నా అందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. బీజేపీ మీద గుర్రుగా ఉన్న విజయకాంత్ ఆ కూటమిలో ఇంకా కొనసాగాలా? అన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ కూటమిలో ఎండీఎంకే నేత వైగోకు ఎదురైన పరాభావాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యే తమకు తప్పదన్న విషయాన్ని గ్రహించి బీజేపీ నుంచి జారుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
బీజేపీ, పీఎంకేలకు షాక్
బీజేపీ కూటమిలో ఉన్నామా..? లేదా..? అని చెప్పుకునే పరిస్థితుల్లో లేని పీఎంకే నేత రాందాసు కాసేపు కూటమికి అనుకూలంగా, మరి కాసేపు తమ నేతృత్వంలో కూటమి అంటూ వ్యాఖ్యానిస్తుండడాన్ని విజయకాంత్ పరిశీలించారు. తమ నేతృత్వంలో కూటమి అన్నప్పుడు అధినేత రాందాసు తనయుడు అన్భుమణి రాందాసు సీఎం అభ్యర్థి అన్న నినాదాన్ని పీఎంకే వర్గాలు అందుకున్నాయి. ఈ పరిణామాలన్నీ తన ఆశల్ని ఎక్కడ అడియాశలు చేస్తాయోనన్న విషయాన్ని గ్రహించిన విజయకాంత్ మేల్కొన్నారు. బీజేపీ, పీఎంకేలకు షాక్ ఇచ్చేందుకు నిర్ణయించారు. పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చి అందులో చర్చించే అంశాల్ని పార్టీ వర్గాల ద్వారా బయటకు పంపించే పనిలో పడ్డారు. జనవరి ఏడో తేదీన కోయంబత్తూరు వేదికగా జరిగే కార్యవర్గం భేటీ అసెంబ్లీ ఎన్నికల దశ, దిశ నిర్దేశం లక్ష్యంగా సాగబోతోందని డీఎండీకే నేతలు ప్రకటించారు. అరుుతే అంతలోపే బిజేపి కూటమి సీఎం అభ్యర్థిగా తమ నేత విజయకాం త్ పేరును ప్రకటించాల్సిందేనన్న నినాదాన్ని అందుకుని ప్రచారం చేస్తున్నారు.
విజయకాంత్ సూచన మేరకు డీఎండీకే వర్గాలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ కూటమి సంసిద్ధత వ్యక్తం చేస్తే సరే, లేని పక్షంలో ఆ కూటమికి జనవరి 7న టాటా చెప్పేందుకు విజయకాంత్ సిద్ధమవుతున్నారు. కూటమిలో తాను ఉండాల్సిన అవసరం ఉన్నట్టుగా బీజేపీ నాయకులెవ్వరైనా వ్యాఖ్యలు చేసిన పక్షంలో, సర్వ సభ్య సమావేశంలో విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసే రీతిలో తీర్మానం చేయడానికి డీఎండీకే వర్గాలు వ్యూహ రచన చేయడం గమనార్హం.