లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతు, ఓటు బ్యాంక్ పతనం వెరసి డీఎండీకే అధినేత విజయకాంత్‌ను డైలమాలో పడేశాయి. మళ్లీ బలం పుంజుకోవడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకుల చెంతకు స్వయం గా వెళ్లేందుకు ఆయన నిర్ణయించారు. రోజుకో జిల్లాను ఎంపిక చేసుకుని పార్టీ వర్గాల మొరను ఆలకించడంతో పాటుగా బలోపేతానికి మార్గదర్శకాలను ఉపదేశించనున్నారు.
సాక్షి, చెన్నై : బీజేపీ కూటమితో కలసి లోక్‌సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 14 స్థానాల బరిలో అభ్యర్థులను నిల బెట్టిన విజయకాంత్‌ను ఫలితాలు పెద్ద షాక్‌కు గురి చేశాయి. సేలంలో తన బావమరిది సుదీష్ తప్పకుండా గెలుస్తాడని, మరో స్థానం తప్పకుండా తమ గుప్పెట్లోకి వస్తుందన్న ఆశాభావంతో ఉన్న విజయకాంత్ చివరకు భంగ పడ్డారు. డిపాజిట్లు గల్లంతు కావడంతోపాటుగా పూర్వం ఉన్న ఓటు బ్యాంక్ పతనంతో డైలమాలో పడాల్సి వచ్చింది. తమను నమ్ముకుని లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్న బీజేపీ, తమ కంటే ఎక్కువ ఓటు బ్యాంక్‌ను దక్కించుకోవడం డీఎండీకే నేతలను, ఆ పార్టీ వర్గాల్ని కలవరంలో పడేసింది.
కలవరం : తమ ఓటు బ్యాంక్‌ను బీజేపీ కొల్లగొట్టినా, ఆ ప్రభుత్వంలో తమకు చోటు దక్కని దృష్ట్యా, తీవ్ర అసంతృప్తితో విజయకాంత్ ఉన్నారు. పార్టీ అభ్యర్థుల ఓటమి కారణాల్ని అన్వేషించారు. పార్టీ నుంచి వలసలు బయలు దేరకుండా జాగ్రత్తలు పడ్డారు. తనయుడు చిత్ర షూటింగ్ నిమిత్తం సింగపూర్‌కు చెక్కేశారు. సింగపూర్ నుంచి తిరుగు పయనమైన విజయకాంత్ ఇక, పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టేందుకు నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో చతికిలబడ్డ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధం అయ్యారు. కార్యకర్తలు, నాయకులను తన వద్దకు పిలిపించుకోవడం కన్నా, స్వయంగా తానే వారి వద్దకు వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు.
కార్యకర్తల చెంతకు : పార్టీ బలోపేతానికి తానొక్కడినే నిర్ణయం తీసుకోకుండా, పార్టీ శ్రేణుల అభిప్రాయాల సేకరణ, కార్యకర్తల మొరను ఆలకించే విధంగా కార్యాచరణను విజయకాంత్ సిద్ధంచేశారు. రోజుకో జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ వార్డు కమిటీ నుంచి గ్రామ, పట్టణ, యూనియన్, నగర, జిల్లా కార్యవర్గాలతో సమావేశం కానున్నారు. సభ్యత్వ గుర్తింపు కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ విజయకాంత్ సమావేశానికి హాజరు కావాలని పార్టీ అధిష్టానం పిలుపు నివ్వడం గమనార్హం.
26 నుంచి పర్యటన : విజయకాంత్ పర్యటన వివరాలను డీఎండీకే రాష్ట్ర పార్టీ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది.
ఈనెల 26న కోయంబత్తూరు నుంచి తన పర్యటనకు విజయకాంత్ శ్రీకారం చుట్టనున్నారు. 27న తిరుప్పూర్, 28న కరూర్, 29న నామక్కల్, 30న సేలం, జూలై ఒకటిన ధర్మపురి, రెండున కృష్ణగిరి, మూడున వేలూరు, నాలుగున తిరువణ్ణామలైలో తొలి విడత పర్యటన సాగనుంది.