షరతులు!
Published Thu, Jan 2 2014 3:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
డీఎండీకే అధినేత విజయకాంత్ సినీ ఫక్కీల్లో రాజకీయ తంత్రాల్ని ప్రయోగించే పనిలో పడ్డారు. కేజ్రీవాల్‌ను తలదన్నే రీతిలో కొత్త పల్లవి అందుకున్నారు. తనతో జత కట్టాలంటే షరతులను అంగీకరించాల్సిందేనన్న అల్టిమేటాన్ని ఇచ్చే పనిలో పడ్డారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావుకు షాక్ ఇచ్చే విధంగా నిబంధనలను, కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకే వాసన్‌కు పదవుల పందేరంలో ఆంక్షలను విధించడం గమనార్హం.
సాక్షి, చెన్నై :రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పొత్తుల వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. అన్నాడీఎంకే ఒంటరిగా పోటీకి సిద్ధపడగా, డీఎంకే తమతో జత కట్టే వారి కోసం ఎదురుచూస్తోంది. ఇక డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తమ నేతృత్వంలో మెగా కూటమికి బీజేపీ కసరత్తుల్లో ఉంది. పీఎంకే, ఎండీఎంకేలు బీజేపీతో జత కట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు కమలనాథులు తీవ్రంగా నే కుస్తీ పడుతున్నారు. అదే సమయంలో తమతో జత కట్టాలంటూ ఓవైపు కాంగ్రెస్, మరో వైపు డీఎంకే పిలుపునిచ్చే పనిలో పడ్డాయి. దీంతో విజయకాంత్‌కు డిమాండ్ పెరిగింది.
రాష్ట్రంలో మెజారిటీ శాతం సీట్లు ఎవరైనా చేజిక్కించుకోవాలన్నా, విజయకాంత్ మద్దతు తప్పనిసరి. ఇందుకు కారణం ఆ పార్టీ కలిగి ఉన్న ఓటు బ్యాంకు. ఎవరితో జతకట్టాలన్న విషయమై తేల్చుకునేందుకు మళ్లీ పార్టీ సర్వ సభ్యసమావేశానికి సైతం పిలుపునిచ్చారు. అదే సమయంలో తన మద్దతు ఎవరికైనా కావాలంటే షరతులకు తలొగ్గాల్సిందేనన్న నినాదాన్ని తెర మీదకు తెచ్చారు. ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ ఢీల్లీ పీఠాన్ని చేజిక్కించుకునే క్రమంలో కాంగ్రెస్‌కు ఏ విధంగా షరతులను విధించారో దాన్ని తలదన్నే రీతిలో కెప్టెన్ షరతులు పెట్టినట్లు వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం రాయబారానికి వెళ్లిన బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావుకు షాక్ ఇచ్చే విధంగా ఈ షరతుల చిట్టాను కెప్టెన్ బావమరిది, డీఎండీకే యువజన నేత సుదీష్ తెరపైకి తెచ్చినట్టు సమాచారం.
సంప్రదింపులు
బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు విజయకాంత్‌తో సంప్రదింపులకు ఓ కమిటీ రంగంలోకి దిగింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు నేతృత్వం లోని ఈ కమిటీ రెండు రోజుల క్రితం విజయకాంత్‌తో సంప్రదింపులకు సిద్ధ పడ్డట్టు సమాచారం. తొలి విడత సంప్రదింపులు తన బావమరిది, యువజన నేత సుదీష్‌తో జరుపుకోవాలని విజయకాంత్ సూచిం చినట్లు తెలుస్తోంది. కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో జరిగిన తొలి విడత సంప్రదింపుల్లో సుదీష్ షరతుల చిట్టాను బీజేపీ బృందం ఎదుట ఉంచడంతో వారు విస్తుపోయూరు. ఇదే అనుభవం రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రధాన గ్రూపు నేత, కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి జీకే వాసన్‌కు ఎదురైనట్టు తెలిసింది. మంగళవారం రాత్రి విరుగంబాక్కం కన్నబీరాం నగర్‌లోని విజయకాంత్ ఇంటికి వెళ్లిన వాసన్ రాజకీయ చర్చ జరిపారు. ఇదే విషయాన్ని బుధవారం మీడియాతో మాట్లాడుతూ వాసన్ స్పష్టం చేశారు. చర్చల లోతుల్లోకి వెళ్లేందుకు ఆయన నిరాకరించడాన్ని బట్టి చూస్తే, కెప్టెన్ షరతులు కఠినంగా ఉన్నాయన్న విషయం స్పష్టం అవుతోంది.
కెప్టెన్ నేతృత్వంలోనే కూటమి!
విశ్వసనీయ సమాచారం మేరకు కెప్టెన్ షరతులు మరీ కఠినంగా ఉండటం గమనార్హం. ప్రధానంగా తన నేతృత్వంలోనే రాష్ట్రంలో కూటమి ఆవిర్భవించాలని, సీట్ల పందేరం, ఎవరెక్కడ పోటీ చేయాలని, ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక తన కనుసన్నల్లోనే జరగాలని, ఉత్తరాది జిల్లాల్లోని అన్నిసీట్లలో తామే పోటీ చేయాలన్న నిబంధనలు విజయకాంత్ విధించారు. ఇవన్నీ సీట్ల పందేరం వేళ కాస్త సర్దుకు వెళ్లేందుకు ఆస్కారం ఉన్నా, చిట్ట చివరగా విధించిన షరతు దిమ్మ తిరేగేలా ఉండడం గమనార్హం. తమ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు అంతా జాతీయ పార్టీలే భరించాలన్న నిబంధన బీజేపీ బృందాన్ని ఆలోచ నలో పడేసిందట. ఆ చిట్టాను పరిశీలించిన ఆ బృందం మరోమారు చర్చించుకుందామని వెనుదిరిగినట్టు తెలిసింది.
ఇక, వాసన్ జరిపిన సంప్రదింపుల్లో ఏకంగా 25 సీట్లలో తాము పోటీ చేస్తామని, కాంగ్రెస్ పదిహేను చోట్ల పోటీ చేస్తే చాలన్న నిబంధనను కెప్టెన్ విధించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి చూస్తే కెప్టెన్ షరతులకు లోబడే వారెవ్వరో అన్నది మరి కొద్ది రోజుల్లో తేలబోతోంది. అదే సమయంలో తమతో చేతులు కలిపేందుకు ఎలాంటి నిబంధనలు ఉండబోవన్న ధీమాను డీఎంకే వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
Advertisement
Advertisement