బీజేపీతోనే కెప్టెన్
బీజేపీతోనే కెప్టెన్
Published Fri, Mar 7 2014 1:30 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికలను కూటమిగా ఎదుర్కొనేందుకు నిర్ణయించినట్టు డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రకటించారు. బీజేపీతో కూటమి చర్చలు జరుపుతున్నామని గురువారం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్ష నేతగా ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్‌తో పొత్తుకు పలు పార్టీలు తహతహలాడుతున్నాయి. ఆ పార్టీకి రాష్ర్టంలో పది శాతం ఓటు బ్యాంక్ ఉండటం తమకు కలసి వస్తుందన్న ఆశతో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేలు ప్రయత్నించాయి. పలు దఫాలుగా డీఎండీకే కార్యాలయం మెట్లను డీఎంకే ప్రతినిధులు ఎక్కినా ఫలితం శూన్యం. దీంతో ఆ పార్టీని ఇక ఆహ్వానించబోమంటూ డీఎంకే తేల్చిం ది. అదే సమయంలో రాష్ట్రంలో ఒంటరిగా మిగిలిన కాంగ్రెస్ విజయకాంత్‌ను అక్కున చేర్చుకునేందుకు కుస్తీలు చేస్తూ వస్తోంది. అలాగే, బీజేపీ సైతం తమ కూటమిలోకి విజయకాంత్‌ను ఆహ్వానించేందుకు తీవ్ర ప్రయత్నాల్లో నిమగ్నం అయింది.
రోజుకో కథనం పత్రికల్లో వచ్చినా డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం నోరు మెదపలేదు. మౌనంగానే అన్నింటినీ పరిశీలిస్తూ వచ్చారు. పలు దఫాలు మీడియా ముందుకు వచ్చిన విజయకాంత్‌ను ఆ కథనాల గురించి ప్రశ్నిస్తే, వాళ్లనే అడగండంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం. బీజేపీతో పొత్తు ఖరారైనట్టు వార్తలొచ్చినా ఆయన పట్టించుకోలేదు. బుధవారం బీజేపీ కూటమి ప్రకటన వాయిదా పడడంతో కాంగ్రెస్ వైపు విజయకాంత్ దృష్టి పెట్టినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఒంటరిగా ఆయన ఎన్నికల్లోకి వెళ్లనున్నారన్న వార్తలు ప్రచురితం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇంత వరకు తాను కూటమి గురించి ఏ ఒక్కరితోనూ చర్చించలేదని, ఏ పార్టీతోనూ ఇంత వరకు పొత్తు ఖరారు చేయలేదని గురువారం ప్రకటన విడుదల చేశారు.
పొత్తుకు రెడీ: డీఎండీకే కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు రానున్న లోక్‌సభ ఎన్నికలను కూటమిగా ఎదుర్కొనేందుకు నిర్ణయించినట్టు ప్రకటించారు. బీజేపీతో కూటమిచర్చలు జరుపుతున్నామంటూ రెండు ముక్కల్లో ముగించడం గమనార్హం. అయితే, ఈ పొత్తుల చర్చ ఎన్ని మలుపులు తిరగనున్నదో వేచి చూడాల్సిందే. విజయకాంత్ డిమాండ్లకు ఇప్పటికే బీజేపీ తలొగ్గిన దృష్ట్యా, ఆ కూటమితో దోస్తీకట్టినట్టేనని డీఎండీకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ అధిష్టానంతో రాష్ర్ట పార్టీ శ్రేణులు గురువారం మంతనాలు జరపడం, డిమాండ్లు, సీట్ల పందేరం కొలిక్కి వచ్చినట్టుగా అక్కడి నుంచి వచ్చిన సంకేతాల మేరకు విజయకాంత్ ఈ ప్రకటన చేసినట్టు పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement