ఏం చేద్దాం?
బీజేపీ కూటమి నుంచి వైదొలగేందుకు డీఎండీకే సన్నద్ధమవుతోంది. వైగోకు ఎదురైన అవమానం తమకు ఎదురయ్యేలోపు పక్కకు తప్పుకుంటే మంచిదన్న యోచనలో విజయకాంత్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు పార్టీ వర్గాలతో మంతనాల్లో మునిగారు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకేకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నీడన చేరాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడం విజయకాంత్ ను డీలా పడేలా చేసింది. ఎన్నికల సమయంలో కుదర్చుకున్న ఒప్పందాల మేరకు తమకు బీజేపీ న్యాయం చేస్తుందన్న ఆశాభావంతో ఉన్న విజయకాంత్‌కు చివరకు మిగిలింది నిరాశే. తన బావమరిది సుదీష్‌కు ఇస్తామన్న రాజ్యసభ సీటును ఇవ్వక పోగా, చివరకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ సైతం విజయకాంత్‌కు కరువైంది.అప్పటి నుంచి బీజేపీ మీద ఆయన గుర్రుగానే ఉన్నారు. సమయం వచ్చినప్పుడల్లాకేంద్రంపై దూకుడుగా స్పందించిన విజయకాంత్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల వేళ తగ్గారు. బీజేపీ వర్గాలు బుజ్జగించడంతో తన మద్దతును ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కేవలం మద్దతు మాత్రమే ప్రకటించి, ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాల్ని విజయకాంత్ నిశితంగా పరిశీలిస్తున్నారు. పార్టీ జిల్లాల నాయకులతో తరచూ సంప్రదింపులు జరుపుతూ ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై సలహాలు సూచనలు ఇచ్చే పనిలో పడ్డారు.
టాటా : బీజేపీ నేతల తీరును నిశితంగా పరిశీలిస్తున్న విజయకాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన నేతృత్వంలోని కూటమికి ఆ పార్టీ కట్టుబడుతుందా? అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. కమలనాథులు సూపర్ స్టార్ రజనీకాంత్ జపం అందుకున్న దృష్ట్యా, ప్రస్తుతం ఆ పార్టీ కూటమి నుంచి నెమ్మదిగా జారుకుని, ప్రత్యామ్నాయ మార్గం మీద దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కూటమిలోని ఎండీఎంకేను పొమ్మనకుండా పొగ పెట్టే రీతిలో బీజేపీ వ్యవహరించిన తీరును విజయకాంత్ తప్పుబడుతున్నారు. ఈ రోజు ఎండీఎంకేకు ఎదురైన పరాభావం రేపు తమకు ఎదురు కాదనడంలో గ్యారంటీ ఏమిటీ..? అన్న ప్రశ్నను డీఎండీకే నాయకులు పలువురు విజయకాంత్ ముందు ఉంచినట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికల ముందు నోరు విప్పేందుకు భయపడే బీజేపీ నాయకులు పలువురు, ఇప్పుడు జబ్బలు చరుస్తున్నారు.
మున్ముందు తమతో కూడా ఇదే రకంగా వ్యవహరిస్తారన్న భావనలో డీఎండీకే నాయకులు ఉన్నారు. దీంతో మనమూ టాటా చెప్పేద్దాం! అన్న యోచనకు విజయకాంత్ వచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ వర్గాలతో సంప్రదింపుల అనంతరం తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీతో విభేదాలు లేవు. అలాగనీ మిత్ర బంధం కూడా లేదు. ఈ సమయంలో ఉన్నట్టుండి బయటకు వెళ్లడం కన్నా, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఈలం తమిళుల విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయం మేరకు స్వరాన్ని పెంచేందుకు నిర్ణయించారు. ఎలాగూ శ్రీలంకకు అనుకూలంగా ప్రధాని మోదీ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్న దృష్ట్యా, ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని మోదీపై విమర్శలతో బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు విజయకాంత్ సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.