కెప్టెన్‌గానే..
ప్రజా సంక్షేమ కూటమికి ‘కెప్టెన్’ చేకూరాడు. వైగో నేతృత్వంలో సాగుతున్న కూటమిలో డీఎండీకే చేరడం ద్వారా విజయకాంత్ ఒంటరి పోరుకు తెరదించాడు. అలాగే పొత్తులు పెట్టుకున్నా సీఎం అభ్యర్థిగా మాత్రమే ఎన్నికల బరిలోకి దిగుతాననే పంతాన్ని కెప్టెన్ ఎట్టకేలకూ నెగ్గించుకున్నాడు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులతో రాజకీయపార్టీల వ్యూహాలన్నీ ఒక కొలిక్కివచ్చినా డీఎండీకే మాత్రం నాన్చుడు ధోరణిని అవలంభించింది. ఇదిగో వస్తా, అదిగో చె బుతా అంటూ డీఎంకే, బీజేపీలను ఊరిం చి ఉడికించింది. చివరకు డీఎండీకే ఒంటి రి పోరుకు సిద్ధపడినట్లు ఇటీవల విజయకాంత్ ప్రకటించాడు. రాజకీయపార్టీలన్నీ విజయకాంత్ ప్రకటనతో నివ్వెరపోయాయి. డీఎండీకేపై బీజేపీ ఆశలు వదులుకోగా డీఎంకే మాత్రం ‘వస్తాడు నా రాజు ఈరోజు’ అంటూ సోమవారం వర కు పాటలు పాడుకుంటూ ఆశతో ఎదురు చూసింది.
ఖంగు తినిపించిన విజయకాంత్: రాజకీయ నిర్ణయాల్లో ఆచీతూచీ అడుగేస్తున్నట్లుగానే వ్యవహరిస్తూ పొత్తు లు, కూటములపై జాప్యం చేస్తూ వచ్చిన విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరడం ద్వారా అందరినీ ఖంగుతినిపించాడు. కూటమి నేత వైగో, విజయకాంత్ సూలైలోని ఒక స్నేహితుని ఇంటిలో రెండురోజుల క్రితం కలుసుకున్నారు. విజయకాంత్ సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్‌లు కెప్టెన్ వెంట ఉన్నారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా వైగో సోమవారం కూటమినేతలో మరోసారి సమావేశం అయ్యారు. దీంతో డీఎండీకేతో పొత్తు కుదిరింది. మంగళవారం ఉదయం 9.45 గంటలకు విజయకాంత్, సుదీష్ తదితర ముఖ్యనేతలు కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి వెనుకవైపు ద్వారం గుండా చేరుకున్నారు. 9.50 గంటలకు వైగో, వీసీకే అధ్యక్షులు తిరుమావలవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ రామకృష్ణన్ వచ్చి విజయకాంత్‌తో చర్చలు జరిపారు.
సుహృద్భావ వాతావరణంలో చర్చలు ముగియగా పొత్తు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ప్రజా సంక్షేమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ పేరును నిర్దారించారు. అలాగే డీఎండీకేకు 124సీట్లు, వైగో బృందానికి 110 సీట్లు కేటాయించేలా ఒప్పందం జరిగింది. వైగో మాట్లాడుతూ తమ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరడం హాస్యాస్పదమని పీఎంకే అధికార ప్రతినిధి బాలు వ్యాఖ్యానించారు. కూటమి నేతలు ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నీరుగారిపోయాయని ఎద్దేవా చేశారు. విజయకాంత్ తన రాజకీయ జీవితాన్ని వృథా చేసుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సానుభూతి వ్యక్తం చేశారు.