మద్దతుపై విజయకాంత్ మెలిక
సాక్షి, చెన్నై : శ్రీరంగం ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతు విషయంలో డీఎండీకే అధినేత విజయకాంత్ కొత్త మెలిక పెట్టారు. పార్టీ శ్రేణులతో ఆదివారం చెన్నైలో సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ ఢిల్లీ పెద్దలు అమిత్ షా , ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారు కోరినప్పుడే ప్రచారంలోకి వెళ్లడం, బహిరంగంగా మద్దతు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
డీఎండీకే మద్దతుతో శ్రీరంగం ఉప ఎన్నిక బరిలో తాము దిగుతున్నామని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. విజయకాంత్ తమకు మద్దతు ఇచ్చారని బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారేగానీ, డీఎండీకే వర్గా లు మాత్రం బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. లోపాయి కారి ఒప్పందం మేరకు ఈ మద్దతు ఉందన్న ప్రచారం సాగుతున్న సమయంలో విజయకాంత్ కొత్త మెలిక పెట్టే పనిలో పడ్డారు. మెలికలు పెట్టడంలో ఆరి తీరిన విజయకాంత్ బీజేపీకి మద్దతు విషయంలో ఇప్పుడే అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు.
సమావేశం :
శ్రీరంగంలోని పార్టీ నాయకులు, అన్ని జిల్లాల కార్యదర్శులను ఆగమేఘాలపై ఆదివారం విజయకాంత్ చెన్నై కు రప్పించారు. కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు ఈ సమావేశం సాగింది. ఇందులో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొన్ని జిల్లాల్లో పార్టీ నిర్వాహకుల తీరును ఆరా తీసి, వారిని తొలగించేందుకు నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ పరంగా కొన్ని జిల్లాల్లో ప్రక్షాళనకు విజయకాంత్ నిర్ణయించినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రీరంగం ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు విషయమై సుదీర్ఘ చర్చ సాగినట్టు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రమే తనను కలిసి వెళ్లడం, జాతీయ నాయకులెవ్వరూ కనీసం మాట వరుసకైనా ఫోన్లో కూడా మాట్లాడక పోవడాన్ని విజయకాంత్ తీవ్రంగా పరిగణించారు.
ఈ దృష్ట్యా, ఉప ఎన్నికల్లో మద్దతు తెలియజేయడంతో పాటుగా బీజేపీ అభ్యర్థితో కలసి ఓట్ల వేటకు వెళ్లడం, తానే స్వయంగా ప్రచారానికి వెళ్లే విషయంగా చర్చించి ఓ కొత్త మెలికను బీజేపీ అధిష్టానం ముందు ఉంచేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేదా, ఇతర నాయకులు లేదా ప్రధాని నరేంద్ర మోదీలో ఎవరో ఒకరు తనతో ఫోన్లో సంప్రదించి మద్దతు కోరినప్పుడే స్పందించేందుకు నిర్ణయించి నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ వర్గాలు మద్దతు ప్రకటించినట్టు చెబుతున్నాయిగా? అని డీఎండీకే వర్గాలను ప్రశ్నించగా, వాళ్లు చెబితే చెప్పుకోనీయండి, తాము ప్రచారం బరిలో దిగాలిగా అని పేర్కొనడం గమనార్హం. తమను బీజేపీ పెద్దలు ఎవ్వరూ సంప్రదించని పక్షంలో ఇతర పార్టీల వలే మౌనంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు.